మణిపూర్‌ను చూసొచ్చిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కు చెందిన ఎంపిల బృందం మెజారిటీ, మైనారిటీలనే తేడా చూపకుండా అక్కడి పరిస్థితి ఇంకా అదుపు తప్పి వుందని గవర్నర్ అనుసూయియా ఉయికేకి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నది. కేంద్రానికి చెప్పి తక్షణ నివారణ చర్యలు తీసుకునేలా చూడాలని ఆమెకు విన్నవించింది. పరిస్థితి బొత్తిగా బాగోలేదని ఆమె కూడా అంగీకరించినట్టు ఎంపిలు పేర్కొన్నారు. అక్కడికక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి వెళ్ళిన 21 మంది ఎంపిల బృందం పరస్పర వ్యతిరేకులైన మెయితీలు, కుకీలు రెండు బృందాలకు చెందిన పునరావాస శిబిరాలను సందర్శించినట్టు బోధపడుతున్నది. చురాచంద్ పూర్, మెయిరాంగ్, ఇంఫాల్‌లోని మూడు శిబిరాలను వారు చూశారు. ఈ శిబిరాల్లో వందలాది మంది వున్నారని, వారిలో ఎక్కువగా మహిళలు, పసిపిల్లలే కనిపించారని ఈ బృందం వెల్లడించింది. ఈ శిబిరాల్లో పరిస్థితి బొత్తిగా బాగోలేదని, ముఖ్యంగా పిల్లలకు రక్షణ కరవైందని వారు గవర్నర్‌కు తెలియజేశారు. శాంతి భద్రతలు పూర్తిగా భగ్నమయ్యాయని , ఘర్షణలను తక్షణమే ఆపాలని వారు భావిస్తున్నారు. మొత్తం 350 శిబిరాల్లో 10,000 మంది బాలలున్నట్టు తెలుస్తున్నది.
వీరికి బతుకులపై తిరిగి ఆశ కల్పించవలసిన అవసరముంది. తగిన ఆహారం, వైద్యం అందుబాటులో వుంచడానికి అక్కడ గల డబులింజిన్ బిజెపికి గల అభ్యంతరమేమిటో తెలియదు. మణిపూర్ ఘర్షణల్లో ఇంత వరకు 135 మంది మరణించారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. మెయితీలు, కుకీలు పరస్పర ద్వేషంతో ఇంకా రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మెయితీయే. ఆయన గత కొన్నాళ్ళ క్రితం రాజీనామాను గవర్నర్‌కు సమర్పించడానికి వెళబోగా ఆయన చేతిలోని ఆ కాగితాన్ని మెయితీలు తీసుకొని చింపేశారనే వార్తను చూశాము. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పడానికి ఆయన తన చేతిలోని అధికార ఖడ్గాన్ని సమర్థంగా, సవ్యంగా వినియోగించకపోడమే కారణమని లోకం కోడై కూస్తున్నది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆయనను ఎందుకు బర్తరఫ్ చేయలేదనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఘర్షణలు మొదలైన మొదటి రోజుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడికి వెళ్ళి మూడు రోజులున్నారు. అప్పుడు ఆయన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సూచనలు ఇచ్చారు, నిష్పాక్షికంగా, కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించారా లేదా , అలా సూచించి వుంటే ఇప్పటికీ అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఎలా కొనసాగుతుంది అనే ప్రశ్నలకు సమాధానం అవసరం. శిబిరాల్లోని వారు తమ దుస్థితి గురించి చెప్పుకొన్న ఉదంతాలు తమను కలిచివేశాయని ప్రతిపక్ష ఎంపిల బృందం చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకే పార్టీకి చెందినవి కావడం ఇటువంటి పరిస్థితుల్లో ఎంతైనా తోడ్పడి వుండవలసింది. కాని అలా జరగడం లేదు. మెయితీలు, కుకీలు ఇప్పటికీ ఒకరినొకరు కన్నెత్తి చూడని స్థితి కొనసాగుతున్నది. వారి మధ్య పరస్పర విశ్వాసం నెలకొల్పడానికి కొంత కాలం పట్టవచ్చు. కాని అంతవరకు ఘర్షణలు ఎందుకు ఆపలేకపోతున్నారు? మే 4 వ తేదీన మెయితీల చేతిలో సామూహిక మానభంగానికి గురైన ఇద్దరు కుకీ మహిళలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపి ఒకరు కలుసుకోగా, పోలీసులే దగ్గరుండి నేరం చేయిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు న్యాయం జరుగుతుందనే ఆశ లేదని వారు చెప్పినట్టు వార్తలు తెలియజేస్తున్నాయి. తాము ఈ విధంగా మొరపెట్టుకొన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ దర్యాప్తుకి ఆదేశించలేదని వారు చెప్పుకొన్నారు. సోమవారం నాడు సుప్రీంకోర్టు కూడా మణిపూర్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన మే 4న జరిగితే ఛార్జిషీట్ దాఖలు చేయడానికి 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని దేశ అత్యున్నత న్యాయస్థానం అక్కడి పోలీసులను ప్రశ్నించింది. ఆ ఘటన వీడియో చూడ్డానికే దారుణంగా, జుగుప్సాకరంగా వుందని, పరిస్థితిని చక్కదిద్దుతారనే విశ్వాసం అక్కడి పోలీసుల మీద లేదని స్పష్టం చేసింది. వారే ఆ మహిళలను మూకలకు అప్పజెప్పారని అభిప్రాయపడింది. మణిపూర్‌ను కుకీ, మెయితీ, నాగాలకు మూడు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడమే అక్కడి పరిస్థితికి సరైన పరిష్కారమని బిజెపి ఎంఎల్‌ఎ, కుకీల నాయకుడు హావోకిప్ సూచించినట్టు వార్తలు వచ్చాయి. కుకీలు, మెయితీలు వేర్వేరు దేశాల్లా విడిపోయి వున్నారని అక్కడికి వెళ్ళివచ్చిన ప్రతిపక్ష ఎంపిల బృందం కూడా చెబుతున్నది. సరిహద్దు రాష్ట్రంలో నెలకొన్న ఇంతటి అసాధారణ పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు మొహం చూపించలేకపోడం కంటే అధ్వానం మరొకటి వుండదు. ఆయన ఆత్మపరిశీలన చేసుకొని ప్రభుత్వం మణిపూర్‌లో ఎందుకు విఫలమవుతున్నదో, తమ హిందుత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలు ఎంత వరకు అందుకు కారణమో పార్లమెంటుకు చెప్పాల్సి వుంది.