Monday, December 23, 2024

మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Manmohan singh comments on Narendra modi

 

న్యూఢిల్లీ : అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు. ప్రతిసమస్యకు భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను నిందించడమేమిటని నిలదీశారు. కాంగ్రెస్ ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించలేదన్నారు. సత్యాన్ని మరుగుపరచలేరన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన వీడియో సందేశంలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రజలు ఓవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలను ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఏడున్నరేళ్లు నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించి , సరిదిద్దుకోడానికి బదులుగా, ప్రజాసమస్యల విషయంలో తొలి ప్రధానమంత్రి నెహ్రూను నిందిస్తోందన్నారు. తాను ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో తన పనిద్వారా మాట్లాడానని, ప్రపంచం ముందు పరువు పోయేలా చేయలేదన్నారు.

తానెప్పుడూ భారత దేశ ఔన్నత్యానికి విఘాతం కలిగించలేదని చెప్పారు. బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వానికి ఆర్థిక విధానంపై అవగాహన లేదని దుయ్యబట్టారు. ఇది దేశానికే పరిమితమైన సమస్య కాదన్నారు. విదేశాంగ విధానంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని, చైనా మన సరిహద్దుల్లో తిష్ఠ వేసుకుని కూర్చుందని చెప్పారు. నేతలను బలవంతంగా కౌగిలించుకోవడం, ఊయల ఊగడం, బిర్యానీలు తినిపించడం ద్వారా విదేశాంగ విధానం నిర్వహించడం సాధ్యం కాదని పీఎం మోడీ అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వానిది బూటకపు జాతీయవాదమని, విభజన విధానమని దుయ్యబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజలను విడగొడుతున్నారని, పోట్లాడుకునేలా చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News