Wednesday, January 22, 2025

సిసోడియాపై పోలీస్‌ల దురుసు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పట్ల పోలీస్‌లు వ్యవహరించిన తీరుపై ఆప్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. మనీష్ సిసోడియా మెడపై ఓ పోలీస్ అధికారి చేయివేసి లాక్కునిపోవడంపై వారు మండి పడుతున్నారు. అయితే ఢిల్లీ పోలీస్‌లు ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. ఇదంతా దుష్ప్రచారంగా పేర్కొన్నారు. ఎక్సైజ్ స్కామ్‌లో మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి సిసోడియాను మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. జూన్ 1వరకు కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఆ తరువాత సిసోడియాను జైలుకు తరలిస్తున్నప్పుడు పోలీస్‌లు దురుసుగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ నాయకుడు అతీషి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీస్‌లను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఈ విధంగా సిసోడియా పట్ల ప్రవర్తించే హక్కు పోలీస్‌లకు ఉందా ?ఈ విధంగా ప్రవర్తించాలని పైవాళ్లు ఆదేశించారా ? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ పోలీస్‌లు ఈ ఆరోపణలు కేవలం దుష్ప్రచారానికే అని కొట్టి పారేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు మీడియాకు ప్రకటనలు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని ఢిల్లీ పోలీస్‌లు వివరించారు. వీడియోలో కనిపించిన పోలీస్ చర్య భద్రత దృష్టా సహజమేనని పేర్కొన్నారు. అంతకు ముందు కోర్టు ఆవరణలో సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ ప్రదాని నరేంద్రమోడీపై ధ్వజమెత్తారు. పోలీస్‌లు తమ బాస్ మెప్పుకోసం సిసోడియాపై అలా దురుసుగా ప్రవర్తించారని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ సంఘటనను కోర్టు తన పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు. ఈ నియంతృత్వాన్ని యావత్ దేశం గమనిస్తోందన్నారు.

ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇలాంటి దురుసుతన ప్రవర్తనను దేశం మర్చిపోదన్నారు. జైలులో సిసోడియా పట్ల అధికారులు అనుచితంగా నిత్యం ప్రవర్తిస్తుంటారని తమకు అనుమానాలు ఉన్నాయని, కానీ దురదృష్ట వశాత్తు దీన్ని నిరూపించడానికి తమ దగ్గర ఎలాంటి సాక్షాలు లేవన్నారు. నిందితులు మీడియాతో మాట్లాడకూడదన్న పోలీస్‌ల ప్రకటనకు స్పందిస్తూ పోలీస్ కస్టడీలో ఉన్న కాన్ మేన్ సుఖేష్ చంద్రశేఖర్‌ను మీడియాతో అనుసంధానం కాడానికి ఢిల్లీ పోలీస్‌లు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతుండగా తీసిన వీడియోను ఈ సందర్భంగా చూపించారు.

సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ జూన్ 1 వరకు పొడిగింపు
ఎక్సైజ్ స్కామ్‌తో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ జూన్ 1 వరకు కోర్టు పొడిగించింది. ఈ సందర్భంగా జైలులో సిసోడియాకు పుస్తకాలతోపాటు కుర్చీ. టేబుల్ సౌకర్యం కల్పించాలని పోలీస్‌లకు న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు గది నుంచి బయటకు వచ్చిన తరువాత సిసోడియా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంపై ప్రధాని నరేంద్రమోడీకి నమ్మకం లేదని ధ్వజమెత్తారు. మోడీ చాలా దురహంకారిగా మారారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News