Monday, December 23, 2024

మానని గాయం మణి‘పూర్’

- Advertisement -
- Advertisement -

ఇద్దరు మహిళల్ని నగ్నంగా చేసి, బలవంతంగా పొలాల్లోకి లాక్కెళుతున్న దృశ్యం. రక్తమోడుతున్న మహిళపై సామూహిక అత్యాచారం. దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌లో మారణకాండ ఇలా సాగుతూనే ఉంది. మైనారిటీ కుకీ గిరిజన జాతి నివసించే గ్రామాలపై మెజారిటీ మెయితీ వర్గం ఆయుధాలతో దాడులు చేస్తోంది. ఇళ్ళను, వారి ప్రార్థనాలయాలనే కాకుండా, గ్రామాలకు గ్రామాలనే ధ్వంసం చేస్తోంది. దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 150 మంది మరణించారు. వందలాది ఇళ్ళు, గ్రామాలు ధ్వంసమయ్యాయి.

ఈ విధ్వంసం ఈ రోజుకీ కొనసాగుతూనే ఉంది. మే 4వ తేదీన మహిళలను నగ్నంగా తరుముతూ అత్యాచారం చేస్తే, జులై 19వ తేదీన కానీ ఈ వీడియో బయటకు రాలేదు. ఈ దారుణమైన వీడియో దృశ్యాలు నాగరిక ప్రంచం మొత్తాన్ని కదిలించింది. మనిషన్న ప్రతివారి మనసులను కలిచి వేసింది. ‘ఛప్పన్ ఇంచ్‌కా ఛాతీ’ గల మన విశ్వగురువు హృదయాన్ని మాత్రం కదిలించలేకపోయింది. ఈ దారుణ దృశ్యాల వీడియోను చూసిన సుప్రీంకోర్టు జులై 19వ తేదీన దీన్ని సుమోటోగా స్వీకరించింది. ‘ఈ దృశ్యాలు మమ్మల్ని తీవ్రంగా కలిచివేశాయి. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ‘ఈ పరిస్థితిపై మీరు స్పందిస్తారా? లేక మమ్మల్నే చర్య తీసుకోమంటారా?’ అని మణిపూర్ రాష్ర్టంలోను, కేంద్రంలోనూ ఉన్న బిజెపి ప్రభుత్వాల్ని హెచ్చరించారు. అప్పటికి కానీ మన ప్రధాని నోరు విప్పలేదు. ఇటీవలెనే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించి వచ్చారు. ప్రజాస్వామ్యం మా డిఎన్‌ఎలోనే ఉందని అక్కడ సగర్వంగా ప్రకటించారు. ఆయుధ కొనగోళ్ళ కోసం ప్రాన్స్ కూడా వెళ్ళివచ్చారు.

బైటికొచ్చిన వీడియోతో సుప్రీంకోర్టు ప్రశ్నించేసరికి ‘అరెరే ఎంత పని జరిగిపోయింది!’ అంటూ ప్రధాని మోడీ నాలుక కరుచుకున్నట్టయింది. ఇంటర్‌నెట్‌ను నిలివేసినా ఈ వీడియో దృశ్యాలు బైటికి ఎలా వచ్చాయబ్బా? దేశంలో అంతర్గతంగా ఏ దారుణం జరిగినా బైటి ప్రపంచానికి తెలియకుండా ఉంటే చాలు. విశ్వవేదికపై మన పరువు శాశ్వతంగా నిలబడిపోతుంది. ఎక్కడ గొడవలు జరిగితే అక్కడ ఇంటర్‌నెట్‌ను నిలిపివేయాలి. గుజరాత్ మారణకాండ నేర్పిన గుణపాటం అది. గుజరాత్‌లో మారణకాండ జరుగుతున్నప్పుడు పత్రికలు ఉన్న ది ఉన్నట్టు రాశాయి. అక్కడి దృశ్యాలను టెలిబిజన్ ఛానళ్ళు చూపించాయి. ఇంటర్‌నెట్ ఉండడం వల్ల అక్కడి విషయాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నప్పుడు ఈ గుణపాఠంతోనే ముందర పత్రికల నోళ్ళునొక్కేశాం.

ఇంటర్‌నెట్ నిలిపేశాం. ఢిల్లీలోనూ అదే చేశాం. ఉత్తరప్రదేశ్‌లోనూ అదే చేశాం. మణిపూర్‌లోనూ అదే చేశాం. అయినా ఈ వీడియో బైటికి ఎలా వచ్చిందబ్బా! ‘ఈ మత ఘర్షణలను తక్షణం నిలుపుదల చేయాలి’ అని ఐరోపా పార్లమెంటు విజ్ఞప్తి చేసింది. ‘ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలి. మణిపూర్‌లోకి జర్నలిస్టులను, అంతర్జాతీయ ప్రతినిధులను అనుమతించాలి’ అని కూడా కోరింది. ‘భారత ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఇలా జోక్యం చేసుకోవడం వలసవాద మనస్తత్వం’ అని భారత ప్రభుత్వం ఐరోపా పార్లమెంటుకు సమాధానం చెప్పింది. ఇతర దేశాల్లో జరిగిన జాతి వివక్ష దాడుల గురించి భారత దేశం ఏనాడూ సూచనలు చేయలేదా? ఏనాడూ నోరు విప్పి మాట్లాడలేదా!? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న మానవాళిపైనైనా దారుణమైన హింసను ప్రయోగిస్త్తున్నప్పుడు నాగరిక ప్రంచం చూస్తూ ఊరుకుండ లేదు! అలా చూస్తూ ఊరుకుంటే అది నాగరిక ప్రపంచం ఎలా అవుతుంది? కుకీ మహిళలను నగ్నంగా చేసి మెయితీ మూక తరుముకొస్తున్న వీడియో దృశ్యాల గురించి మణిపూర్ రాష్ర్ట బిజెపి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాట్లాడుతూ ‘ఇలాంటి సంఘటనలు ఇక్కడ చాలా జరిగాయి’ అన్నారు ఎంతో స్థితప్రజ్ఞతతో! అదే బిజెపికి చెందిన పౌలింలాల్ కిప్ అనే శాసనసభ్యుడు న్యూస్‌లాండ్రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండను అదుపు చేయాలని ప్రధానితో మాట్లాడదామని 20 రోజులుగా ప్రయత్నించి, ఎదురు చూసినా, వారు అపాయింట్‌మెంట్ మాత్రం ఇవ్వలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బిజెపి ప్రోద్బలంతోనే ఈ మారణ కాండ జరుగుతోంది’ అని ఆ బిజెపి ఎంఎల్‌ఎ కుండబద్దలుకొట్టారు.

మణిపూర్‌లో గొడవేంటి!? ఏడుగురు అక్కచెల్లెళ్ళుగా భావించే ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. మణిపూర్‌లో ప్రధానంగా మెయితి, కుకీ, నాగాలనే మూడు తెగల వాళ్ళున్నారు. వీటిలోని ఉప తెగలతో కలుపుకుంటే మొత్తం 30 తెగలున్నా యి. మణిపూర్ జనాభా 2011లెక్కల ప్రకారం 28.5 లక్షలు. వారిలో మెయితీ 54%, నాగాలు 24%, కుకీలు 16% ఉన్నారు. మెయితీలు లోయ ప్రాంతాల్లో జీవిస్తుండగా, కుకీ తెగవారు కొండల్లో జీవించే గిరిజనులు. మెయితీల్లో హిందువులు అధికం. వారిలో బౌద్ధులు, సిక్కులు, జైనులు, ముస్లింలు కూడా ఉన్నారు. కుకీంతా క్రైస్తవులు. కుకి గిరిజనులు నివసిం చే కొండ ప్రాంతాల్లో అపారమైన ఆకుపచ్చ గ్రానైట్, ఖరీదైన ఖనిజాలు ముఖ్యంగా లైవ్‌ుస్టోన్ ఉన్నాయని భారతీయ భూగర్భ సర్వేక్షణ (జిఎస్‌ఐ) తెలిపింది. వీటిపై కార్పొరేట్ శక్తుల కన్నుపడింది.

గిరిజనుల భూములను గిరిజనేతరులకు బదలాయించడానికి వీలు లేదని చట్టం నిర్దేశిస్తోంది. గిరిజనులు పొందే రాయితీల కోసం, సంపద కోసం తమను కూడా గిరిజనుల జాబితాలోకి చేర్చాలని మెయితీలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. మెయితీలు ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోను, ముఖ్యంగా పోలీసు శాఖలోను చేరి అనేక సదుపాయాలను, అధికారాన్ని పొందుతున్నారు. వారిని గిరిజనుల జాబితాలో చేర్చితే తమకు వచ్చే సదుపాయాలు తగ్గిపోతాయని కుకీల వాదన. మెయితీలను గిరిజనుల జాబితాలో చేర్చడానికి అనుమతిస్తూ మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గత మార్చిలోనే రూలింగ్ ఇచ్చినప్పటికీ, ఆ రూలింగ్ ఏప్రిల్ 19న మాత్రమే హైకోర్టు వెబ్‌సైట్లో కనిపించింది. ఏడు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఆరు రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం ఆమోదించింది.

ఒక్క మణిపూర్ రాష్ట్రానికి మాత్రం ప్రధాన న్యాయమూర్తి పేరును ఎందుకు పెండింగ్‌లో పెట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము నివసిస్తున్న ప్రాంతంలో గ్రేటర్ అటానమి ఏర్పాటు చేయాలని కోరుతూ కుకీ గిరిజనులు మే 3వ తేదీన శాంతియుతంగా ఆందోళనకు దిగారు. వీరు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసినట్టయితే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. కుకీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మెయితీ మహిళలపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ మెయితీలు ఒక తప్పుడు వీడియో విడుదల చేశారు. నిజానికి అది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో. దాంతో మెయితీ వర్గానికి చెందిన వారు రెచ్చిపోయారు. పదహారు జిల్లాలకు గాను పది జిల్లాల్లో జులై 4వ తేదీ నుంచే విధ్వంసం మొదలైంది.

రాజధాని ఇంఫాల్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌ఫోక్సీ జిల్లాలోని కుకీ ప్రజలు నివసిస్తున్న చురాచాంగ్‌పురిపై మెయితీలు పడ్డారు. ఒక కుటుంబంలోని మహిళలపై దాడి చేశారు. అడ్డుకోబోయిన ఆ కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని అక్కడికక్కడే చంపేశారు. పారిపోయిన ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్‌లో తలదాచుకోగా వారిని రక్షిస్తామంటూ తీసుకెళ్ళి నగ్నంగా చేసి, గాయపరిచి జుగుప్సాకరంగా వ్యవహరిస్తూ పొలాల్లోకి తరుముకున్నారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ వీడియో ఆలస్యంగా వైరల్ అయ్యింది. పోలీసు ఆయుధాగారం పైన దాడి చేసి నాలుగు వేల ఆయుధాలను, అయిదు లక్షల బుల్లెట్లను, మోర్టార్లను ఎత్తుకుపోయారు. వీటిలో అసాల్ట్ రైఫిల్స్ కూడా ఉన్నాయి. పోలీసుల్లో మెయితీలే అధిక భాగం ఉండడం వల్ల ఆయుధాల అపహరణ తేలికైందని, దానికి వారు కూడా సహకరించారన్నది ఆరోపణ. దీనికి పాలనా యంత్రాంగం చూసీ చూడనట్టు ఉండి పోయిందన్న ఆరోపణ కూడా ఉంది. విధ్వంసం మొదలైన రోజునే 50 వేల కేంద్ర భద్రతా బలగాలు దిగాయి. కానీ శాంతిని పరిరక్షించలేకపోయాయి. ఈ ప్రాంతాల్లోకి భద్రతా బలగాలు రాకుండా మెయితీలు రోడ్లను తవ్వేశారు. యుద్ధానికన్నట్టు ట్రెంచెస్ తవ్వుకున్నారు. కుకీల ఇళ్ళు, ప్రార్థనా స్థలాలు ధ్వంసం చేశారు.

మొదటి మూడు రోజుల్లోనే చనిపోయిన 72 మందిలో 60 మంది కుకీలు కాగా, మిగతా పన్నెండు మంది మెయితీలు. వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. తలదాచుకోవడానికి 1200 మంది కుకీలు పక్కనున్న మిజోరాంలోకి వెళ్ళిపోయారు. ఈ అల్లర్లలో మెయితీ మహిళలు కీలక భూమిక పోషించారు. మిజోరాం పౌర సమాజం కుకీలకు సంఘీభావంగా పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శనకు మిజోరాం ముఖ్యమంత్రి కూడా తన మద్దతు తెలిపారు. ‘మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండను చూస్తుంటే గుజరాత్ అల్లర్లు గుర్తుకు వస్తున్నాయి’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ వ్యాఖ్యానించారు. మణిపూర్ మారణకాండపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడితే అధికార పక్షం నిరాకరించింది.

మణిపూర్ మారణకాండ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇస్తే, ఈ తీర్మానానికి ఎట్టకేలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. కానీ, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఏ తేదీ కేటాయిస్తారనేది ఎవరికీ తెలియని ఒక బ్రహ్మపదార్థం. మణిపూర్‌పై ప్రధాని పార్లమెంటులో కేవలం 36 సెకండ్లు మాత్రమే మాట్లాడారు. కుకీ గిరిజనులను వేటాడి, వెంటాడి చంపుతున్నా గిరిజనుల నుంచి వచ్చిన రాష్ర్టపతి ద్రౌపది ముర్ము నోరెత్తితే ఒట్టు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓ ఛానెల్ వారు ప్రశ్నిస్తే మణిపూర్‌తో నాకేం సంబంధం? నన్నెందుకు అడుగుతారు? అని ఎదురు ప్రశ్న వేశారు. బిజెపి యేతర పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఈ మారణకాండ జరిగినట్టయితే కేంద్రం ఊరుకుంటుందా!? వెంటనే ఆ రాష్ర్ట ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ర్టపతి పాలన విధిస్తుంది. మణిపూర్‌లో రాష్ర్టపతి పాలన ఎందుకు విధించదు!? బిజెపి పాలిత మణిపూర్‌లో రాష్ర్టపతి పాలన విధిస్తే, ఆ ప్రభావం వచ్చే ఏడాది మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని మోడీకి భయం. విశ్వగురువు దేశభక్తి ఇలా కాక మరింకెలా ఉంటుందని ఊహిస్తాం!?

రాఘవశర్మ- 9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News