Wednesday, January 22, 2025

కేంద్రానికి అగ్నిపరీక్ష మణిపూర్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ సమావేశాలకు ముందు మంత్రివర్గ విస్తరణను సహితం పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలకమైన రక్షణ ఒప్పందాలు చేసుకోవడం కోసం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్‌కు, ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన రెండు సంఘటనలు జరిగాయి.ఆయన పారిస్‌లో అడుగు పెట్టేందుకు కొన్ని గంటల ముందు మణిపూర్‌లో హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూరోపియన్ యూనియన్ (ఇయు) గురువారం ఓ తీర్మానం వెలువవరించింది. తీర్మానం లో బిజెపి నేతలు కొందరు వ్యవహరిస్తున్న తీరును ఇయు ఘాటుగా తప్పుపట్టింది. బిజెపి ప్రముఖులు మణిపూర్ హింసాకాండ పట్ల జాతీయత పేరిట చెపుతున్న మాటలు గర్హనీయం అని పేర్కొన్నారు. మోడీ ఫ్రాన్స్ పర్యటన వేళలోనే ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో జరుగుతున్న ప్లీనరీ సెషన్‌లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. మానవ హక్కులు, ప్రజాస్వామిక విలువల అంశం భారత్‌తో తమ చర్చల ప్రక్రియకు ఆయువుపట్టు అవుతాయని కూడా ఇయు ఘాటుగా పేర్కొంది. మణిపూర్‌లో హింసను ఆపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అక్కడి మతపరమైన మైనారిటీలకు రక్షించాలని భారత ప్రభుతాన్ని యురోపియన్ పార్లమెంట్ కోరింది.

దాదాపు అదే సమయంలో మణిపూర్ బిజెపి ఉపాధ్యక్షుడు ఆర్ వన్మ్‌చ్రుంగ మణిపూర్‌లో జరుగుతున్న హింసలో పెద్ద ఎత్తున చర్చిల విధ్వంసానికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. అక్కడ జరుగుతున్న హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అంటూ నిశితంగా విమర్శలు గుప్పించారు. మణిపూర్‌లో గత రెండు నెలల్లో 357 చర్చిలు, పాస్టర్ నివాస గృహాలు, ఇతర కార్యాలయ భవనాలు అగ్నికి ఆహుతి అయిన్నట్లు ఆయన పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో సాధించిన ఘన విజయాలలో ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంగా తరచూ హోం మంత్రి అమిత్ షా చెబుతున్న మాటలు నేడు వికటించాయి.

అక్కడ శాంతి భద్రతల పరిస్థితులు అదుపులో లేవని స్వయంగా తన ఇల్లే అగ్నికి ఆహుతి అయిన తర్వాత కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజాన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన తెగల మధ్య సుదీర్ఘ కాలంగా ఘర్షణలు చెలరేగడం, ఉద్రిక్తలు నెలకొనడం, సాయుధ తీవ్రవాదులు పాతుకుపోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం చెలరేగిన హింసాకాండకు నేరుగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పైననే అధికారంలో ఉన్న బిజెపికి చెందిన పలువురు శాసన సభ్యులు సైతం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల మద్దతుతోనే హింసాకాండ ప్రారంభమైనదనే ఆందోళనకర ఆరోపణలు చెలరేగుతున్నాయి. హింసాకాండలో చైనా ప్రమేయం ఉందంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపించారు. అయినా ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. పోలీసుల నుండి 3000కు పైగా తుపాకులను అపహరించి, వాటితోనే అల్లరి మూకలు అమాయకులపై కాల్పులకు దిగుతున్నారు. పోలీస్ స్టేషన్ నుండి ఒక తుపాకీ మాయమైనా తీవ్రమైన విషయంగా పరిగణిస్తాం. కానీ వేల కొద్దీ అపహరించినా ప్రభుత్వం నిస్సహాయంగా ఉండాల్సి వస్తుంది.

స్వయంగా హోం మంత్రి అమిత్ షా ‘దయ చేసి పోలీస్ స్టేషన్ల నుండి దొంగిలించిన తుపాకులను తిరిగి అప్పగించండి’ అంటూ నిస్సహాయంగా విజ్ఞప్తి చేయడాన్ని చూసాము. ఇప్పటి వరకు 142 మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుమారు 200 గ్రామాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొన్ని వేల మంది పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. వేల కొద్దీ కేంద్ర సాయుధ దళాలను మోహరించినా సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. రాజకీయ చొరవ లోపించడంతో సమస్య మరింత జటిలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.గత ఏడాది ఎన్నికల సందర్భంగా బిజెపిని ఎన్నుకొనే రాష్ట్ర ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. కానీ, నేడు శాంతి భగ్నమైతే ఆయన నోరు మెదపకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది.

‘మన్ కా బాత్’ అంటూ తన గోడు దేశ ప్రజలకు చెప్పడమే గాని ప్రజల ఆందోళనలను, సమస్యలను వినిపించుకునే ప్రయత్నం చేయరని ప్రతిపక్షాలు ప్రధాని గురించి ప్రధానంగా విమర్శిస్తుంటాయి. దేశంలో ఎప్పుడు ఎటువంటి జటిలమైన సమస్యలు ఎదురైనా మౌనం వహిస్తుంటారు. ఏడాది పాటు జరిగిన రైతుల నిరసనల విషయంలో గాని, లైంగిక వేధింపులపై రేజర్ల ఆందోళనల సమయంలో గాని ఆయన మౌనమే వహించారు. లడఖ్‌లో చైనా దురాక్రమణ గురించి మూడేళ్ల పాటు ఆయన నోరు మెదపలేదు. ఉక్రెయిన్, రష్యాల మధ్య తీవ్రమైన ఘర్షణలు ప్రారంభమైన సమయంలో భారతీయ విద్యార్థులు దేశం విడిచి వచ్చేందుకు ఆ రెండు దేశాల అధినేతలతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని గంటల పాటు యుద్ధాన్ని ఆపివేసే విధంగా చేసిన ప్రధాని మోడీ మణిపూర్ హింస గురించి పట్టించుకోకపోవడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

మణిపూర్ నుండి ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఒకరు రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉన్నారు. జనాభా విషయం లో దేశంలో 23వ రాష్ట్రం కాగా, విస్తీర్ణం విషయంలో 25వ రాష్ట్రం. మణిపూర్ లోయ జనాభా 10 లక్షలు మాత్రమే. మొత్తం మణిపూర్ జనాభా 33 లక్షలు. రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లేని రాష్ట్రం కావడంతో అక్కడ జరుగుతున్న హింస తీవ్రమైన అంశంగా అనిపించడం లేదా? అనే అనుమానం కలుగుతుంది. 2047 నాటికి భారత్ అగ్రరాజ్యం కావాలనే లక్షాన్ని దేశ ప్రజల ముందు ప్రధాని మోడీ ఉంచారు. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సైన్యం మనకు ఉంది. అయితే రెండు నెలలకు పైగా హింసను నియంత్రించలేకపోతున్నారు. హింసను నియంత్రించే ఉద్దేశం లేదా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
మణిపూర్‌లో హింసాకాండకు చెల్లాచెదురైన అన్ని వర్గాల ప్రజలు ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. వాస్తవానికి జూన్ 18న ‘మన్ కి బాత్’లో మణిపూర్ హింసాకాండ గురించి ప్రధాని ప్రస్తావిస్తారని, ప్రజలకు శాంతి సందేశం ఇస్తారని అక్కడి ప్రజలు ఎదురు చూశారు. కానీ ఆయన ఆ ప్రస్తావన తీసుకు రాకపోవడంతో ఆగ్రహంతో రేడియోలను బద్దలుకొట్టారు. భారత సైన్యంలోని రిటైర్డ్ కల్నల్ ఒకరు గత వారం ఇంఫాల్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుకీలు గొప్ప వ్యక్తులు; మెయితీలు గొప్ప వ్యక్తులు; నాగాలు కూడా గొప్ప వ్యక్తులు. అస్సాం రెజిమెంట్‌లోని మేమంతా కలిసి మనదేశం కోసం పోరాడాం. కానీ ఇప్పుడు నా రాష్ట్రం కాలిపోతోంది, నా ప్రజలు కాలిపోతున్నారు, కానీ మోడీ నిశ్శబ్దంగా ఉన్నారు’ అంటున్న అతని చెంపపై నిస్సహాయ కోపంతో కన్నీళ్లు ధారగా ప్రవహించాయి.

అతను వాటిని దాచడానికి లేదా తుడవడానికి కూడా ప్రయత్నించలేదు. మణిపూర్‌తో పాటు మయన్మార్ నుండి కూడా తమ రాష్ట్రానికి వలస వచ్చిన వారి సంరక్షణ కోసం రూ. 10 కోట్ల సహాయం చేయాలని బిజెపికి చెందిన మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా కోరినా కేంద్రం నుండి స్పందన లేదు. ఇంఫాల్‌లో తొమ్మిది మంది శాసన సభ్యుల ఇళ్లపై దాడులు జరిగాయి. బీరెన్ సింగ్ అధికారంలో ఉండగా హింసాకాండ అదుపు సాధ్యం కాదంటూ స్థానిక బిజెపి నేతలే పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై అమిత్ షా ఢిల్లీలో జరిపిన అఖిలపక్ష సమావేశంలో బీరెన్ సింగ్ లేకపోవడాన్ని చూస్తుంటే ఆయన అక్కడ ఉండటం కొత్త సమస్యలకు దారితీయవచ్చని భావించి ఉంటారు.

కేంద్ర నాయకత్వం పట్ల బీరెన్ సింగ్ ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నట్లు ఆయన రాజీనామా ఉదంతం వెల్లడి చేస్తుంది. రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించడం, నాటకీయంగా ఇంటి నుండి బైటకు వచ్చిన ఆయనను మహిళలు అడ్డుకోవడం, రాజీనామా పత్రాన్ని చించివేయడం చూసాము. ఇదంతా చూస్తుంటే తనను గద్దెదించితే పరిస్థితులు మరింతగా అదుపు తప్పగలవని కేంద్రాన్ని బెదిరిస్తున్నారా? అనే అనుమానాలు కలుగక మానవు. గత మార్చి నుండి బీరెన్ సింగ్ ఏకపక్షంగా తీసుకున్న పలు నిర్ణయాలు ప్రస్తుత హింసాకాండకు దారి తీసిన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.ఏకపక్షంగా, పాక్షికంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించడం; నాగా గ్రామాలను వదిలివేసి కుకీ తెగల వారిని మాత్రమే ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభించడం, రెండు తీవ్రవాద సంస్థలు యువతకు పోలీసుల కనుసన్నల్లోనే సాయుధ శిక్షణ ఇస్తుండటం వంటి పలు కారణాలను మాజీ సైనికాధికారులు ఉదహరిస్తున్నారు. మణిపూర్‌లో నేడు తలెత్తిన హింసాకాండ కేవలం ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమే కాదు. సరిహద్దు రాష్ట్రం కావడం, పొరుగున ఉన్న మయన్మార్‌లో చైనా కనుసన్నలలో సైనిక ప్రభుత్వం ఉండడంతో దేశ రక్షణకు సంబంధించిన అంశమని గుర్తించాలి.

-చలసాని నరేంద్ర
9849569050

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News