Saturday, November 16, 2024

మణిపూర్ కుంపటి చల్లార్చే యత్నం..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో తిరుగుబాటు దార్లతో తలెత్తుతున్న సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ దౌత్యయత్నాలు చేపట్టారు. తాను ఇంఫాల్ లోయ తిరుగుబాటు బృందంతో శాంతి చర్చలు జరిపినట్లు సింగ్ ఆదివారం వార్తాసంస్థలకు తెలిపారు. అయితే ఏ అజ్ఞాత సంస్థతో సంప్రదింపులు జరిగాయనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. తాను చేపట్టిన చర్చలు ఇప్పుడు పురోగతి దశలో ఉన్నాయని చెప్పారు. మణిపూర్‌లో ఈ ఏడాది మే నెల నుంచి తెగల మధ్య వైరాలు అపార ప్రాణనష్టానికి దారితీశాయి. ఈ చల్లారని ఘర్షణల వెనుక తిరుగుబాటుదార్ల ప్రమేయం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తిరుగుబాటుదార్ల బృందాలతో చర్చలు జరుపుతున్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించడం ఇదే తొలిసారి.

నిషేధిత యుఎన్‌ఎల్‌ఎఫ్ ఇంఫాల్ వ్యాలీ ప్రాంతంలో ఎక్కువగా ప్రాబల్యం చాటుకొంటోంది. ఈ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్)తోనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఇటీవలే అనధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మైతీలు, ఇతర తెగల నడుమ ఎస్‌టి హోదా అంశం చిచ్చుకు దారితీసింది. మే నెల నుంచి సాగుతోన్న హింసాకాండలో ఇప్పటివరకూ 180 మందికి పైగా మృతి చెందారు. కొన్ని ప్రాంతాల ప్రజలు నిర్వాసితులు అయ్యారు. విదేశీ శక్తుల సాయం ఉన్న తిరుగుబాటుదార్ల బృందాల ప్రమేయంతనే మణిపూర్ సంక్షోభం ఎడతెగకుండా సాగుతోందని అధికార వర్గాలు పలు దశలలో నిర్థారించుకున్నాయి. రాష్ట్రంలో నాగాలు, మైతీలు, కుకీల మధ్య నెలకొన్న వైరం అత్యంత కీలకమైన సహజీవన ప్రశాంతతను తూట్లు పొడిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News