1972లో ఒక రాష్ట్రంగా ఏర్పడిన మణిపూర్ ఈశాన్య భారతంలో వైశాల్యం, జనాభాలో మూడవది. ఈ చిన్న రాష్ట్రం జనాభా 33 లక్షలు. ఈ చిన్న ప్రాంతం లో 90% కొండ ప్రాంతం. ఈ ప్రాంతంలో కుకీ, నాగా, జోమి తదితర ఆదివాసీ తెగలకు చెంది నవారు జీవిస్తున్నారు. జనాభాలో 43శాతంగా ఉన్న వీరిలో 95 శాతం క్రైస్తవులు. వీరు వెనుకబడి ఉన్నారు. మిగతా 10 శాతం లోయ సారవంతమైన, అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ మెజారిటీ మెయితీ తెగ 57 శాతంగా ఉన్నారు. వీరిలో 75 శాతం హిందువులు, ముస్లింలు ఉన్నారు. కొండప్రాంత ఆదివాసీలు ప్రాథమిక అవసరాలు కూడా తీరని జీవన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే, మెయితీలు వ్యవసాయం, పశుపోషణ వంటి వృత్తులతో పాటు దేశ విదేశీ టూరిజం సంపాదనతో మెరుగైన జీవనం కలిగి ఉన్నారు.భూమిపై యాజమాన్యం, విద్య, వైద్యం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 65 నుండి 75 శాతం వరకు మెయితీలే ఆధిపత్యం కలిగి ఉన్నారు. మణిపూర్ అసెంబ్లీలో 60 సీట్లు ఉంటే వాటిలో 40 ఎంఎల్‌ఎ సీట్లు మెయితీలవే. రాష్ట్ర అధికార చిహ్నాలు, భాషా, లిపి అన్నీ మెయితీలవే గుర్తింపు పొందాయి.
సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందిన మెయితీలు కొండ ప్రాంతాలలోకి విస్తరించి అక్కడి భూములు, ఇతర ఆస్తులు కొల్లగొట్టకుండా ఆదివాసీ చట్టాలు కాపాడుతున్నాయి. అయినా మెయితీలు, కుకీలు వందల సంవత్సరాలుగా కలసి జీవిస్తున్నారు. అయితే మెయితీలు కొంత కాలంగా ఎస్‌టి స్టేటస్ కావాలని కోరుతున్నారు. దీనికి కుకీలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మెయితీలకు ఎస్‌టి హోదా వస్తే, అడవి కొండ ప్రాంతాల భూములపై వారి ఆధిపత్యం పెరిగి తమ జీవనోపాధి దెబ్బతింటుందని, తమపై మెయితీ తెగ పెత్తనం పెరిగి అన్ని రంగాలలో తమకు అన్యాయం జరుగుతుందని కుకీల భయం. ఇటీవల అటవీ సంరక్షణ చట్టాలను బడాబాబులకు అనుకూలంగా కొన్ని సవరణలు చేశారు. ఈ సవరణల ప్రకారం అడవి బిడ్డలైన ఆదివాసీలు ఆక్రమణదారులు అంటూ వారిని అడవుల నుంచి బలవంతంగా ఖాళీ చేయించే పని మొదలైంది. తద్వారా అటవీ సంపద, అక్కడి విలువైన ఖనిజ సంపద మొత్తం అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు అప్పజెప్పే పనిని కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు వేగవంతం చేశాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న మణిపూర్ హైకోర్టు మెయితీ తెగ ఎస్‌టి హోదా డిమాండ్‌ను ఆమోదించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీనితో కుకీల భయం నిజమైంది. తమ ఉనికికే పెద్ద ప్రమాదం వచ్చిపడిందని గుర్తించిన కుకీలు నిరసన తెలిపారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మతతత్వ శక్తులు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ నిరసనలు భయానక మారణకాండకు దారి తీశాయి. ఇక అసలు విషయానికి వస్తే మెయితీలకు ఎస్‌టి హోదా కల్పించి కుకీల అటవీ భూములను మెయితీలకు కట్టబెట్టి ఇలా అటవీ ప్రాంతంపై ఆధిపత్యం కల్పించటం ద్వారా సామ్రాజ్యవాద బడా పెట్టుబడిదారులకు అటవీ సంపదను దోచిపెట్టడం పాలకుల అసలు వ్యూహంగా ఉంది. అందుకే ఈ మారణకాండ. సువిశాలమైన సాంస్కృతిక వైవిధ్యం, భిన్నత్వం కలిగి కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య విద్వేసం రగిలించటం ఇందులో భాగంగా చూడాలి. నేడు దేశం మొత్తం ఈ పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మణిపూర్‌లో గనులు, విలువైన ఖనిజ సంపద కోసం అన్వేషణ మొదలైంది. ప్రభుత్వ రంగ సంస్థ జిఎస్‌ఐ పెద్ద ఎత్తున సర్వేలు చేపట్టింది.
ఈ సర్వేలలో ఆదివాసీలు నివసించే అటవీ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. విలువైన ఆకుపచ్చ గ్రానైట్, ప్లాటినం గ్రూప్ మెటల్స్, ఎలిమెంట్స్, నికేల్, నోమైట్, కాపర్, బొగ్గు, పెట్రోలియం, సిమెంట పరిశ్రమకు అవసరమైన సున్నపురాయి లాంటి విలువైన నిక్షేపాలు గుర్తించారు. ఈ నిక్షేపాల అప్పగింతలపై మణిపూర్ ప్రభుత్వం 2017లో 39 కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అయితే ఆదివాసీ ప్రజలు నివసించే అటవీ, కొండ ప్రాంతాలలో వారికి కొన్ని రాజ్యాంగ, చట్టపరమైన హక్కులు ఉన్నాయి. కాబట్టి అక్కడ మైనింగ్ దోపిడీకి సాధ్యం కాదు.
ఇది బహుళ జాతి కంపెనీలకు అడ్డంకిగా ఉంది. ఇందులో భాగమే అటవీ సంరక్షణ చట్టాల మార్పు చేయడం, హింసాత్మకంగా ఆదివాసీలను బలవంతంగా అడవుల నుంచి గెంటి వేయడం, వారిని మనస్తాపనకు గురి చేయడం, మారణకాండలు సృష్టించడం, వీరిని మాదకద్రవ్యాల స్మగ్లర్లుగా, చట్టవిరుద్ధ కాందీశీకులుగా బురద జల్లడం జరుగుతున్నా యి.పైకి మణిపూర్ మారణకాండ రిజర్వేషన్ల జాతుల వైరంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో అది అటవీ, ఖనిజ సంపద మొత్తం బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడమే అసలు లక్ష్యం. కాబట్టి ఈ దేశప్రజలు వాస్తవాలను గుర్తించి ఈదేశాన్ని విభజించి పాలిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు పాలక మూకల నుండి కాపాడుకోవాలి.మణిపూర్ ఆదివాసీ ప్రజలకు అండగా నిలబడాలి.మణిపూర్‌లోశాంతిని నెలకొల్పాలి.ఆదివాసీ ప్రజలపై పాలకులు సాగిస్తున్న దాడులను వ్యతిరేకించాలి.
షేక్ కరిముల్లా, 9705450705