Wednesday, January 22, 2025

ఎన్నికల హడావిడి లేని మణిపూర్

- Advertisement -
- Advertisement -

పోలింగ్‌కు 2 వారాలే ఉన్నా ర్యాలీలు, సభలు లేవు

ఇంఫాల్ : మైతేయ్, కుకీ తెగల మధ్య పోరుతో అట్టుడికిన మణిపూర్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈనెల 19న పోలింగ్ ప్రారంభం కానున్నప్పటికీ ఇంకా ఎలాంటి ప్రచారాల హడావిడి లేకుండా మౌనంగా ఉంది. రెండు నియోజక వర్గాల్లో ఒక నియోజకవర్గంలో సగ భాగానికి ఈనెల 19న పోలింగ్ జరగనుండగా, మిగతా సగభాగానికి 26 న పోలింగ్ జరగనుంది. అంటే దాదాపుగా పోలింగ్‌కు ఇంకా రెండు వారాలే ఉంది.

ఇప్పటివరకు ఎక్కడా ర్యాలీలు, సభలు లేవు సరికదా, కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు. ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులే కనిపిస్తున్నాయి. భారీ ప్రచారంతో మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని, శాంతిభద్రతలు తప్పుతాయని భయం పొంచి ఉందని , అందుకే ఏ పార్టీ రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేదని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏదైనా ప్రచారం భారీగా చేస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ఈసారి ఎన్నికలంటే ప్రజలు ఇళ్లకు దూరంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ .శారదాదేవి అభిప్రాయ పడ్డారు.

ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు
వేలమంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటుండడంతో వారంతా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శిబిరాల వద్దే ఓటేసేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే అభ్యర్థులు ఈ శిబిరాల వద్దకు వచ్చే ధైర్యం చేయలేక పోతున్నారు. వస్తే తమ దారుణ స్థితిగతులపై బాధితులు నిలదీస్తారనే భయం వారిని వెంటాడుతోంది. మైతేయ్‌లు ఉండే లోయ ప్రాంతాలతోపాటు కుకీలు ఉండే కొండ ప్రాంతాల్లోనూ ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని కుకీ గ్రూపులు ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించాయి.

భిన్నమైన ప్రచారం
బీజేపీ , కాంగ్రెస్ , రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా , మణిపూర్ పీపుల్స్ పార్టీల అభ్యర్థులు సంప్రదాయానికి భిన్నమైన ప్రచార పద్ధతులను ఎంచుకున్నారు. ఇళ్లు, పార్టీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటే బాగుండేది కానీ, అలాంటి పరిస్థితి లేదు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ప్రచారం చేసుకుంటున్నాం” అని ఒక అభ్యర్థి తెలిపారు. ఇంటింటి ప్రచారానికి కార్యకర్తలను నియమించుకున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి రాష్ట్ర విద్యామంత్రి బసంత్ కుమార్ సింగ్ తన ఇల్లు, పార్టీ కార్యాలయం దాటి బయటకు రావడం లేదు. అక్కడే సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అకోయిజాందీ అదే పరిస్థితి. రాహుల్ గాంధీ జోడో యాత్ర పోస్టర్లను కేవలం పార్టీ కార్యాలయం వద్దే ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News