Friday, December 20, 2024

అల్లరిమూకకు ఆడవాళ్లను అప్పగిస్తారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తెగల ఘర్షణల మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన అత్యంత అమానుషం, దారుణం అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. అక్కడ జరిగిన ఘటన పట్ల ఏ ప్రభుత్వం కూడా సాకులు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని, ఇక్కడ జరిగిన దారుణం భయానకమని పేర్కొంది. బాధిత మహిళల నుంచి ఇతర సంస్థల నుంచి ఈ ఘటనపై దాఖలు అయిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారధ్యపు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అల్లరిమూకలకు మహిళలను అప్పగించి వదిలేసిన స్థానిక పోలీసు బృందాలకు తిరిగి ఘటనపై దర్యాప్తు బాధ్యతలను ఏ విధంగా అప్పగిస్తారని ప్రశ్నించింది.

దీనిని తాము అంగీకరించేది లేదని తెలిపిన ధర్మాసనం ఇందుకు తాము ప్రత్యేక కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని తెలిపింది. మహిళా జడ్జిలతో పాటు, పలువురు నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంటూ విచారణను మంగళవారం మధ్యాహ్నానికి (నేటికి) వాయిదా వేసింది. మణిపూర్‌లో ఈ ఇద్దరు మహిళల పట్ల జరిగిన అమానుషం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇప్పుడు వెలువడుతున్న వాదనలు, వారి వివరణలకు ఏమైనా అర్థం ఉందా? అని ధర్మాసనం కేంద్రాన్ని, రాష్ట్రాన్ని సూటిగా ప్రశ్నించింది.

ఇతర రాష్ట్రాల ఘటనల ప్రస్తావన ఎందుకు?
ఇటువంటి ఘటనలు దేశంలోని ఇతర చోట్ల కూడా జరిగాయని రాజస్థాన్, బెంగాల్ , ఛత్తీస్‌గఢ్‌ల్లో ఘటనల విషయం ప్రస్తావించడం ఏమిటని ధర్మాసనం నిలదీసింది. ఈ దశలో కేంద్రానికి తాము ఆరు అంశాల ప్రశ్నలను సంధిస్తున్నామని, 24 గంటల్లో తమకు తగు సమాధానం ఇవ్వాలని పేర్కొన్న ధర్మాసనం విచారణ ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం జరుగుతుందని తెలిపింది. ‘మణిపూర్ వంటి ఘటనను మీరు ఇతర రాష్ట్రాలలో జరిగిన వాటిని చూపి ఏ విధంగా తక్కువ చేసి చూపుతారు? మీరు తెలియచేయదల్చుకున్నదేమిటీ? అన్నిచోట్లా దారుణాలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడి ఘటనపై కూడా ఇదే విధంగా న్యాయం జరుగుతుందని చెప్పడమా?

దేశంలోని అందరు కూతుళ్లను రక్షించదల్చుకున్నట్లు చెప్పదల్చారా? లేక ఎవరిని రక్షించలేమని చేతులెత్తేస్తున్నారా? తెలియాల్సి ఉంది. ఒక్క చోట జరిగిన అత్యంత అమానుష ఘటనను ఇతర చోట్ల కూడా ఇటువంటివి జరుగుతున్నాయని తెలిపి చేయదల్చుకున్నదేమిటీ? ’ అని తెలిపిన ప్రధాన న్యాయమూర్తి మణిపూర్‌లో ఘర్షణల ఆరంభం నుంచి ఇప్పటివరకూ దాఖలు అయిన దాదాపు ఆరువేల ఎఫ్‌ఐఆర్‌ల్లో ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు మహిళలపై నేరాలు ఘోరాలకు సంబంధించివనే వివరాలు కేంద్రం వద్దా ఉన్నాయా? అని నిలదీసింది. దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదని ఆక్షేపించారు.

ఈ ఆరు పాయింట్లపై జవాబుందా?
ముందు ఆరుపాయింట్లపై తగుసమాధానాలతో తమ వద్దకు విచారణకు హాజరు కావాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాల తరఫు అటార్నీలను సుప్రీం ఆదేశించింది. *కేసుల వర్గీకరణ జరిగిందా?* ఎన్ని నామమాత్రపు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి? *ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లను సంబంధిత ఘటనల పరిధిలోని ఠాణాలకు బదలాయించారు? *ఇప్పటివరకూ ఎందరిని అరెస్టు చేశారు?* అరెస్టు అయిన నిందితులకు ఎటువంటి న్యాయసాయం అందుతోంది?* ఇప్పటివరకూ సెక్షన్ 164 పరిధిలో దరిదాపుల్లోని మెజిస్ట్రేట్ వద్ద స్టేట్‌మెంట్లు తీసుకున్నారు?

స్థానిక పోలీసులకు అప్పగించలేం
మణిపూర్‌లో ఇద్దరు మహిళపై జరిగిన దారుణం ఒళ్లుగగుర్పాటు కల్గించేదిగా ఉంది. తాము ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పగించి కూర్చోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘కాలం గడిచిపోతున్నది. మణిపూర్‌పై ఇంకా కాలాయాపన కుదరదు. ఈ మణిపూర్ మండేగాయం దీనికి అనుబంధమా అన్నట్లు సాగిన ఈ సోదరిలపై అఘాయిత్యంపై వెంటనే స్పందించాల్సి ఉంది. ఇది ఓ నిర్భయ కేసు వంటిది కాదు, నిర్భయ తరహా ఘటన అని ఒక్కచోట జరిగిన ఘటనగా ఇతర చోట్ల కూడా ఇదే విధంగా జరుగుతున్నఘటనల్లో ఒక్కటిగా ఏ విధంగా చూస్తాం? ఇక్కడ జరిగింది ఓ పద్ధతి ప్రకారం ప్రేరేపితం అయిన పెల్లుబికిన హింసాకాండ. ఈ క్రమంలో బలహీనులు బలి అవుతూ ఉంటే చూస్తూ ఉండటం కుదరదు. మహిళ పట్ల జరిగిన ఆటవికాన్ని ఏదో సాధారణ ఘటన పరిధిలోకి తీసుకువచ్చి తిరిగి న్యాయానికి కాలాయాపన ద్వారా చెల్లుచీటి కుదరదు’అని ధర్మాసనం ఈ విచారణకు కేంద్రం 24 గంటల్లో సిద్ధం అయి రావాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News