Sunday, January 19, 2025

మళ్లీ రగులుతున్న మణిపూర్

- Advertisement -
- Advertisement -

సిఎం బీరేన్‌సింగ్, ఆయన అల్లుడి
ఇళ్లలో నిరసనకారుల విధ్వంసం
ముగ్గురు మంత్రులు, ఆరుగురు
ఎంఎల్‌ఎల నివాసాలు, ఆస్తులకు నిప్పు
ఆరుగురు మైతేయిల మృతదేహాలు
నదిలో తేలిన కొన్ని గంటల్లోనే దాడులు
ఐదు జిల్లాల్లో నిషేధాజ్ఞలు, కర్ఫూ
మణిపూర్ పరిస్థితిపై హోంమంత్రి
అమిత్‌షా సమీక్ష శాంతిస్థాపనకు చర్యలు
తీసుకోవాలని ఆదేశాలు

గౌహతి/కోల్‌కతా/ ఇంఫాల్ : మణిపూర్‌లో గల్లంతై న ఆరుగురి మృతదేహాలను నదిలో నుంచి వెలికితీసిన కొన్ని గంటలకే నిరసనకారులు శనివారం సిఎం బీరేన్‌సింగ్ నివాసంపై దాడులకు పాల్పడ్డా రు. ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చే శారు. ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు ఎంఎల్‌ఎల నివాసాలపై దాడులు చేసినట్లు, దీనితో ప్రభుత్వం ఐదు జిల్లాల్లో నిరవధికంగా నిషేధాజ్ఞ లు విధించినట్లు, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేసినట్లు అధికారు లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ అల్లునితో సహా ఆరుగురు శాసనసభ్యుల్లో ముగ్గురి ఇళ్లలో నిరసనకారులు విధ్వంసం సృష్టించినట్లు, వారి ఆస్తులకు నిప్పు పెట్టినట్లు తెలిపారు.

ఇంఫాల్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రత బలగాలు బాష్పవాయు గోళాలు పేల్చినట్లు పోలీసులు తెలియజేశారు. నిర్వాసితుల శిబిరంలో నుంచి సోమవారం అదృశ్యమైన మైతేయి తెగకు చెందిన ఇద్దరు మహిళలు, ఒక పిల్లవాడి మృతదేహాలను శనివారం జిరిబమ్‌లో బరాక్ నదిలో నుంచి వెలికితీయగా, మరో మహిళ, ఇద్దరు పిల్లల మృతదేహాలు శుక్రవారం రాత్రి కనిపించాయి. మణిపూర్ జిరిబమ్ జిల్లాలో వెలికితీసిన ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ పరీక్షల నిమిత్తం అస్సాంలోని సిల్చార్ వైద్య కళాశాల ఆసుపత్రి (ఎస్‌ఎంసిహెచ్)కు పంపారు. తమ నివాసాలు నిరసనకారుల ముట్టడికి గురైన మంత్రుల్లో సపమ్ రంజన్. ఎల్ సుసీంద్రో సింగ్, వై ఖేమ్‌చంద్ ఉన్నట్లు అధికారి ఒకరు తెలియజేశారు. ‘శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తున్న కారణంగా’ ఇంఫాల్ లోయలోని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, బిష్ణుపూర్, తౌబల్, కాక్‌చింగ్ జిల్లాల్లో నిరవధికంగా కర్ఫూ విధించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఎల నివాసాలను నిరసనకారులు ముట్టడించిన నేపథ్యంలో ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రాష్ట్ర అధికార యంత్రాంగం నిలుపుదల చేసినట్లు మరొక అధికారి తెలిపారు.

ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో లాంఫెల్ సనకైథెల్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసాన్ని ఒక గుంపు ముట్టడించినట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఆరుగురు వ్యక్తుల హత్యకు సంబంధించిన అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని, ప్రజల మనోభావాలను ప్రభుత్వం మన్నించని పక్షంలో తాను రాజీనామా చేస్తానని మంత్రి సపమ్ మాకు హామీ ఇచ్చారు’ అని లాంఫెల్ సనకైథెల్ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రతినిధి డేవిడ్ విలేకరులతో చెప్పారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ఎల్ సుసీంద్రోసింగ్ నివాసంలోకి నిరసనకారులు దూసుకుపోయారని, దీనితో భద్రత బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పలు రౌండ్ల బాష్పవాయు గోళాలు పేల్చారని పోలీసులు తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లా సింగ్జమై ప్రాంతంలో మునిసిపల్ పాలన గృహవసతి అభివృద్ధి శాఖ మంత్రి వై ఖేమ్‌చంద్ నివాసాన్ని కేడా నిరసనకారులు ముట్టడించినట్లు పోలీసులు చెప్పారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బండ్ ప్రాంతంలో ఆందోళనకారులు బిజెపి ఎంఎల్‌ఎ, ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ అల్లుడు ఆర్‌కె ఇమో నివాసం ముందు సమీకృతమై, ‘ప్రభుత్వం తగినవిధంగా స్పందించాల’ని కోరుతూ నినాదాలు చేశారు.

‘దోషులను 24 గంటల్లోగా అరెస్టు’ చేయాలని అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. అస్సాం, మణిపూర్ సరిహద్దు సమీపంలో శుక్రవారం రాత్రి విగతజీవులుగా కనిపించిన ముగ్గురికి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకారులు ఇంఫాల్‌లో మణిపూర్ శాసనసభ భవనానికి కేవలం 200 మీటర్ల దూరంలోని తంగ్‌మైబండ్ ప్రాంతంలో ఒక రోడ్దు మధ్యలో టైర్లకు నిప్పంటించారు. రాజ్ భవన్, ముఖ్యమంత్రి సెక్రటేరియట్ సహా పలు భవనాల దిశగా సాగే యత్నం చేసిన నిరసనకారులను చెదరగొట్టేందుకు కైసంపట్ వంతెన వద్ద బాష్పవాయు గోళాలు పేలినట్లు పోలీసులు తెలియజేశారు. ప్రస్తుత కల్లోలిత ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు, బిష్ణుపూర్, కాక్‌చింగ్, కంగ్‌పోక్పి, చురాచంద్‌పూర్ జిల్లాల పరిధిలో శనివారం సాయంత్రం 5.15 గంటల నుంచి రెండు రోజుల పాటు తాత్కాలికంగా ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులు నిలుపుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి ఆదేశించారు. దుండగులు శనివారం రాత్రి జిరిబమ్ పట్టణంలో కనీసం రెండు చర్చిలు, మూడు ఇళ్లకు నిప్పంటించినట్లు అధికారులు వెల్లడించారు.

మణిపూర్‌లో కల్లోలమే బిజెపికి కావాల్సింది: ఖర్గే
ఇది ఇలా ఉండగా, ‘తమ ద్వేషపూరిత విభజన రాజకీయాల ప్రయోజనాల కోసం’ అధికార పార్టీ బిజెపి సరిహద్దు రాష్ట్రం దగ్ధం కావాలని కోరుకుంటున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ఆరోపించారు. కాగా, మణిపూర్‌లో తీవ్రరూపం దాలుస్తున్న హింసాకాండ దృష్టా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని ఢిల్లీకి హుటాహుటిని తిరిగి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తమ సంగతి పట్టించుకోకపోవడాన్ని, తమ ఇక్కట్ల పరిష్కారానికి తమ రాష్ట్రాన్ని సందర్శించకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నడూ మరచిపోరని, క్షమించబోరని ఖర్గే అన్నారు. ‘2023 మే నుంచి ఆ రాష్ట్రం అనూహ్యంగా సమస్యలతో సతమతం అవుతోంది, అది రాష్ట్ర ప్రజల భవితను నాశనం చేసింది’ అని ఆయన ఆరోపించారు.

ఈ నెల 7 నుంచి కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోయారని, కల్లోలిత ప్రాంతాల్లో కొత్త జిల్లాలు చేరుతున్నాయని, ఆ ఉద్రిక్తత పొరుగున ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తున్నదని ఖర్గే ఆరోపించారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా మణిపూర్‌లోని ఇటీవలి హింసాత్మక సంఘర్షణలు, కొనసాగుతున్న రక్తపాతం ‘తీవ్రంగా కలవరపరుస్తున్నాయి’ అని అన్నారు. రాష్ట్రాన్ని సందర్శించి, ఆ ప్రాంతంలో ప్రశాంతత పునరుద్ధరణకు కృషి చేయవలసిందిగా ప్రధాని మోడీకి రాహుల్ విజ్ఞప్తి చేశారు. ‘ఒక ఏడాది కాలంపైగా విభజన, ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యవర్తిత్వానికి కృషి చేసి, పరిష్కారం కనుగొనాలని ప్రతి భారతీయుడు ఆశిస్తున్నాడు’ అని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. పరిస్థితులు అదుపు తప్పాయని మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనలు సూచిస్తున్నాయని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. మణిపూర్‌లో అధికార పార్టీ ఎంఎల్‌ఎలే భద్రంగా లేనప్పుడు సామాన్య పౌరుడు శాంతి కోసం ఎలా ఆశలు పెట్టుకుంటాడని వేణుగోపాల్ ప్రశ్నించారు.

మణిపూర్ పరిస్థితిపై అమిత్ షా సమీక్ష
న్యూఢిల్లీ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్‌లోని భద్రత పరిస్థితిపై ఆదివారం సమీక్ష నిర్వహించారని, ఆ ఈశాన్య రాష్ట్రంలో ప్రశాంతత పునరుద్ధరణకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని భద్రత విభాగం ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారని అధికార వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన అనంతరం అమిత్ షా ఆ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత భద్రత అధికారులతో మణిపూర్ భద్రత పరిస్థితిని హోమ్ శాఖ మంత్రి సమీక్షించినట్లు, అక్కడ శాంతి స్థాపనకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. నిరుడు మే నుంచి జాతుల మధ్య సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మహిళలు, పిల్లల మృతదేహాలు బయటపడిన తరువాత నిరసనలు, దౌర్జన్య సంఘటనలు వెల్లువెత్తడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో అమిత్ షా ఆదివారం సమీక్ష జరిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News