17 నెలలుగా జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ శిసోడియాకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా దిగువ న్యాయస్థానాలను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలిస్తూ, విచారణ లేకుండా సుదీర్ఘ కాలం ఆయనను జైలులో నిర్బంధించడం వేగవంతమైన విచారణకు ఆయనకు గల హక్కును తోసిపుచ్చడమే అని వ్యాఖ్యానించింది. ‘బెయిల్ రూల్, జైలు మినహాయింపు’ అనే సూత్రాన్ని విచారణ న్యాయస్థానాలు, హైకోర్టులు గుర్తించవలసిన తరుణంఇదే అని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం పరుష పదజాలంతో తీర్పులో స్పష్టంచేసింది. శిసోడియాను ‘సమాజంలో లోతైన మూలాలు ఉన్న’ వ్యక్తిగా బెంచ్ అభివర్ణిస్తూ, ‘తరచు పరిగణిస్తున్నట్లుగా ఒక నేరానికి దోషిగా ప్రకటించడానికి ముందు సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం విచారణ లేకుండా శిక్షగా మారడానికి అనుమతించరాదు’ అని అన్నది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి శిసోడియాను సిబిఐ, ఇడి ఢిల్లీ ఎక్పైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టు చేశాయి. రెండు కేసుల్లో శిసోడియాకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రూ. 10 లక్షల బెయిల్ బాండ్, అంతే మొత్తానికి రెండు ష్యూరిటీలను సమర్పించిన తరువాత జైలులో నుంచి విడుదల కావచ్చు. శిసోడియా బెయిల్‌కు నిబంధనలను న్యాయమూర్తులు వివరిస్తూ, ఆయన తన పాస్‌పోర్ట్‌ను ప్రత్యేక విచారణ కోర్టుకు అందజేయవలసి ఉంటుందని, సాక్షులను ప్రభావితం చేయడానికి గాని, సాక్షాన్ని తారుమారు చేయడానికి గాని ఎటువంటి ప్రయత్నమూ చేయరాదని స్పష్టం చేసింది. ‘సుమారు 17 నెలల మేరకు సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉండడాన్ని, విచారణ ఇంకా ఆరంభం కాకపోవడాన్ని బట్టి ఫిర్యాదీ(శిసోడియా) శీఘ్ర విచారణకు తనకు గల హక్కును కోల్పోయారని మేము భావిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది.
‘ఈ కోర్టు భావించినట్లుగా శీఘ్ర విచారణకు హక్కు, స్వేచ్ఛకు హక్కు పరమపవిత్రమైన హక్కులు. ఈ హక్కులను తోసిరాజనడంపై విచారణ కోర్టు, హైకోర్టు ఈ అంశానికి తగు ప్రాధాన్యం ఇచ్చిం ఉండవలసింది’ అని బెంచ్ పేర్కొన్నది. బెంచ్ పూర్వపు తీర్పుల గురించి ప్రస్తావిస్తూ, ఒక శిక్షగా బెయిల్‌ను నిలుపుదల చేయరాదన్న పక్కా సూత్రాన్ని కాలక్రమేణా విచారణ కోర్టులు, హైకోర్టులు విస్మరించాయని కోర్టు అభిప్రాయపడిందని తెలియజేసింది. ‘బెయిల్ మంజూరు వ్యవహారాల్లో విచారణ కోర్టులు, హైకోర్టులు పరమ జాగ్రత్త వహిస్తున్నట్లుగా ఉందని మా అనుభవాన్ని బట్టి మేము చెప్పగలం. బెయిల్ రూల్ అని, నిరాకరణ మినహాయింపు అన్న సూత్రాన్ని ఒక్కొక్కసారి అందుకు విరుద్ధంగా పాటిస్తున్నారు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. సూటిగా ఉండే కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేయకపోవడం వల్ల సర్వోన్నత న్యాయస్థానానికి కుప్పలు తెప్పలుగా బెయిల్ పిటిషన్లు వస్తున్నాయని, భారీగా కేసులు పెండింగ్‌లో ఉండడానికి ఇది దోహదం చేస్తున్నదని బెంచ్ తెలిపింది.
విచారణ వేగంగా పూర్తి అవుతుందనే ఆశతో అపరిమిత కాలానికి శిసోడియాను జైలులోనే ఉంచడం రాజ్యాంగం 21వ అధికరణం కింద స్వేచ్ఛకు ఆయనకు గల ప్రాథమిక హక్కును నిరాకరించడమే అవుతుందని న్యాయమూర్తులు అన్నారు. ‘ప్రస్తుత కేసులో ఫిర్యాదీ (శిసోడియా)కు సమాజంలో లోతైన మూలాలు ఉన్నాయి. ఆయన దేశం నుంచి పారిపోవడానికి గాని, విచారణ ఎదుర్కొనడానికి అందుబాటులో లేకుండా ఉండడానికి గాని అవకాశం లేదు. ఏమైనా ప్రభుత్వ ఆందోళనను పరిహరించేందుకు షరతులు విధించవచ్చు’ అని బెంచ్ పేర్కొన్నది. ఆ రెండు కేసుల్లో బెయిల్ కోసం శిసోడియా దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు మే 21న వెలువరించిన తీర్పును బెంచ్ కొట్టివేసింది.