Friday, December 20, 2024

రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. న్యాయ యాత్రకు అనుమతి నిరాకరణ

- Advertisement -
- Advertisement -

మణిపూర్ ప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ: తూర్పు ఇంఫాల్ జిల్లాలోని హట్టా కంగ్జీబంగ్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం బుధవారం గ్రౌండ్ పర్మిషన్ నిరాకరించింది. జనవరి 14న ఇంఫాల్‌లో యాత్ర ప్రారంభం కావలసి ఉంది. బుధవారం ఉదయం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్‌ను ఆయన కార్యాలయ సముదాయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కె మేఘచంద్ర, మరి కొందరు నాయకులు కలుసుకున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాను రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేనని ముఖ్యమంత్రి చెప్పినట్లు మేఘచ్రం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందనను దురదృష్టకరంగా ఆయన అభివర్ణించారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభ వేదికను తౌబల్ జిల్లాలోని ఖంగ్జోమ్‌లోగల ఒక ప్రైవేట్ స్థలంలోకి మార్చుకున్నామని ఆయన చెప్పారు. కాగా..ఇంఫాల్‌లోని ప్యాలెస్ గ్రౌండ్‌లో భారత్ న్యాయ యాత్రను నిర్వహించడానికి మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తమకు సమాచారం అందిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

తూర్పు నుంచి పశ్చిమనికి యాత్రను ప్రారంభిస్తున్నపుడు మణిపూర్‌ను ఎలా తప్పిస్తామని ఆయన ప్రశ్నించారు. ఈ దేశ ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వదలిచారని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ నుంచే యాత్రను ప్రారంభించాల్సిన అవసరం ఉందని, ఆ రాష్ట్రంలోని వేరే ప్రాంతం నుంచి ఇప్పుడు యాత్రను ప్రారంభిస్తామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మంగళవారం విలేకరులతో మాట్లాడినపుడు కాంగ్రెస్ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

భద్రతా సంస్థల నుంచి నివేదికలు అందిన తర్వాత దీనిపై తుదినిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ఈ నెల 14న చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర 110జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనున్నది. 66 రోజులపాటు సాగే ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News