Sunday, September 8, 2024

చల్లారని మణిపూర్!

- Advertisement -
- Advertisement -

గత నెల 3న భగ్గుమన్న మణిపూర్ మంటలు ఇప్పటికీ చల్లారడం లేదు. ఒకరినొకరు అనుమానంతో చూసుకొంటున్న ఆ ఈశాన్య రాష్ట్రంలోని తెగల మధ్య సామరస్యం ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. అత్యంత సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దుల్లోని మణిపూర్‌లో ఉద్రిక్తతలకు తెరదించలేకపోతే అది మరో అగ్నిగుండంగా కొనసాగే ప్రమాదమున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయం గా వెళ్ళి 3 రోజుల పాటు మకాం వేసి కృషి చేసినా సమస్య ఒక కొలిక్కి రాలేదు. అక్కడ గల మూడు ప్రధానమైన వర్గాల్లో రాజధాని ఇంఫాల్, దాని చుట్టూ గల లోయలో నివసిస్తున్న మెయితీలు రాజకీయంగా విశేష ప్రాధాన్యాన్ని, ప్రాతినిధ్యాన్ని అనుభవిస్తున్నారు.

Also Read: వీధి రౌడీ భాషలో మాట్లాడటం సరికాదు పవన్: ముద్రగడ

వారిలో అధికులు హిందువులు కావడం వల్ల బిజెపి కూడా వారికి వెన్నుదన్నుగా వుందనే అభిప్రాయం నెలకొన్నది. ఇప్పటికే బిసి, ఎస్‌సిలుగా గుర్తింపు కలిగిన మెయితీలు ఇప్పుడు కుకీలు, నాగాలతో సమానంగా తమకూ ఎస్‌టి గుర్తింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది జరిగితే అసలైన ఆదివాసీలుగా తాము పొందుతున్న ఎస్‌టి రిజర్వేషన్లు, భూ హక్కు వగైరా సౌకర్యాలు పలచబడిపోతాయని కుకీలు, నాగాలు ఆందోళన చెందుతున్నారు. అసలే అగ్గిపుల్ల గీసి అంటించడానికి ముందే భగ్గుమనేటట్టున్న అక్కడి పరిస్థితిని వున్నట్టుండి సంక్లిష్టం చేసిన ఉత్తర్వు ఒకటి మణిపూర్ హైకోర్టు నుంచి జారీ అయింది. తమను ఎస్‌టిలుగా పరిగణించేలా కేంద్రానికి సిఫారసు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మెయితీల నుంచి దాఖలైన ఒక పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే ఈ సమస్యకు మూలంలో వున్నాయి.

మెయితీలను ఎస్‌టి జాబితాలో చేర్చాలంటూ కేంద్రానికి సిఫారసు చేయవలసిందిగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మురళీధరన్ ఏక సభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనితో గత నెల 3వ తేదీన మణిపూర్‌లోని అన్ని జిల్లాల్లోనూ ఆదివాసీలు నిరసన ప్రదర్శన తీశారు. అది రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. విచక్షణ రహితంగా ఇళ్ళను తగులబెట్టుకొని హింసాకాండకు దిగిన ఆ ఘటనల్లో అప్పటికప్పుడే 70 మంది వరకు మరణించారు. మణిపూర్ జనాభాలో కుకీలు, నాగాలు 40% వరకు వుంటారు, మెయితీలు 53%. అదే సమయంలో ఆ రాష్ట్ర భూభాగంలో మెయితీలు నివసించే మైదాన ప్రాంతం 10% కాగా, కుకీలు, నాగాలు వుంటున్న కొండ ప్రాంతం 90% వరకు వుంది. అల్లర్లు బొత్తిగా ఉపశమించకపోడంతో ప్రధాన మంత్రిని కలవాలంటూ ఆ రాష్ట్రానికి చెందిన కొంత మంది శాసన సభ్యులు ఢిల్లీ చేసుకొన్నారు. ఇంత వరకు ప్రధాని మోడీ ఈ విషయంపై నోరు విప్పక పోడం పట్ల నిరసనగా ఆదివారం నాడు ఇంఫాల్‌లోని నిరసనకారులు ఆయన మన్ కీ బాత్ రేడియో ‘షో’కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు.

రేడియో ట్రాన్సిస్టర్లను పగులగొట్టి ‘మన బాత్ వద్దు, మణిపూర్‌కి బాత్ కావాలి’ అని నినాదాలు చేశారు. పరిస్థితి గమనిస్తుంటే దీనికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం వద్దనైనా వుందా అనే ప్రశ్నకు అవకాశం కలుగుతున్నది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మెయితీలకు చెందిన వాడు. ఆయన పట్ల మిగతా రెండు తెగలకు ఏ మాత్రం విశ్వాసం లేదు. ఏదో ఒక పథకం, కార్యక్రమం పేరుతో తమ కాళ్ళ కింది నేలను కదిలించి వేసి మెయితీలను కొండ ప్రాంతాల్లో స్థిరపరిచే కుట్రకు ఆయన తెర తీశాడనే అభిప్రాయం కూడా వారికి వుంది. అలాగే సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఇతర దేశాల నుంచి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే ముఠాలు కొండ ప్రాంతాల్లో తలదాచుకొంటున్నాయంటూ తరచూ దాడులు చేయడం అక్కడి ఎస్‌టి తెగలకు అసౌకర్యంగా వుంది. అందుచేత సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే ప్రసక్తే లేదని ఆదివాసీ తెగలు భీష్మించుకొన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతంగాకు ఫోన్ చేసి ఆయన సహాయాన్ని కోరడం విశేషం. జొరాంతంగా మిజో తెగకు చెందిన వారు. మిజోలది, కుకీలది ఒకే నేపథ్యమని వారి సంస్కృతి, సంప్రదాయాలు ఒకటేనని చెబుతారు.

ఈ అల్లర్లను తట్టుకోలేక వేలాది మంది కుకీలు మిజోరాంకు పారిపోయి తలదాచుకొంటున్నారు. గత శనివారం రాత్రి వందలాది మంది మహిళలు ఇంఫాల్‌లో కాగడాల ప్రదర్శన తీశారు. హింసను ఖండించారు. అదే సమయంలో ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌర రిజిస్టర్) ని అమల్లో పెట్టాలని, గతంలో కుకీ తీవ్రవాదులతో కుదుర్చుకొన్న కాల్పుల సస్పెన్షన్ ఒప్పందాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఊరేగింపుదార్లు మెయితీలేనని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. రాష్ట్రంపై మెయితీల పెత్తనాన్ని ఆదివాసీ తెగల వారు బొత్తిగా అంగీకరించడం లేదని బోధపడుతున్నది. అటువంటి నేపథ్యంలో వారికి ఎస్‌టి హోదాను కూడా కట్టబెట్టే ఉద్దేశం బయటపడడంతో వారు మరింతగా అలజడికి, ఆందోళనకు గురి అవుతున్నారు. వారి ఆందోళనను సమూలంగా తొలగించగలిగినప్పుడే హింసకు తావులేని పరిస్థితి నెలకొంటుంది. అందుకోసం దీనికి మూలమైన హైకోర్టు ఉత్తర్వును ఉపసంహరించుకొనేలా చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News