Monday, December 23, 2024

మణిపూర్‌లో వెలుగులోకి మరో దారుణం

- Advertisement -
- Advertisement -

మరో ఇద్దరు యువతులపై సామూహిక హత్యాచారం
నగ్న ఊరేగింపు ఘటనజరిగిన రోజే 40 కిలో మీటర్ల దూరంలో అమానుషం

ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు చిమ్ముతున్న తరుణంలోనే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మే నెల 4వ తేదీ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక హత్యాచారం జరిగినటు ్లతెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 21నుంచి పాతికేళ్ల లోపు వయసుగల ఆ ఇద్దరు మహిళలు కాంగ్‌పోక్సీ ప్రాంతంలో కార్లు సర్వీస్ చేసే సెంటర్‌లో పని చేస్తున్నారు.

వారు పనిలో ఉండగా కొందరు వ్యక్తులు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వంద మందికి పైగా ఉన్న ఆ గుంపులో కొందరు మహిళలు కూడా ఉన్నారని, బాధితులపై లైంగిక దాడి చేపేలా గుంపులోని వారిని వారు ప్రోత్సహించారని బాధిత మహిళలతో పాటుగా పని చేస్తున్న ఓ వ్యక్తి చెప్పారు. ఇద్దరు మహిళలను జనం అక్కడే ఉన్న ఓ రూమ్‌లోకి లాక్కెళ్లారని, అరవకుండా నోటిలో బట్టలు కుక్కి, లైట్లు ఆర్పేసి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆ వర్కర్ చెప్పాడు. ఆ తర్వాత వారిని బైటికి లాగేసిన గుంపు దగ్గర్లోనే ఉన్న సామిల్ వద్ద పడేసి వెళ్లి పోయారు. బాధిత మహిళల బట్టలన్నీ చిరిగి పోయి ఉన్నాయని, వారి శరీరమంతా రక్తంతో నిండి ఉందని కూడా అతను చెప్పాడు.

Also Read: ఆ టమాటా రైతు ఇప్పుడు కోటీశ్వరుడు

అయితే భయం కారణంగా ఈ ఘటన గురించి బాధిత కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ బాధితుల్లో ఒకరి తల్లి ధైర్యం తెచ్చుకుని మే 16వ తేదీన సైకుల్ పోలీసు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. తన కుమార్తెతో పాటుగా మరో మహిళను దారుణంగా రేప్ చేసి క్రూరంగా హింసించిన తర్వాత హత్య చేశారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఆ తర్వాత ఇంఫాల్ జిల్లాలోని పోరోంపట్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే మృతదేహాలను ఇంకా కనుగొనలేదని, వారు ఏమయ్యారో కూడా ఈ రోజు వరకు తెలియదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దాడి చేసిన వారి సంఖ్య 100నుంచి 200 దాకా ఉంటుందని కూడా అందులో పేర్కొన్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లుగా చెబుతున్న వీడియోకు సంబంధించిన ఫిర్యాదు దాఖలయింది కూడా ఇదే పోలీసు స్టేషన్‌లో కావడం గమనార్హం. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా మణిపూర్ పోలీసులకు వివిధ రకాల నేరాలకు సంబంధించి ప్రతిరోజూ వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు లాంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.

అయిదో నిందితుడి అరెస్టు

ఇదిలా ఉండగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.దీంతో ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన వారి సంఖ్య అయిదుకు చేరింది. వైరల్ అయిన వీడియోలో కన్పిస్తున్న వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మణిపూర్ లోయ, పర్వత ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో పోలీసులు126 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితుడు హెరోదాస్ మైతేయ్ ఇంటికి కొంతమంది మహిళలు శుక్రవారం నిప్పు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News