న్యూఢిల్లీ : ఆదివారం నుంచి మధ్యప్రదేశ్, బీహార్, అస్సాంల్లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నప్పటికీ, పొరుగున ఉన్న మణిపూర్‌కు వెళ్లకపోవడం ఆ రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ కలిగిస్తోందని, మోడీ కోసం అక్కడి ప్రజలు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మోడీ సోమవారం అస్సాం చేరుకుని 9000 మంది నృత్య కళాకారులు, డ్రమ్మర్లు నిర్వహించిన అద్భుత జానపద నృత్య సమ్మేళనాన్ని సందర్శించారు. సంప్రదాయ డ్రమ్ము ‘ధోంసా’ను కూడా వాయించారు. ఇంతేకాకుండా గువాహటిలో అస్సాం 2.0 పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సదస్సును మోడీ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జి కమ్యూనికేషన్స్ జైరామ్ రమేశ్ ప్రధాని మోడీ పర్యటనను ఆక్షేపించారు. గత 21 నెలలుగా తీవ్రమైన బాధ, ఆవేదనతో ఉన్న మణిపూర్ ప్రజలను ప్రధాని మోడీ ఎప్పుడు సందర్శిస్తారు ? అని ప్రశ్నించారు. గత మూడేళ్లుగా ప్రధాని మోడీ వస్తారని , తమతో మాట్లాడతారని మణిపూర్ ప్రజలు నిరీక్షిస్తున్నారని ఎక్స్ పోస్టు ద్వారా పేర్కొన్నారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడం బీజేపీ ప్రభుత్వాల వైఫల్యంగా కాంగ్రెస్ ఈ నెల మొదట్లో ఆక్షేపించిన సంగతి తెలిసిందే.