కొల్‌కతా : ఇస్రో చంద్రమండల విజయానికి మణిపూర్ బిష్ణుపూర్ జిల్లాకు సంబంధం ఉంది. ఇక్కడి తంగా గ్రామానికి చెందిన ఇస్రో సైంటిస్టు నింగ్‌తౌజమ్ రఘు సింగ్ రెండేళ్లకు పైగా చంద్రయాన్ 3 ప్రయోగానికే అంకితం అయ్యి పనిచేస్తూ ఉన్నారు. ఈ మిషన్ విజయవంతం కావడంలో రఘుసింగ్ పాత్ర కూడా కీలకమే, చంద్రయాన్ విజయవంతం తన జీవిత లక్షం అని, దాదాపుగా తాను రెండు ఏండ్లకు పైగా తన ఊరికి తన కన్న వారికి దూరం అయి ఉన్నానని సింగ్ తెలిపారు. తన పనితీరు అటువంటిదని తెలిపారు. ఇప్పుడు చంద్రుడిని చేరాం అని ఇక చంద్రుడిపైకి మనుష్యులను పంపించడం ఇస్రో లక్షం అని సింగ్ తెలిపారు. ఇప్పటికీ ఆయన విశ్రాంతి తీసుకోకుండా ఇస్రో విధులలోనే ఉన్నారు. తాను ఎప్పుడు ఇంటికి వెళ్లాలనేది ఆలోచించుకోలేదని, అందుకు అవకాశం కూడా రావడం లేదని తెలిపారు.
అయితే ఇప్పుడు తాను దూరంగా చాలా కాలంగా తన వారిని కలవలేకపోయినా వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నానని, ఇందుకు వాట్సాప్,ఫేస్‌బుక్ వంటి సాంకేతికతకు తనవంటి వారు థ్యాంక్స్ చెప్పాల్సిందే అని ఈ సైంటిస్టు స్పందించారు. ఇస్రో ముందు భారీ లక్షాలు ఉన్నాయి. చంద్రుడి వద్దకు మనిషిని పంపించడం, గగన్‌యాన్ వంటివి అనేకం ఇస్రోలో పనిచేసే వారి ముందున్న బృహత్తర లక్షాలని తెలిపారు. మత్సకారుల కుటుంబం నుంచి వచ్చిన సింగ్ తల్లిదండ్రులు చవోబా సింగ్, యాయింబి దేవీలు తన కొడుకుకు వచ్చిన పేరుతో మురిసిపోతున్నారు. రెండేళ్లుగా ఇంటికి రాకపోవడం బాధాకరమే అయితే వాడి విజయం ఆనందం కల్గిస్తోందని తెలిపారు. ఐఐఎస్‌సి బెంగళూరు విద్యార్థి అయిన సింగ్ ఐఐటి గౌహతి నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గోల్డ్ మెడలిస్టుగా నిలిచారు. 2006లో ఇస్రోలో సైంటిస్టుగా చేరాడు.