హైదరాబాద్: ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తామని కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్ రావు థాక్రే సూటిగా ప్రశ్నించారు. పార్టీలో తమ మన అభిప్రాయభేదాలు రానివ్వొద్దని, సీనియర్లు అంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీలో అందరిని కులుపకోవల్సిన బాధ్యత టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
శనివారం గాంధీభవన్‌లో జరిగిన టిపిసిసి విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొన్న మాణిక్ రావు థాక్రే మాట్లాడారు.. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారని, సీనియర్లు కూడా 20 నుంచి 30 నియోజకవర్గాలో పాదయాత్రలు చేయాలని ఆయన సూచించారు. ఎముకులు కొరికే చలిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని, ఆయన సందేశాన్ని గడప గడపకు తీసుకువెళ్ళాలని కోరారు.
యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదని, ఎవరికి అనుకూలం కాదన్నారు. అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే తన విధి అని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లడవద్దని చెప్పారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడవద్దన్నారు. ఏదైన సమస్య ఉంటే తనతో మాట్లాడాలని, తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలిపారు.