న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పై సిబిఐ ఆదివారం లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లి పోడానికి వీల్లేకుండా పోయింది. ఆయనతోపాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో 12 మందిపైనా లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మందిలో ముగ్గురిని శనివారం సీబిఐ అధికారులు ప్రశ్నించారు. కేసు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ తర్వాత లుక్‌ఔట్ నోటీసులు జారీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. లుక్‌ఔట్ నోటీసులపై సిసోడియా ట్విటర్ వేదికగా స్పందించారు. సీబీఐ తనిఖీలన్నీ విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. తన ఇంట్లో ఒక్క పైసా కూడా లభించలేదని , ఇప్పుడు తాను కనిపించడం లేదంటూ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇవేం నాటకాలంటూ ప్రధాని నరేంద్రమోడీని ఘాటుగా ప్రశ్నించారు. తాను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నానని, తానెక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. శుక్రవారం సిసోడియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సిబిఐ సోదాలు నిర్వహించింది. సిసోడియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.