ఇంఫాల్ : మణిపూర్ లోని తెంగ్నౌపాల్ జిల్లాలో లితు గ్రామ సమీపంలో సోమవారం రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. లితు గ్రామ సమీపం నుంచి ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపు వెళ్తుండగా, ఆ ప్రాంతంలోని మరో వర్గం వారిపై కాల్పులు జరిపారు. అవతలి వర్గం కూడా కాల్పులు జరిపింది. దీంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తెలిసి అస్సాం రైఫిల్స్ బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.
మృతులు ఏ వర్గానికి చెందిన వారో ఇంకా తెలియాల్సి ఉందని స్థానిక అధికారి తెలిపారు. గతవారం ఇంఫాల్ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం శాంతి చర్చలు నిర్వహించాయి. ఇవి ఫలప్రదం కావడంతో ఢిల్లీలో శాంతి ఒప్పందం కుదిరింది. ఆదివారం తెంగ్నౌపాల్ జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కుకీ జో గిరిజన వర్గాలు ఈ శాంతి ఒప్పందాన్ని స్వాగతించాయి. దీంతో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మినహా రాష్ట్రమంతా ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఈ పరిస్థితుల్లో కాల్పులు చోటు చేసుకోవడం కలవరం రేపుతోంది.