Saturday, November 23, 2024

మణిపూర్ దారుణంపై ముర్ము మౌనం!

- Advertisement -
- Advertisement -

అపరిమిత ఆదివాసీ అనుకూల అర్హతలు కలిగిన ప్రథమ మహిళ ముర్ము మణిపూర్ మానవత్వ సమాధిని గురించి స్పందించలేదు. మణిపూర్ ప్రథమ మహిళ గవర్నర్ అనుసూయ ఉకి కిమ్మనలేదు. మోడీ మీద గాలి వీచినా వాయుదేవున్ని తిట్టే సంఘ్ శ్రేష్ట స్త్రీలు ఎవరూ మణిపూర్ మారణ కాండను, మహిళా మానప్రాణహననాలను ఖండించలేదు, ప్రస్తావించలేదు. వీరంతా మోడీ దయతో పదవులు పొందామని, ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించకూడదని కంకణం కట్టుకున్న వైదికవాద పురుష పక్షపాత స్త్రీలు. మణిపూర్ మానవత్వ హననం పట్ల మోడీ మౌనించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమకారుల విమర్శ. మణిపూర్ మౌనం మోడీకి మొదటిది కాదు. సంఘ్ ప్రథమ ప్రయోగశాల గుజరాత్‌లో ముస్లింల మానప్రాణాల, మానవత్వ హత్యలపై మౌనం వహించారు. హింస కొనసాగింపుకు పోలీసులనూ మౌనంగా ఉండమన్నారు.

మానవవాదులు కురుచ కురుకృత్యాలతో అఘాతానికి, దిగ్భ్రాంతికి, విభ్రాంతికి భయోత్పాతానికి లోనవుతారు. కొందరి మానసిక ప్రవృత్తిని ఇవే దుష్కృత్యాలు సకారణ సవివరణలతో వివేకపరుస్తాయి. అభిజాత్య, అమానవీయ భావజాలంతో ఎదిగినవారు సహజ నామాలకు తగ్గట్లు దుర్యోధన, దుశ్శాసన దుశ్చర్యలను సమర్థిస్తారు. రాజకీయీకరిస్తారు. 21 ప్రతిపక్ష పార్టీల ఎంపిలు మణిపూర్ మారణకాండను, ‘అ’సహాయక శిబిరాలను జులై 29, 30 తేదీలలో పరిశీలించారు. బాధితుల బాధలతో, ఆదివాసీ ఆడతనాన్ని ఆయుధంగా చేసుకున్న మోడీ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల విద్వేష రాజకీయాలతో వారి గుండెలు మండాయి.

30 వ తేదీన ఎంపిలు వినతి పత్రంతో మణిపూర్ మహిళా గవర్నర్ అనుసూయా ఉకీ విధులను, ఆడతనాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు ఈ ఆదివాసీ మహిళ న్యాయవాది, అధ్యాపకురాలు, వ్యవసాయ సామాజిక కార్యకర్త. 38 ఏళ్ల క్రితమే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్త్రీశిశు అభివృద్ధి శాఖ మంత్రి. 25 ఏళ్ల క్రితం స్వీయ ప్రగతి కోసం బిజెపిలో చేరారు. 2019లో చత్తీస్‌గఢ్ గవర్నర్ కాక ముందు మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ అధ్యక్షురాలిగా, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఆదివాసీ ఓటర్లను దువ్వడానికే మోడీ ఈమెకు ఇన్ని పదవులు కట్టబెట్టారు. రాజ్యాంగ అధికరణ 356 ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను గవర్నర్ రాష్ట్రపతికి నివేదించాలి. ఈ గవర్నర్ ఈ పని చేయలేదు.

మణిపూర్ మానవ హననాన్ని చూసివచ్చిన తర్వాత ప్రతిపక్ష కూటమి ఆగస్టు 2 న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్ మానవత్వ హత్యలో ఆమెను కల్పించుకొమ్మని, పార్లమెంటులో మాట్లాడి ఆ అగ్గిని ఆపమని ప్రధానికి సూచించమని వేడుకున్నారు. మహిళత్వ హత్య సత్యాలను ప్రస్తావించడానికి మణిపూర్ నుండి ఇద్దరు మహిళా ప్రతినిధులను రాజ్యసభకు నియమించమని కోరారు. ప్రధాని కార్యాలయానికి 100 కి.మీ. దూరంలో హర్యానాలో జరుగుతున్న మత కల్లోలాలను ప్రభుత్వం పట్టించుకోలేదనీ చెప్పారు. వినతి పత్రం ఇచ్చారు. ముర్ము ఆదివాసీ. సంఘ్ సభ్యురాలు. మానవత్వ ఆధ్యాత్మిక స్ఫూర్తిని మేల్కొలిపే, స్త్రీలపై నకారాత్మకత, చెడుల నివారణకు నడుం బిగించిన బ్రహ్మపుత్రికల సమాజం బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక ఉద్యమ ఆచరణురాలు.

అరబిందో సమగ్ర విద్య పరిశోధన పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. స్త్రీ సమానత్వానికి, దళితుల గౌరవానికి పాటుబడ్డ నెహ్రూ, గాంధీ, అంబేడ్కర్‌లను మెచ్చుకున్న మేలు మహిళ. ఒడిశా మత్స్య పశు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. 2016-17 లో బిజెపి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆదివాసుల భూములను వాణిజ్యానికి వాడుకోడానికి, అద్దె పేరుతో ఆక్రమించుకోడానికి ప్రభుత్వానికి హక్కులు కల్పిస్తూ చట్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా జార్ఖండ్ ఆదివాసులు పాథలగడ్ ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున పోరాడారు. గిరిజన తెగలపై పోలీసులు అక్రమంగా, దుర్మార్గంగా ప్రవర్తించారు. అందులో బిజెపి నిర్బంధంలో జైలులో మరణించిన స్టాన్ స్వామీ ఉన్నారు. గవర్నర్ ముర్ము ప్రభుత్వ పక్షం వహించారు.

ఆ చట్టాన్ని వ్యతిరేకించిన 192 వినతి పత్రాలను చెత్తబుట్టలో పడేశారు. పాథలగడ్ ఉద్యమాన్ని నీరుగార్చారు. జాతీయ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ను దుర్లక్ష్యం చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా గిరిజనులనే రాజ్యాంగాన్ని గౌరవించమని కోరారు. మత స్వేచ్ఛ పేరుతో బిజెపి ప్రభుత్వం చేసిన మతమార్పిడి వ్యతిరేక బిల్లును ముర్ము ఆమోదించారు. రాష్ట్రపతి ప్రారంభించవలసిన కొత్త పార్లమెంటు భవనాన్ని మోడీ ప్రారంభించారు. ఆమెను ఆహ్వానించ లేదు. అయినా ముర్ము మోడీని అసమర్థతతో సమర్థించారు. ప్రధాని పార్లమెంటుకు ప్రతీక. ఆయన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడంతో గర్వపడుతున్నాను. ప్రగాఢ సంతృప్తిని పొందాను అని దాసత్వం ప్రదర్శించారు.
రాజ్యాంగ అధికరణ 52 ప్రకారం రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరురాలే గాక దేశ సంఘీభావ, సమైక్యత, సమగ్రతల చిహ్నం. సమాఖ్య కార్యనిర్వాహక వర్గ అధిపతి.

అత్యవసర అంశాలపై, ప్రత్యేకించి మానవత్వ మరణంపై ప్రధానిని హెచ్చరించ గల అధికారి. అనుకోని సమస్యలలో పౌరుల ప్రాథమిక హక్కుల హామీకి రాష్ట్రపతికి నిర్దిష్ట పాత్ర, అధికారాలు, ప్రత్యేక రాజ్యాంగ నియమాలు ఉన్నాయి. అధికరణ 60 ప్రకారం రాజ్యాంగం, చట్టాల నిర్ధారణ, సంరక్షణ రాష్ట్రపతి రాజ్యాంగ విధి. అధికరణ 78 ప్రకారం పాలనా వ్యవహారాల సమాచారాన్ని గురించి ప్రధానిని అడిగే హక్కు ఉంది. నేటి మణిపూర్ సంఘటన ఇలాంటిదే. మంత్రి వర్గాన్ని హెచ్చరించడం, ప్రోత్సహించడం రాష్ట్రపతి ధ్రువీకరణ సంప్రదాయ హక్కు. మణిపూర్ సర్వాంగ మృత సందర్భంలోనూ ముర్ము మౌనించారు.
అపరిమిత ఆదివాసీ అనుకూల అర్హతలు కలిగిన ప్రథమ మహిళ ముర్ము మణిపూర్ మానవత్వ సమాధిని గురించి స్పందించలేదు. మణిపూర్ ప్రథమ మహిళ గవర్నర్ అనుసూయ ఉకి కిమ్మనలేదు. మోడీ మీద గాలి వీచినా వాయుదేవున్ని తిట్టే సంఘ్ శ్రేష్ట స్త్రీలు ఎవరూ మణిపూర్ మారణ కాండను, మహిళా మానప్రాణహననాలను ఖండించలేదు, ప్రస్తావించలేదు.

వీరంతా మోడీ దయతో పదవులు పొందామని, ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించకూడదని కంకణం కట్టుకున్న వైదికవాద పురుష పక్షపాత స్త్రీలు. మణిపూర్ మానవత్వ హననం పట్ల మోడీ మౌనించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమకారుల విమర్శ. మణిపూర్ మౌనం మోడీకి మొదటిది కాదు. సంఘ్ ప్రథమ ప్రయోగశాల గుజరాత్‌లో ముస్లింల మానప్రాణాల, మానవత్వ హత్యలపై మౌనం వహించారు. హింస కొనసాగింపుకు పోలీసులనూ మౌనంగా ఉండమన్నారు. ఆ మౌనం రాజధర్మ విరుద్ధమన్న ప్రధాని వాజ్‌పేయీకి అబద్ధాలు చెప్పారు. బిజెపి ద్వితీయ నాయకులతో వాజ్‌పేయీని సహజ విరోధ సంఘ్ ప్రక్రియలో బంధించారు. రాజస్తాన్, చత్తీస్‌గఢ్ ఆదివాసుల హత్యల్లో, భూఆక్రమణల్లో, సహజ వనరుల దోపిడీలో మోడీ మౌన యోగం చేశారు.

మనం స్వచ్ఛ సంప్రదాయ ప్రజాస్వామ్య, రాజ్యాంగ నియమాల ఊహలలో ఉన్నాం. మతమదోన్మాదుల నుండి అవే విలువలను ఆశిస్తున్నాం. సాధారణంగా దేశ రాష్ట్రపతులు, ప్రధానులు రాజ్యాంగ విలువలనే పాటిస్తారు. వ్యక్తిగత ఆచారాలను ప్రక్కనపెడతారు. కాని మోడీ తత్వంవేరు. ఆయన వైదికవాద మత ప్రచారకుడే కాని రాజ్యాంగ ప్రధానిగా ఎదగలేదు. ఎదగరు కూడా. అందుకే ఆయన ఏ సందర్భంలో మాట్లాడినా శతాబ్దాల నాటి ముస్లిం పాలనా బానిసత్వం, బిజెపి అవినీతి తప్ప ఇతరుల అవినీతి, వాజపేయీ పాలనతో సహా గత 70 ఏళ్ల అభివృద్ధి రాహిత్యాన్ని గురించే పదాల పొందికతో, ప్రాసలతో, శబ్దాలంకారాలతో, వాక్చాతుర్యంతో ఢమాయిస్తారు.

మొన్న తన మణిపూర్ ఆశ్రితపక్షపాత, ఎన్నికల లబ్ధి నిర్లజ్జను 140 కోట్ల భారతీయులకు పంచారు. బిజెపియేతర ప్రభుత్వాల పాపాలను ఉటంకించి మణిపూర్ వైదికవాద వైష్ణవ మెయితీయ మతోన్మాదాన్ని పలుచబరిచారు. మణిపూర్ మానవత్వ మృతప్రహసన నిరోధక బాధ్యత తనది కాదని పరోక్షంగా ప్రస్తావించి, దాన్ని ముఖ్యమంత్రులందరికీ పంచారు. రేపు అవిశ్వాస తీర్మాన స్పందనగా ఇలాంటి మాటల తూటాలనే పేల్చుతారు. ప్రధానిగా మారని మతోన్మాది నుండి ఇంత కంటే ఏమి ఆశించగలం? సర్వోన్నత న్యాయస్థాన మానవవాద న్యాయపీఠం ముగ్గురు పూర్వ స్త్రీ న్యాయమూర్తులతో నిఘా, ఉపశమన, నివారణ, పరిహార, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. అమానవ అధికార రాజకీయుల స్పందన ఎలా ఉంటుందో?

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News