Monday, January 20, 2025

మణిపూర్ మంటలకు మూలం!

- Advertisement -
- Advertisement -

మణిపూర్ మళ్ళీ తగలబడుతోంది. కొద్ది రోజుల క్రితమే 70 మంది మృతికి, 3040 వేల మంది నిర్వాసితులై కట్టుబట్టలతో చెట్టు పుట్టా పట్టిపోడానికి దారి తీసిన అల్లర్లు సద్దుమణిగాయనిపించి అంతలోనే తిరిగి భగ్గుమనడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘోర వైఫల్యాన్నే చాటుతున్నది. మణిపూర్‌ను పాలిస్తున్నది కూడా బిజెపియే. కేంద్రంలో దానికున్న అపరిమిత అధికారాలు ఈ రాష్ట్రంలో చెలరేగిన హింసను చల్లార్చడంలో ఉపయోగపడలేదని అర్థమవుతున్నది. మైదాన ప్రాంత అధిక సంఖ్యాక మెయితీలు ఎక్కువగా వుంటున్న బిష్ణుపూర్ జిల్లాలో మొన్న మంగళవారం రాత్రి ఆలస్యంగా తాజా హింస చెలరేగింది. ఇందులో ఒకరు చనిపోయారు.ఆ రాష్ట్ర పిడబ్లుడి మంత్రి ఇంటిని తగులబెట్టారు. ఆదివాసీ ఉగ్రవాదుల నుంచి తమను కాపాడడం లేదన్న ఆగ్రహంతో మెయితీల మహిళలే అధికంగా ఈ దహనకాండలో పాల్గొనడం విశేషం.

త్వరలో మణిపూర్ వెళ్ళి మూడు రోజులుండి సమస్యను పరిష్కరిస్తానని గురువారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మొదటిసారి మే మాసారంభంలో హింస అసాధారణ స్థాయిలో చెలరేగినప్పుడే ఆయన ఈ కృషి ఎందుకు చేయలేకపోయారు? ఆ రాష్ట్రాన్ని అడ్డంగా రగిలించి హింసోన్మత్తతను రెచ్చగొట్టి ఇప్పుడు తగిన పరిష్కారం చూపలేక కేంద్రం చేతులెత్తేస్తున్నది. 28.56 లక్షల మంది జానాభా వున్న మణిపూర్‌లో హిందువులు 41.39 % కాగా, క్రైస్తవులు 41.29% అంటే మెజారిటీ, మైనారిటీ మధ్య తేడా అత్యంత స్వల్పం. ముస్లింలు 8.40%, ఇతర మతాల వారు 8.19%. జనాభాలో మెజారిటీగా వున్న మెయితీలు హిందూ మతాన్ని అవలంబిస్తున్నారు. జనాభాలో వీరు 51.4 శాతంగా వుంటారు. నాగాలాండ్ నుంచి, మయన్మార్ నుంచి క్రైస్తవ తెగవారు అధిక సంఖ్యలో వలస వచ్చినందున హిందువుల శాతం తగ్గిందని చెబుతారు. మెయితీలు మైదాన ప్రాంతంలోనూ, క్రైస్తవులైన కుకీలు, నాగాలు కొండల్లోనూ నివసిస్తుంటారు.

అంటే కుకీలు, నాగాలు ఆదివాసీ గిరిజన తెగకు చెందినవారు. సహజంగానే వారికి ఎస్‌టిలుగా గుర్తింపు వుంది. అందుకు తగిన రక్షణలు వారికుంటాయి. ఎస్‌సిలు, ఒబిసిలుగా గుర్తింపు పొంది అందుకు సంబంధించిన సౌకర్యాలు అనుభవిస్తున్న మెయితీలు తమకు ఎస్‌టిలుగా గుర్తింపు ఇవ్వాలని చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దానిపై కేంద్రానికి సిఫారసు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం సహజంగానే గిరిజన తెగల్లో ఆందోళన కలిగించింది. దానితో ఆల్ ట్రైబల్ రాడికల్స్ యూనియన్ మణిపూర్ (ఎటిఎస్‌యుఎమ్) ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ ఉరేగింపులు తీశారు. మెయితీలకు ఎస్‌టి గుర్తింపు ఇస్తే తాము అనుభవిస్తున్న రక్షణలు పలచబడతాయని వారు భయపడుతున్నారు. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో మొయితీలే 40 మంది. అంటే వారు అనుభవిస్తున్న అధికారం ఎంతటిదో తెలుస్తున్నది.

ఇది ఎంత తీవ్ర స్థాయికి చేరుకొన్నదంటే లోయలోని రాజధాని ఇంఫాల్ నుంచి కుకీ అధికారులు భయపడిపోయి కొండ ప్రాంతాలకు తరలిపోయారు. అలాగే కుకీలు, నాగాలు అధికంగా వుండే గిరిజన ప్రాంతాల నుంచి మెయితీ అధికారులు ఇంఫాల్‌కు వెళ్ళిపోయారు. గిరిజన ప్రాంతంలో మయన్మార్ సరిహద్దులకు చేరువలో ఒక పెద్ద పార్కును నియమించి తంగ్‌జింగ్ అనే దేవుడి విగ్రహాన్ని నెలకొల్పాలని తద్వారా గిరిజనులకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్య సామరస్యాన్ని సాధించాలని మొయితీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వేసుకొన్న పథకం కూడా ఆదివాసీల ఆగ్రహానికి గురైంది. ఇది తమ భూములను స్వాధీనం చేసుకోడానికి పన్నిన పన్నుగడ అని వారు భావిస్తున్నారు. 1927 నాటి భారత అటవీ చట్టాన్ని ఆసరాగా తీసుకొని ముఖ్యమంత్రి తన పథకాన్ని ముందుకు జరుపుతున్నారు.

గిరిజన ప్రాంతంలో గణనీయమైన భాగాన్ని రిజర్వు ఫారెస్టుగా, రక్షిత అటవీ ప్రాంతంగా, వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా చేసి ఆ నెపంతో తమ భూములను తమకు కాకుండా చేస్తున్నారనే ఆగ్రహం ఎస్‌టిల్లో రగులుకొని వుంది. అలాగే సరిహద్దులకు ఆవలనున్న మయన్మార్ నుంచి మాదక ద్రవ్యాలు తెస్తున్నారనే నెపంతో గిరిజనులపై పోలీసు దాడులు జరపడం కూడా వారిలో అసంతృప్తిని రగిలించిందని బోధపడుతున్నది. సైన్యాన్ని దించి కవాతులు జరిపించినా హింసాకాండ ఆగలేదు. ఇంటర్‌నెట్‌ను నిలిపివేసినా ప్రయోజనం లేకపోయింది. విదేశాలతో గల సరిహద్దుల్లో వున్న రాష్ట్రాలను ప్రశాంతంగా వుంచగలగడంలోనే దేశ పాలకుల విజ్ఞత రుజువవుతుంది. ఇతరత్రా ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌పై దృష్టి సారించి అక్కడ ఇరు వర్గాల మధ్య అదుపు చేయడానికి అలవికానంతగా తలెత్తిన అశాంతిని, పరస్పర భయాలను తొలగించవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News