Friday, November 22, 2024

రాష్ట్రపతి పాలన కావాలి..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: ప్రతిపక్ష ఎంపీల బృందం మణిపూర్‌లో పర్యటిస్తున్న వేళగిరిజనుల కోసం ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను విధించాలన్న తమ డిమాండ్‌కు మద్దతు తెలియజేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ గిరిజన సంఘాల ఐక్య వేదిక అయిన ఇండైజెనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటిఎల్‌ఎఫ్)శనివారం ఈ బృందానికి ఒక లేఖ రాసింది. మణిపూర్‌లో గత మే 3న జాతుల మధ్య మొదలైన హింసాకాండలో ఇప్పటివరకు 150 మందికి పైగా మృతి చెందగా వందలాది మంది నిరాశ్రయులుగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 53 శాతం మేరకు ఉన్న మైతీలు ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఉండగా, నాగాలు, కుకీలు లాంటి గిరిజన తెగలకు చెందిన వారు 40 శాతం దాకా ఉన్నారు. ఈ మైతీలను గిరిజనులుగా పరిగణించాలనే రాష్ట్రప్రభుత్వం యోచన తాజా ఘర్షణలకు ప్రధాన కారణం.

తమ సమస్యను చేపట్టి తాము అనుభవిస్తున్న కష్టాలగురించి దేశానికి తెలియజేయాలని ‘ఇండియా’కూటమిని తాము గట్టిగా కోరుతున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మణిపూర్‌నుంచి విడిగా పరిపాలన కోసం మేము చేస్తున్న డిమాండ్‌ను సమర్థించడం ద్వారా మేము ఈ కష్టాలనుంచి బైటపడడానికి సాయపడాలని, హింసకు ముగింపు పలకడం కోసం రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం’ అని రెండు పేజీల లేఖలో ఐటిఎల్‌ఎఫ్ ప్రతిపక్షాల ఎంపీలను కోరింది. ఈ హింసాకాండలో అన్ని వర్గాలు బాధలు అనుభవించాయని, అయితే కుకీజో గిరిజనులే ఎక్కువగా నష్టపోయారని, ఘరణల్లో మృతి చెందిన వారిలో మూడింట రెండువంతుల మంది ఈ వర్గానికి చెందిన వారేనని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఐటిఎల్‌ఎఫ్ చైర్మన్ పగిన్ హావోకిప్, కార్యదర్శి మువన్‌తోంబింగ్ ఈ లేఖపై సంతకాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News