Thursday, January 23, 2025

మణిపూర్‌ నుంచి నేడు రాక

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం
ప్రత్యేక విమానాలను పంపించిన ఇరు రాష్ట్రాలు
కేంద్రంతో, మణిపూర్ అధికారులతో సమన్వయం చేస్తున్న తెలంగాణ సిఎస్, డిజిపి
న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూంలను
ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రత్యేక విమానంలో విద్యార్థులు నేడు లేదా రేపు హైదరాబాద్ చేరుకునే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: మణిపూర్‌లో తలెత్తిన శాంతి భద్రతల పరిస్థితి నేపథ్యంలో ఆ రాష్ట్రంలో చదివేందుకు, వివిధ పనుల నిమిత్తం వెళ్లిన ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇక్కడకు తీసుకురావడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేపట్టాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా తెలంగాణ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మణిపూర్‌కు ప్రత్యేక విమానాన్ని పంపి అక్కడి తెలంగాణ స్టూడెంట్స్‌తో పాటు తెలుగు విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టింది.

దీంతోపాటు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్ రూంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి తగిన చర్యలు తీసుకున్నారు. మణిపూర్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు, విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అంజనీ కుమార్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కొందరికి బస
అయితే నేడు మణిపూర్‌లోని తెలంగాణ వాసులను కలకత్తా మీదుగా హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ ప్రత్యేక విమానం బయలుదేరనుంది. దీంతో రేపు (మంగళవారం) ఉదయం శంషాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే కొందరు విద్యార్థులు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో వారికి తెలంగాణ భవన్‌లో బసకు ఏర్పాటు చేశారు.

ఎపికి చెందిన 157 మంది విద్యార్థులు
ఎపి విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు పంపించేందుకు ముమ్మరంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మణిపూర్‌లోని తెలుగు విద్యార్థులున్న కాలేజీల్లో ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా ఎంపిక చేసి, మిగిలిన ఎపి విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుకు సివిల్ ఏవియేషన్ శాఖ అంగీకరిం చింది. ఈ నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థతోనూ ఎపి అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 157 మంది ఎపి విద్యార్థులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి పౌరవిమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ద్వారా ఎపి విద్యార్థులను తరలించడానికి పౌర విమానయాన శాఖ అంగీకరించింది. ఒకవైపు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రైవేటు విమానయాన సంస్థలతోనూ ఎపి అధికారులు మాట్లాడుతున్నారు.

నేడు కర్ఫ్యూ నిబంధనల సడలింపు
కర్ఫ్యూ నిబంధనలకు మణిపూర్ ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. నేడు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంఫాల్ నగరంలో కర్ఫ్యూ సడలింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు గంటల పాటు కర్ఫ్యూ సడలింపు చేస్తూ పశ్చిమ ఇంఫాల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంఫాల్లో చిక్కుకున్న వారు స్వస్థలాలకు వెళ్లే విధంగా మణిపూర్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News