Saturday, November 23, 2024

శాంతిస్తున్న మణిపూర్..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ ః కోటా కొట్లాటతో తలెత్తిన సంకుల సమరపు మణిపూర్‌లో క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు సైన్యం సున్నిత ప్రాంతాలలో పహారా కాస్తోంది. మరో వైపు ఘర్షణకారులపై తగు పర్యవేక్షణకు డ్రోన్లు, హెలికాప్టర్లను రంగంలోకి దించారు. పరిస్థితి కొంత మేరకు సద్దు మణగడంతో ఆదివారం మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలలో కర్ఫూను సడలించారు. గత కొద్ది రోజులుగా తీవ్రస్థాయి హింసాత్మక తెగల తగవులతో రగిలిన మణిపూర్ ఆదివారం కొంత మేర ప్రశాంతతను సంతరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. మరో వైపు తెలంగాణ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చిక్కుపడ్డ తమ రాష్ట్రాల ప్రజలను , విద్యార్థులను తరలించేందుకు రంగంలోకి దిగాయి. చాలారోజుల పాటు రోడ్లపైకి రాలేని స్థితిలో ఉన్న పౌరులు ఇప్పుడు ఆంక్షలు సడలించడంతో అత్యధిక సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు.

Also Read: ప్లే జోన్‌లో తెగిన చిన్నారి వేళ్లు

నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు దిగారు. ఔషధాలు రోజువారి అవసరాలను సమకూర్చుకునేందుకు రావడంతో పలు చోట్ల సందడి నెలకొంది. ఇంఫాల్‌లో ఉదయం పూట కర్ఫూ సడలించారు. పది గంటలకు ఈ సడలింపు ముగిసింది. ఆ తరువాత ఆర్మీ, అస్సామ్ రైఫిల్స్ దళాలు రంగంలోకి దిగి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. ఘర్షణాయుత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు 120 నుంచి 125 వరకూ సైనిక దళాలు తరలిరావడం, దాదాపుగా పదివేల మంది సైనికులు, పారామిలిటరీ , సిఆర్‌పిఎఫ్ జవాన్లతో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవడంతో పరిస్థితి చక్కబడుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 23000 మంది పౌరులను కాపాడిన సైన్యం వారిని సురక్షితంగా ఉండే వివిధ సైనిక స్థావరాలకు తరలించారు. ఘర్షణలు తలెల్తిన చురాచంద్‌పూర్‌లో కూడా ఉదయం ఏడు నుంచి కొద్ది సేపు కర్ఫూ సడలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News