Wednesday, January 22, 2025

మణిపూర్ వీడియోలపై సుప్రీం ఆగ్రహం: నివేదికలకు ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడానికి సంబంధించిన వీడియోలను సుమోటాగా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇందుకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలేమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గురువారం ఆదేశించింది.

సోషల్ మీడియాలో బుధవారం ప్రత్యక్షమైన ఈ వీడియోలు తమను తీవ్రంగా కలచివేశాయని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. దీనిపై తమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం పేర్కొంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదనీయం కాదని, జాతుల మధ్య ఘర్షణల్లో మహిళలను పావుగా ఉపయోగించుకోవడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వీడియో మే నెలకు చెందినదైనప్పటికీ దాంట్లో దాని వల్ల వచ్చే మార్పేమీ లేదని సిజెఐ అన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మరికొంత వ్యవధి ఇస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తామే ఉత్తర్వులు జారీచేస్తామని సిజెఐ చంద్రచూడ్ చెప్పారు. ఈ సంఘటనకు కారకులైనవారిని అదుపులోకి తీసుకోవడానికి తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలు వివరిస్తూ కేంద్ర, మణిపూర్ ప్రభుత్వాలు తమకు నివేదికలు అందచేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News