Sunday, January 19, 2025

మణిపూర్ బాధితులకు న్యాయం దక్కేనా?

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో రెండు తెగల మధ్య మారణకాండ చెలరేగి 19 నెలలు దాటినా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింసాకాండకు బలైన బాధితులకు రక్షణ ఉండడం లేదు సరికదా న్యాయం ఎప్పటికి అందుతుందో చెప్పలేం. గత 19 నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ రావణకాష్ఠంలా రగులుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారణలో విఫలమవుతున్నాయి. ఈ హింసాకాండ నేరాలపై కేసులు నమోదవుతున్నా, ఇంకా విచారణ ప్రారంభం కాకపోవడం శోచనీయం.

ఉదాహరణకు 2023 మే 4న కుకి జో తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడమే కాక, అది వీడియోగా చిత్రీకరించడం, అది వైరల్ కావడం ఇవన్నీ జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టయినా అనిపించకపోవడం విడ్డూరం. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తరువాత కానీ ఈ కేసును 2023 జులై నాటికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కు అప్పగించడం కాలేదు. ఆ తరువాత సిబిఐ ఆరుగురు నిందితులపై 2023 అక్టోబర్‌లో ఛార్జిషీటు దాఖలు చేసినా ఇప్పటికీ విచారణ ప్రారంభం కాకపోవడం గమనార్హం. ఈ కేసులపై దర్యాప్తు ఈ విధంగా కొన్ని నెలలపాటు జాప్యం చేస్తే బాధితులకు న్యాయం సకాలంలో అందుతుందా? అన్నది ప్రశ్నార్థకం. మణిపూర్‌లో మహిళలపై అత్యాచారం, లైంగిక దాడులు, ఇళ్ల దహనాలు, దోపిడీలు, తదితర ఘోర నేరాలకు సంబంధించి 3023 కేసులు నమోదైనా వాటిలో కేవలం 6% కేసులకే చార్జిషీట్లు దాఖలయ్యాయి.

ఈ సంఘటనలపై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు 42 ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్) నియమించింది. కానీ ఏం లాభం 192 కేసులకు మాత్రమే ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. దేశం మొత్తం మీద అత్యంత అనుభవం కలిగిన పోలీస్ ఆఫీసర్లను ఎంపిక చేసి 2023లో సిట్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఈ ఏడాది నవంబర్ 20 నాటికి 384 మందిని మాత్రమే అరెస్ట్ చేయగలిగారు. 742 మంది అనుమానితులను గుర్తించారు. 11,901 మంది సాక్షులను విచారించారు. నేరారోపణలున్న 574 మంది నిందితులపై ఇంతవరకు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఆ రాష్ట్రం పోలీస్ స్టేషన్ల ఆయుధాగారాల నుంచి కాజేసిన 501 ఆయుధాలను 13,464 మందుగుండు పేలుడు పదార్ధాలను పట్టుకున్నారు. అయితే ఇంతకీ ఈ కేసులపై విచారణ ఇంకా ప్రారంభమైందా లేదా అన్నది స్పష్టంకావడం లేదు. సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు వస్తే కానీ ఈ కేసుల విచారణ ప్రారంభం కాదని ఈ కేసులను పర్యవేక్షిస్తున్న న్యాయవాది ఒకరు వెల్లడించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలపై సిట్‌లు ఆరు గ్రూపులుగా విడిపోయాయి.

హత్యలు, హీనమైన నేరాల దర్యాప్తునకు ఒక గ్రూపు, మహిళలపై అత్యాచారం, లైంగిక నేరాల పర్యవేక్షణకు మరో గ్రూపు, ఇళ్ల దహనాలు, దోపిడీలు, ఇతర ఘోర నేరాల దర్యాప్తునకు నాలుగు సిట్ గ్రూపులు కేటాయించడమైంది. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, కాక్‌చింగ్, బిష్ణుపూర్, చురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పి, జిల్లాలకు ఆరు సిట్ గ్రూపుల వంతున, తొబాల్, టెంగ్‌నౌపాల్ జిల్లాలకు మూడేసి సిట్ గ్రూపుల వంతున కేటాయించారు. హత్యా నేరాలకు సంబంధించి 126 కేసులను, మహిళలపై లైంగిక నేరాల 9 కేసులను, ఇళ్ల దహనాలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసంపై 2888 కేసులను 42 సిట్ గ్రూపులు దర్యాప్తు చేస్తున్నాయి.

2023 మే 3న కుకీజో తెగకు, మెజారిటీ మెయితీ సామాజిక గ్రూపునకు మధ్య హింసాకాండ చెలరేగిన తరువాత ఇప్పటివరకు 1800 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడమైంది. అయినా మణిపూర్‌లో శాంతి మూణ్ణాళ్ల ముచ్చటే అవుతోంది. కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టు కనిపించేలోగా కథ మళ్లీ మొదటికే వస్తోంది. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరుతూ గత నవంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మణిపూర్ ప్రజలకు నమ్మకం పోయిందని ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు నిరాకరిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గత 18 నెలల్లో మూడుసార్లు మణిపూర్‌ను సందర్శించారని ఖర్గే తన లేఖలో వివరించారు.

దీనిపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గత కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడమే ఈ పరిస్థితికి దారి తీసిందని అడ్డగోలుగా వాదించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ మిలిటెంట్లు అక్రమ వలసలను చట్టబద్ధం చేయడమే కాకుండా, అప్పటి హోం మంత్రి పి. చిదంబరం వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించకుండా ఆరోపణలతోనే సరిపెట్టడం కమలనాథుల నిర్వాకంగా మారింది. అంటే కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు మణిపూర్ మంటలతో చలికాచుకుంటున్నాయి తప్ప మంటలను ఆర్పే ప్రయత్నం చేయడం లేదనిపిస్తోంది. మణిపూర్ విషయంలో ముఖ్యంగా ప్రధాని మోడీ ఉదాసీనత చూపిస్తున్నారు.

ఇప్పటివరకు మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రస్తావించకపోవడమే దీనికి ఉదాహరణ. మణిపూర్‌ను భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం భావించడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. గత నవంబర్‌లో కూడా మణిపూర్ మళ్లీ భగ్గుమంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేశారు. కర్ఫూ విధించడం, ఇంటర్నెట్ సర్వీస్‌లు బంద్ చేయడం, రాకపోకలను నిషేధించడం ఈ విధంగా ఎన్నాళ్లు మణిపూర్‌ను కట్టడి చేస్తారు? విదేశీ టూరిస్టులు ఎవరూ మణిపూర్‌కు వెళ్లకుండా తాజాగా ఆంక్షలను కేంద్రం విధించింది. ఇవన్నీ పరిశీలిస్తే మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు అంతవేగంగా నెలకొంటాయన్న నమ్మకం కలగడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News