Wednesday, January 22, 2025

మీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా?

- Advertisement -
- Advertisement -
Manmohan Singh has lashed out at Modi government
బిజెపి సర్కార్ వచ్చి ఏడేళ్లయినా… ప్రతి దానికీ తొలి ప్రధానిదే తప్పా
మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుపించారు. దేశంలో ప్రతి తప్పుకూ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ ప్రధాని మోడీపై ఆరోపణలు గుప్పించారు. ప్రధాని పదవికి ప్రత్యేక గౌరవం ఉందన్న మన్మోహన్ సింగ్… రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించడం, వాస్తవాలను దాచలేదంటూ మోడీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఈ నెల 20న పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో మాజీ ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. పంజాబీ భాషలో ఉన్న ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశంలో వినిపించింది. విదేశాంగ విధానం విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

గత ఏడాది కాలంగా చైనా మన పవిత్ర భూములను ఆక్రమిస్తోందని, అయినా ప్రభుత్వం ఈ సమస్యను భూస్థాపితం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.అంతేకాకుండా మన పాత మిత్రులు మనకు దూరమవుతున్నారని, పొరుగు దేశాలతో మన సంబంధాలు దిగజారుతున్నాయని కూడా ఆయన అన్నారు. ‘ఆలింగనం చేసుకోవడం..వారితో బంతాట ఆడడం లేదా ఆహ్వానం లేకున్నా వెళ్లి బిర్యానీ తిని రావడం వల్లనో దేశాలతో మన సంబంధాలు మెరుగుపడవని ఇప్పటికయినా ప్రభుత్వం అర్థం చేసుకుని ఉంటుందని నేను ఆశిస్తున్నాను’అని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీనుద్దేశించి మాజీ ప్రధాని అన్నారు. ‘ ఓ వైపు దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. మరో వైపు రైతుల ఆందోళనలు, విదేశీ విధానం వంటి కీలక అంశాల్లోను ప్రభుత్వం సరైన విధానాలను అనుసరించడం లేదు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లకు పైగా అవుతోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఒప్పుకోవడం, వాటిని సరిదిద్దుకోవడం కంటే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇంకా తొలి ప్రధాని నెహ్రూనే కారణమని నిందిస్తున్నారు’ అంటూ మన్మోహన్ సింగ్ మండిపడ్డారు.

‘ఇక కొన్ని రోజలు క్రితం పంజాబ్‌లో పర్యటించిన ప్రధానమంత్రి కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం పేరుతో ముఖ్యమంత్రి చన్నీతో పాటుగా రాష్ట్ర ప్రజలను అపఖ్యాతి చేసే ప్రయత్నం జరిగింది. అంతకు ముందు రైతుల ఆందోళనల సమయంలోను పంజాబ్ ప్రభుత్వం, పంజాబీలను కించపరిచే యత్నం జరిగింది. దేశభక్తి, ధైర్యసాహసాలు, పంజాబీల త్యాగాలను యావత్ ప్రపంచం కొనియాడుతుంది. కానీ ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం వీటిలో ఏ ఒక్క అంశాన్నీ ప్రస్తావించదు’ అంటూ మోడీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. బిజెపి ప్రభుత్వ జాతీయ వాదం బ్రిటీష్ వారి విభజించి పాలించు విధానంపై ఆధారపడి ఉందని విమర్శించారు. రాజ్యాంగం పట్ల ప్రభుత్వానికి నమ్మకం లేదని, రాజ్యాంగ వ్యవస్థలు బలహీనమవుతున్నాయని ఆయన అన్నారు. పంజాబ్‌లో నివసిస్తున్న నిజమైన భారతీయుడిగా ఈ విషయాలు తనను బాధించాయని మన్మోహన్ పేర్కొన్నారు. అంతేకాదు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బిజెపి, ఆ పార్టీకి సంబంధించిన బి, సి టీమ్‌ల గురించి వాస్తవాలు బహిర్గతమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News