Wednesday, January 22, 2025

సమస్యను పరిష్కరించని సర్కార్!

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో మే 4, 2023న జరిగిన కుకీ మహిళలను వివస్త్రలనుగా చేసి వందలాది మంది మూక మధ్యలో ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసి, ఒకరిని హత్యచేసిన ఘటన జులై 19, 2023న విషయం బహిర్గతంకావడంతో పార్లమెంటు తీవ్ర ఆందోళన చేపట్టింది. కానీ మూడు నెలలుగా సాగుతున్న మణిపూర్ మారణకాండపై ప్రధాని మోడీ జులై 20, 2023న నోరు విప్పారు. ఈ మూడు నెలల కాలంలో ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికలపై దృష్టి పెట్టారు. విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల ఒడంబడికలపై మునిగిపోయారు.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

కాని మణిపూర్‌లో ప్రజలపై దాడులను నియంత్రించడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పర్యటించారు, సిఎం బీరేంద్ర సింగ్‌తో కలిసి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పరచారు. కానీ నేటి వరకు అల్లర్లు ఆగనే లేదు. చివరికి ఈ సామూహిక అత్యాచార ఘటనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ స్పందించడంతో ప్రధాని మోడీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీలు ఘాటుగా స్పందిస్తూ నేరస్థులను శిక్షిస్తాం, ఉరి తీస్తాం అని మీడియా ముందు మాట్లాడుతున్నారు.

కానీ మే మొదటి వారం నుంచి ప్రారంభమైన అల్లర్లను నియంత్రించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదు సరికదా ఇలాంటి మారణకాండను కొనసాగించడం కోసమే ఆరువేల ఆయుధాల లూటీని ప్రకటించారు. కానీ ప్రభుత్వమే మెయితీ జాతీయులకు ఈ ఆయుధాలను అప్పగించినట్లుగా అర్థమవుతుంది. మణిపూర్‌లో కుకీలు, నాగా జాతీయులే ఆదివాసీ తెగలుగా ఇప్పటి వరకు గుర్తించబడ్డారు. కానీ తాజాగా మెజారిటీగా ఉన్న మెయితీ తెగను కూడా గిరిజన తెగగా గుర్తించే విధానం అమలులోకి వచ్చింది. మణిపూర్ రాష్ర్ట జనాభా 32 లక్షలు. వారిలో 53% ఒబిసికి చెందిన మెయితీలు, వీరు మెజారిటీ హిందువులు, పురోహితులు కూడా ఉన్నారు. 40% నాగా, కుకీ తెగలకు చెందిన ఆదివాసీలు. ఆదివాసీల్లో మెజారిటీ క్రైస్తవులు.

అత్యల్పంగా హిందువులు కూడా ఉన్నారు. మిగిలిన 10% ప్రజలు ముస్లింలు, ఇతర తెగల వాళ్ళు. 80 శాతం భూమి అడవులు, నీటి కొలనులతో ఉంటుంది. అక్కడ ఆదివాసీలు నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతంలో మెయితీలు జీవిస్తున్నారు. 16 జిల్లాలతో ఉన్న మణిపూర్ రాష్ర్టంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 40 మంది మెయితీలు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మెయితీ తెగకు చెందినవాడు. 10 మంది నాగా, 10 మంది కుకీ తెగలకు చెందినవారు ఉన్నారు. 1950కి పూర్వం మెయితీలు ఎస్‌టి జాబితాలో ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఒబిసి జాబితాలో కొనసాగుతున్నారు. గత కొన్నేళ్లుగా మెయితీలు తమను ఎస్‌టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మణిపూర్ హైకోర్టు మెయితీలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని సిఫార్సు చేస్తూ నాలుగు వారాల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని దాడులకు కారణంగా ప్రచారం చేస్తున్నారు.
జాతుల మధ్య వైరుధ్యమే ప్రధాన అంశంగా మారి తీవ్ర విధ్వంసాలకు గురవుతున్న నేపథ్యంలో జాతులు స్వేచ్ఛను కోరుకుంటాయనే విషయం కనుమరుగైపోయి మతం ముందుకు వచ్చింది. మతం ఎప్పుడైనా పీడిత ప్రజలకు నిట్టూర్పు మాత్రమే. అదే మతం రాజకీయ పార్టీలకు బలమైన ఓటు బ్యాంకు. ప్రజాస్వామ్యం విలువలను కోల్పోయి వివస్త్రగా మణిపూర్‌లో దగ్గమవుతూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో అధికారం కోసం కులం, మతం, ప్రాంతీయతలు రాజకీయ పార్టీలకు ఓట్లు ప్రోది చేసే కేంద్రాలుగా మారిపోయాయి.

దేశంలో రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తిని నొక్కి చెబుతున్నప్పటికీ ప్రభుత్వంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు కేవలం పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయి. ఫెడరల్ స్ఫూర్తి లేకుండా చేస్తూ బలమైన అగ్రకులాల కోసం, మెజారిటీ మతస్థుల కోసం తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల కోసమే పరిపాలన కొనసాగుతున్నది. దీంతో దేశంలో అసమాన అభివృద్ధి పెరిగిపోయింది. 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో నేటికీ అణచివేతకు గురైన కులాలు కాని, మతం కాని ఇంకా ఎక్కువ అణచివేతకు గురి అవుతున్నాయే తప్ప స్వేచ్ఛగా జీవించే అవకాశం లేకుండా పోయింది. అటువంటి అణచివేతలోంచే కుకీ, నాగ జాతి ప్రజల ఆకాంక్షలను మనం అర్థం చేసుకోవాలి. మెయితీలను ఎస్‌టిలో చేర్చనందుకు జరుగుతున్న దాడులుగా చెబుతున్నప్పటికీ మతం ఏమి చేసిందో కారణం లేదు. మహిళలు ఎందుకు వివస్త్రలుగా మార్చబడుతున్నారో, అత్యాచారానికి గురవుతున్నారో తెలియదు.

ఈ ఘటనల వెనక ఒక బలమైన రాజకీయ కారణం ఉండవచ్చని స్థానిక బిజెపి ఎంఎల్‌ఎ సమాజం దృష్టికి తీసుకువచ్చాడు. సిఎం బీరేంద్ర సింగ్ అయితే ఈ వివస్త్ర ఊరేగింపు, అత్యాచార ఘటనలు ఇంకెన్నో జరిగాయని తానే స్పష్టం చేస్తున్నాడు. మణిపూర్‌లో ఒక రాజ్యాంగం ఉండి పరిపాలన సాగుతున్నట్టా లేక బీరేంద్ర సింగ్ సాయుధ ముఠాతో పరిపాలన చేస్తున్నాడా? ఇప్పటికే 1980 నుంచి అమలవుతున్న ప్రత్యేక సైనికాధికారాల చట్టం 1958 అణచివేతలో ఇప్పటికే చాలా మంది హత్యగావించబడ్డారు. జులై 2000 సంవత్సరంలో సైన్యం బస్టాండులో నిల్చున్న 11 మందిని పట్టపగలే కాల్చి చంపేసింది. దానికి నిరసనగా 2000 సంవత్సరం నుండి ఇరోం షర్మిల అనే మహిళ 16 ఏళ్ళు నిరాహార దీక్ష చేసింది. కానీ ఆ చట్టాన్ని రద్దు చేయించలేకపోయింది. 2004లో తింగజం మనోరమ అనే యువతిపై సైన్యం అత్యాచారం చేసి హత్య చేస్తే అస్సాం రైఫిల్స్ హెడ్ క్వాటర్స్ ముందు 30 మంది మణిపూర్ మహిళలు వివస్త్రలుగా పెరేడ్ చేసి మాపై కూడా అత్యాచారం చేయండని చెప్పి నినాదాలు చేశారు.

ఒకవైపు ప్రత్యేక సైనికాధికారుల చట్టం నిర్బంధంలో మణిపూర్ జాతులు పదుల సంఖ్యలో హత్యలకు గురయ్యారు. వాటిపై న్యాయస్థానానికి వెళ్ళే హక్కు లేకుండా ఈ చట్టం పని చేస్తుంది. 50 ఏళ్ళుగా ఈ చట్టం పాలనలోనే మణిపూర్‌లోని 33 జాతుల ప్రజానీకం పరిపాలించబడుతుంది. కానీ ఆ చట్టం ఎటువంటి శాంతిని నేటికి సాధించ లేదు. చివరికి 2022లో 6 రాష్ట్రాలలోని 15 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చట్ట అమలును తొలగించింది. కానీ ఆ చట్టాన్ని పూర్తిగా తొలగించే శాంతియుత పరిస్థితులను అర్ధ శతాబ్దపు ప్రజాస్వామిక పరిపాలన సాధించలేకపోయింది. ఈ దమనకాండ నేపథ్యంలో మూడు రోజుల్లో మణిపూర్ నిండా సాయుధ సైనిక బలగాలను దింపి శాంతిని నెలకొల్పే శక్తి మన దేశ ప్రభుత్వాలకు ఉంది. కానీ 3 నెలలుగా సాగుతున్న మారణకాండలో ప్రభుత్వమే ఒకవైపు ఉన్నట్టుగా, మరొక వైపు దాడులకు గురవుతున్న కుకీ, నాగ జాతి ప్రజలు ఉన్నట్లుగా సమాజానికి అర్థమవుతుంది.

ఒకవైపు డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి చెందుతామంటూనే, మరొక వైపు అది డబుల్ ఇంజిన్ సర్కారు ప్రజల జీవితాన్ని పూర్తిగా విధ్వంసం చేసున్నది. దాడులు చేస్తున్న వారి వైపే ప్రభుత్వం నిలబడితే నేర నియంత్రణ ఎందుకు జరుగుతుంది. కేవలం ఒక జాతినే సాయుధం చేసి, మరొక జాతిని నిర్మూలించాలనే ప్రక్రియలో ప్రజల మాన, ప్రాణాలు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉండాలి, మానవత్వం ఉండాలి, ఈ రెండూ ప్రభుత్వానికి ఉండవలసిన కనీస లక్షణాలు. రాజ్యమే నేరస్థులైతే ప్రజల, న్యాయం మణిపూర్‌లో లాగా చర్చీల సిలువలకు ఉరి తీయబడతాయి. ఇది కేవలం అన్యాయానికి బలమున్నంత కాలమే పని చేస్తుంది. న్యాయం బలపడ్డ రోజు చరిత్రను తిరగరాస్తున్నదని చరిత్ర చెబుతున్న పాఠం.

మణిపూర్ కొండలపై కుకీ, నాగ జాతి వాళ్ళు జీవిస్తున్నారు. చాలా మటుకు మైదాన ప్రాంతాలన్నీ మెయితీ జాతీయులతో నిండిపోయాయి. మణిపూర్‌లో కుకీ, నాగ జాతి ప్రజలు రెండవ తరగతి ప్రజలుగా జీవిస్తున్నారు. అంతటి అణచివేతను ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ మెయితీ జాతీయుడైనందున కుకీ, నాగ జాతి ప్రజలు ఎక్కువగా క్రిస్టియన్లు అయినందున మతోన్మాద దాడులవలే ఈ దాడులను చూపిస్తున్నారు. మెజారిటీ మతంగా మెయితీల హిందూ మతంగా కొనసాగుతున్నాయి. పాఠశాలల్లో కూడా మెయితీ భాషను అధికార భాషగా చూపిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మూడవ ప్రపంచ దేశాలు అంటే మనలాంటి దేశాల్లో ఉన్నటువంటి వనరులను సామ్రాజ్యవాదులు దోపిడీ చేయడం కోసం జాతుల మధ్య మారణకాండను సృష్ట్టిస్తున్నారు. మొదట్లో ప్రారంభమైన జాతి వైరుధ్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించకుండా నిరంతరం దాడులు చేస్తూ మణిపూర్‌ని మంటల్లో కాల్చేస్తున్నారు. దీనితో కుకీ, నాగ జాతీయులను స్థానికులు కాదనే ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. బయటి నుంచి వచ్చిన వాళ్ళని ప్రచారం చేస్తూ వాళ్ళపై స్థానిక ప్రభుత్వ మద్దతుతోనే అమానుషమైన దాడులకు తెగబడుతున్నారు. ఇది సామ్రాజ్యవాదుల, అంబానీ, అదానీల వనరుల దోపిడీ కుట్రలో భాగంగానే మణిపూర్ ఘటనలో మనం చూడాలి.

వనరులు ఉన్న దగ్గర సామ్రాజ్యవాదుల దోపిడీ ఉంటుంది. ఆ దోపిడీని ఎదిరిస్తూ ప్రజా ఉద్యమాల ప్రతిఘటన ఉంటుంది. న్యాయం కోసం దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఎప్పుడైనా ప్రజాస్వామిక ఉద్యమాలతోనే పోరాడతారు. కానీ ప్రభుత్వాలు శాంతియుత ఉద్యమాలను సైనిక బలగాలతో అణచివేస్తాయి. అంతిమంగా ప్రజలు కూడా సాయుధ పోరాటం వైపు నెట్టబడతారు. మణిపూర్‌లో ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న 18 సంస్థలతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడి బలంగా పని చేస్తున్నది. దాన్ని కారణంగా చూపుతూ ప్రత్యేక సైనికాధికారాల చట్టం 1958 ను అమలు చేస్తూ, ఆందోళన జరిగిన ప్రాంతాలలో కల్లోలిత ప్రాంతాలుగా పరిగణిస్తూ ఆందోళనలను ప్రజాస్వామ్యబద్ధంగా నియంత్రించకుండా కాల్చి చంపే అధికారాన్ని సైన్యం కలిగి ఉంది. ఈ నెపం అక్కడ ప్రజలకు కనీస ప్రాథమిక హక్కులు లేకుండాపోయాయి. ఆ నేపథ్యంలోంచే నేడు జరుగుతున్న అప్రజాస్వామిక అమానుష దాడులుగా చూడవచ్చు.

ఎన్. నారాయణ రావు
(పౌరహక్కుల సంఘం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News