తొర్రూరు : తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం డివిజన్ కేంద్రంలోని అన్నారం రోడ్డులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంత్రి దయాకర్‌రావు నాయకులు, విగ్రహ కమిటీ ప్రతినిధులతో కలిసి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు జీవించారని చెప్పారు. జీవిత చరమాంకం వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీప్లోర్ లీడర్, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఈజీఎస్ రాష్ట్ర కమిషన్ సభ్యులు లింగాల వేంకటనారాయణగౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ కమిటీ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.