Sunday, January 19, 2025

ఆరని అగ్నికీలల్లో మణిపూర్

- Advertisement -
- Advertisement -

మెయితి, కుకీ తెగల మధ్య బిజెపి ప్రభుత్వం రగిల్చిన కారుచిచ్చు నేడు మణిపూర్‌ను నిలువునా అగ్నిగుండంగా మార్చివేసింది. ఇప్పటికే 50 రోజులు గడుస్తున్నా విద్వేషపు మంటలు చల్లారడంలేదు. ఆర్మీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అసోం రైపుల్స్ దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సాధారణ శాంతియుత పరిస్థితి నెలకొనలేదు. కాగా రోజురోజుకీ అక్కడ హింసాకాండతో పరిస్థితులు మరింతగా దిగజారిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇద్దరు బిజెపి ఎంఎల్‌ఎల ఇళ్లను కూడా దుండగులు తగలబెట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సింగ్ కేబినెట్‌లో రెండవ ర్యాంకుగా ఉన్న వ్యక్తి. ఆయన ఇంటికి కూడా విధ్వంసకారులు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. మణిపూర్‌లో శాంతిభద్రతలు ఎంతగా క్షీణించాయో, ఈ సంఘటనలు రుజువుజేస్తున్నాయి.

ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ మారణహోమంలో ఇంత వరకు 120 మంది దివంగతులయ్యారు. నాలుగు వేలకు పైగా నివాస ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయి. 60 వేల మందికి గూడు చెదిరింది.ఏ క్షణాల్లో ఏ మూల నుండి ఎలా దాడి జరుగుతుందోనని ప్రాణ భయంతో ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. బతుకు జీవుడా అంటూ వేలాది మంది గిరిజనులు పొరుగు రాష్ట్రాలకు తలదాచుకొనేందుకు శరణార్ధులుగా వలసపోతున్నారు. తిండి గింజలు, కనీస నిత్యావసర వస్తువులు బజారులో దొరకడం లేదు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వైద్య సేవలు అందక అనేక మంది ప్రాణాలు కోల్పోవడం నిత్య కృత్యం అయింది. ప్రధాని చెప్పే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు వస్తే జరిగేది వికాస్ కాదు… విధ్వంసమే అనడానికి మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండే ఒక ఉదంతంగా చెప్పుకోవచ్చు.

మణిపూర్ సంక్షోభానికి ఒక పరిష్కార మార్గం చూపండని కేంద్రాన్ని కోరేందుకు ఆ రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపక్ష నేతల బృందం ఢిల్లీలో పది రోజులుగా పడిగాపులు కాస్తున్నా ప్రధాన మంత్రి మోడీ అపాయింట్‌మెంట్ వారికి దొరకలేదు. మణిపూర్ మంట ల్లో భగభగామండుతూ ఉంటే.. దానికి పరిష్కారం చూపకుండా ప్రధాని ఎన్నికల ప్రచారంలో తలమునకలై వారిని పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ మారణకాండ, గృహ దహనాలతో 50 రోజులు మండిపోతున్నా తీవ్రమైన ఈ విషయాన్ని పట్టించుకోకుండా మోడీ అమెరికా పర్యటనకు వెళ్ళడం పలువురి విమర్శలకు దారి తీసింది. పక్షపాత రహితంగా పాలన సాగిస్తామంటూ ప్రమాణం చేసిన బిజెపి పాలక పార్టీలు రాజకీయ ప్రయోజనాలే ఆధారంగా మతతత్వ విద్వేషాలను రెచ్చకొడుతూ జాతుల మధ్య కలహాలను పెంచి పోషించటం శోచనీయం. ఈ వివక్ష పాలన ఫలితంగానే మణిపూర్‌లో అంతులోని హింసా కాండ చోటు చేసుకొన్న ది.

అక్కడ మెయితి (హిందువుల) ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం హిందూ మతత్వాన్ని పెంచి పోషించటానికి బీరేన్ సింగ్ ప్రభుత్వం పని చేస్తుంది. ప్రజల మధ్య మత విభజనను ప్రోత్సహించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.అందుకే రాష్ట్రంలోని మెజార్టీ వర్గమైన మెయితి (హిందువులకు) లకు ఎస్‌టి రిజర్వేషన్లు కల్పించేందుకు శత విధాలా బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేసింది.మెయితిలను ఎస్‌టి జాబితాలో చేర్చే ప్రక్రియపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వారికి రిజర్వేషన్ ఇస్తే కొండ ప్రాంతాల్లో తమ భూములు కోల్పోతే, తమ ఉద్యోగాలు ఎగరేసుకుపోతే, తమ గతేమిటని గళమెత్తిన కుకీలపై (క్రైస్తవ గిరిజనులు) బీరేన్ సింగ్ సర్కారు మద్దతు ఇస్తున్నట్లు భావిస్తున్న గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో మొదలైన ఈ హింసాకాండ రావణ కాష్ఠంగా నేటికీ మండుతూనే ఉంది.

మెయితిలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు, నాగాలు తదితర ఆదివాసీలు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. కొండ ప్రాంతాల నుంచి మెయితిలు కూడా ఇదే వలస బాటపడుతున్నారు. అయితే మెయితిలలో అత్యధికులు హిందువులు, కుకీ, నాగా తదితర గిరిజన తెగల్లో అత్యధికలు క్రైస్తవులు. అయితే ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పేరుతో ఇంఫాల్‌లో అనేక క్రైస్తవ చర్చిలను బిజెపి ప్రభుత్వం కూల్చి వేసింది. ఆ తరువాత జరిగిన హింసాకాండలో… గతంలో ఎన్నడూ జరగని విధంగా వందలాది క్రైస్తవ చర్చిలతో సహా ఆసుపత్రులు అంబులెన్స్‌లను సైతం నిత్యం తగలబడుతున్నారు. వైద్య సహాయం అందక చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు దయనీయంగా పిట్టల్లా రాలిపోతున్నారు. పరస్పర దాడు లో వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు తగలబడిపోతున్నాయి.

ఈ విద్వేష విషం ఎంతగా పాకిందంటే తమ ప్రత్యర్థులకు తినటానికి కనీసం తిండి, తాగటానికి నీరు సైతం అందకుండా చేసేంత క్రూర దశకు వెళ్ళింది. మణిపూర్ రైఫిల్స్ దళం నుంచి, పోలీసుల నుంచి ఎత్తికెళ్ళిన ఆయుధాల్లో ఎక్కువ భాగం మెజారిటీ తెగ మెయితిల వద్దే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘ఆ ఆయుధాలను దయ వుంచి తిరిగి ఇచ్చేయండీ’ అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ దీనంగా చేస్తున్న విజ్ఞప్తులు చూస్తే బిజెపి ప్రభుత్వం అసమర్ధ పరిపాలనకు ఒక మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. అయినా అల్లరి మూకలు విధ్వంసకాండను ఆపడం లేదు. మంటలు చెలరేగిన 25 రోజులు తర్వాత తీరిగ్గా అక్కడికి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చే 15 రోజుల్లో పరిస్థితులన్నీ చక్కపడతాయని కేవలం హామీ ఇచ్చి వచ్చారు. కానీ ఆయన పర్యాటన తర్వాత మణిపూర్‌లో హింస మరింతగా చెలరేగిందే తప్ప ఇప్పటికీ చల్లారలేదు.

మెయితి (హిందువులు) లకు బీరేన్ సింగ్ ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉండడంతో… గవర్నర్ నేతృత్వంలోని శాంతి కమిటీకి సహకరించేటందుకు కుకీలు ముందుకు రావటం లేదు. ప్రభుత్వం మీద తమకు నమ్మకం పోయిందని కుకీలు అంటూ ఉంటే.. కుకీలను అణచివేయడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోతుందని మెయితిలు ప్రతివిమర్శ చేస్తున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న సంకుచిత మతతత్వ ధోరణే ఈ సమస్యకు మూల కారణంగా కనపడుతుంది. వ్యూహత్మకంగా ఎంతో కీలకమైన ఈశాన్య ప్రాంతంలో అశాంతి చెలరేగడం, శాంతి భద్రతలు లోపించటం దేశ సమైక్యత, సమగ్రతలకు ముప్పుగా మారక ముందే మణిపూర్ సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News