Wednesday, January 22, 2025

అరుదైన విలక్షణ నేత

- Advertisement -
- Advertisement -

ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్ధత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి దేశాభివృద్ధి దిశనే మార్చివేసిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోగల అరుదైన విలక్షణ నేత డా. మన్మోహన్ సింగ్. రాజ్యసభ సభ్యునిగా 33 సంవత్సరాల అనుబంధం గత వారమే ముగించుకున్న ఆయన ఎదగడం ఒక విచిత్రమే అని చెప్పాలి. ‘మౌనముని’గా, ఆయన ప్రభుత్వంలో అసలైన అధికార కేంద్రం సోనియా గాంధీ అని విధంగా మీడియా దృష్టిలో అవహేళనకు గురైన ఆయన ‘నా పట్ల మీడియా కన్నా చరిత్ర ఎంతో కనికరం చూపింది’ అంటూ తన గురించి ఎక్కువగా అపోహలు ప్రచారంలో ఉన్నాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘ప్రధాన మంత్రిగా నేను సిగ్గుపడే పని ఏదీ చేయలేదు’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో గత ఏడాది ఓ ప్రముఖ పాత్రికేయురాలు నీరజ చౌదరితో చెప్పగలడం దృఢమైన ఆయన వైఖరికి నిదర్శనం అని చెప్పవచ్చు.

మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్‌లో బాగా వెనుకబడిన ‘గా’ అనే ఊరిలో జన్మించారు. ఉర్దూ పాఠశాలలో చదివేందుకు మైళ్ళ దూరం నడిచి వెళ్లేవారు. చదువుకునేందుకు విద్యుత్ లేక చమురు దీపాలతోనే చదువుకున్నారు. పేద విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలతో చదువుకున్నారు. అయితే, మన దేశంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వారిలో ఆయనకున్నంత పరిపాలననుభవం మరెవ్వరికీ లేదని చెప్పాలి. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారునిగా, రిజర్వు బ్యాంకు బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక కార్యదర్శిగా, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షునిగా, యుజిసి చైర్మన్‌గా… ఈ విధమైన అనుభవం గల రాజకీయనేతలు ఎవ్వరూ లేరు. పైగా, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలలో కూడా పని చేశారు. నిటారుగా నిలబడి కూలిపోయే చెట్టులా కాకుండా తుఫాను వచ్చినప్పుడు వంగిపోయే గడ్డితో ఆయనను పోల్చవచ్చు.

ఆయన ప్రధానిగా పదేళ్ల పాటు నిలదొక్కుకోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ప్రధానిగా ఒకవైపు సోనియా గాంధీకి తగు మర్యాద ఇస్తుండటమే కాకుండా, ఇప్పటి వరకు తాను ‘సర్’ అని పిలుస్తున్న ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్ నేత మంత్రివర్గంలో కీలకంగా ఉండటం ఆయనకు ఇబ్బందికర అంశమే. అయితే, అలా పిలవద్దని స్వయంగా ప్రణబ్ కోరడంతో విరమించుకున్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారా అప్పులు పుట్టక, రోజులు గడవడం కూడా కష్టంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల చెంతన నిలబెట్టే విధంగా చేయడానికి ఆయనను ప్రధాన కారకుడిగా చరిత్ర చెబుతుంది. ఈ ప్రయాణం లో పివి నరసింహారావు సైతం ఆయనకు కొండంత అండగా ఉంటూ కీలక భూమిక వహించారు. అయితే విచిత్రం ఏమిటంటే వీరిద్దరూ పదవులలోకి రాకముందు ఎప్పుడూ ఆర్థిక సంస్కరణల పట్ల విశ్వాసం ప్రకటించ లేదు. వాస్తవానికి రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే అటువంటి ఆలోచనలు చేశారు. అయితే అప్పటికే ఎన్నికలు సమీపించడంతో అమలు వాయిదా వేశారు. రాజీవ్ గాంధీ హత్యకారణంగా అనుకోకుండా ప్రధాని పదవి చేపట్టిన పివికి దివాళా స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చుకోవడం పెద్ద సవాల్‌గా మారింది.

అందుకు ఓ ఆర్ధిక నిపుణుడిని మంత్రిగా తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ముందు రోజు సాయంత్రం యుజిసి చైర్మన్‌గా ఉన్న మన్మోహన్ సింగ్ పేరును ఆయనకు సూచించారు. వెంటనే ఫోన్ చేసి మంత్రిగా ఆహ్వానించారు. ఈ లోగానే ఆర్థిక రంగంలో తేవలసిన మార్పులు గురించి ఓ జాబితా సిద్ధం చేసుకున్నారు.ఆర్ధిక సంస్కరణలకు కాంగ్రెస్ మంత్రుల నుండే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దానితో ఒకటి రెండు సార్లు మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధపడ్డారు. అప్పుడు పివి పిలిచి ‘నన్ను తిట్టలేక నిన్ను తిడుతున్నారు. మన పని మనం చేసుకుపోదాం’ అంటూ నచ్చచెప్పారు. ప్రధాన మంత్రి పదవి కూడా అనూహ్యంగా లభించింది. ‘ప్రమాదవశాత్తు ప్రధాని’ అంటూ ఆయనవద్ద మీడియా సలహాదారునిగా పని చేసిన వ్యక్తే అవహేళన చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోనియాగాంధీని తమ నాయకురాలిగా, అంటే ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు.

అయితే అందుకు సాంకేతిక అంశాలు అడ్డురావచ్చనే ప్రచారం జరగడంతో, ఆమె మన్మోహన్‌ను ఆ పదవికి ఎంచుకొని అందరినీ ఆశ్చర్య పరచారు. ప్రధాని అంటేనే రాజకీయ నేత అని అర్ధం. కానీ ఇక్కడ ప్రభుత్వరాజకీయ వ్యవహారాలు సోనియా చూసుకొనే విధంగా, పాలనా వ్యవహారాలు మన్మోహన్ చూసుకొనే విధంగా ఓ అనధికార అవగాహనకు వచ్చారు. అప్పచెప్పిన పనిని నిబద్ధ్దతతో చేస్తుడే ఆయన ధోరణి నచ్చే సోనియా ఆయనను ప్రధాని పదవికి ఎంపిక చేసారని చెప్పవచ్చు. 1998లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన సోనియా గాంధీ ఆయన నిబద్ధత పట్ల ఆకర్షితులై రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయనను నియమించారు.

ముఖ్యంగా సెప్టెంబర్ 2023లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ మీడియా సమావేశంలోకి చొరబడి చించివేయడం ప్రధానిగా ఆయనకు అత్యంత అవమానకరమైన క్షణాలని చెప్పవచ్చు. అందుకనే ఆయనను ‘బలహీనుడైన’ ప్రధానిగా ఇప్పటికీ చాలా మంది అభివర్ణిస్తున్నారు. అయితే అవసరమైనప్పుడు ఆయన తన రాజకీయ విజ్ఞతను, దృఢమైన పట్టుదలను ప్రదర్శించడం, రాజీనామాకు సైతం వెనుకాడకపోవడం మరచిపోలేము. ఈ సందర్భంగా భారత్ అమెరికా అణు ఒప్పందం సందర్భంగా ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ ఒప్పందంపై యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు వ్యతిరేకత తెలపడంతో సోనియా గాంధీ కూడా మొదట్లో వ్యతిరేకించారు. ప్రభుత్వం పడిపోతుందని ఆమె భయపడ్డారు.

ఈ విషయమై వామపక్షాలతో బిజెపి కూడా చేతులు కలిపింది. అయితే, ఈ ఒప్పందం కాదంటే ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని మన్మోహన్ చెప్పడంతో సోనియాకు ఒప్పుకొనక తప్పలేదు. అదే సమయంలో వామపక్షాలకు వ్యతిరేకంగా సమాజవాది పార్టీ నేతలను సంప్రదించి, వారి మద్దతును కూడదీసుకోవడంలో మన్మోహన్ చాణక్య నీతి ప్రదర్శించారు. దానితో సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఎవ్వరీ డాక్టర్ కాంగ్రెస్ మిత్రపక్షాలను ఎంచుకొనే పని కూడా తన భుజాలపై వేసుకుంటున్నాడు’ అంటూ ఓ విధమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ అణు ఒప్పందంతోనే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాదులు ఏర్పడటం, అంతరిక్ష రంగంలో కూడా నేడు మనం అమెరికాతో భాగస్వామిగా ఉండటం సాధ్యమైనదని గ్రహించాలి. అందుకు నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌తో మన్మోహన్ ఏర్పర్చుకున్న వ్యక్తిగత సంబంధం కూడా ఎంతో తోడ్పడింది.

ఈ ఒప్పందం పట్ల మన దేశంలోనే కాకుండా అమెరికాలో సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. భారత్‌కు ఆ విధమైన గౌరవం ఇవ్వడాన్ని ప్రభుత్వంలో అనేక మంది వ్యతిరేకించారు. అందుకు బుష్ ఒకే మాట చెప్పారు. ‘మన్మోహన్ చాలా మంచివారు. ఆయన ఏది కావాలంటే మనం అది చేద్దాం’ అని స్పష్టం చేశారు. మన్మోహన్ కాకుండా మరెవ్వరు ప్రధానిగా ఉన్నా ఈ ఒప్పందం సాధ్యమయ్యేది కాదు. ఆర్థిక సంస్కరణల తర్వాత మన్మోహన్ సాధించిన మరో ఘనతగా దీనిని చెప్పవచ్చు. ఓ మేధావిగా, నిబద్ధత కలిగిన నేతగా ఆయన అంతర్జాతీయంగా కీర్తి పొందారు. కేవలం ఆయన వ్యక్తిత్వం కారణంగా అమెరికాతో అణు ఒప్పందం చేసుకో గలిగారు. తనపై వచ్చిన విమర్శల పట్ల స్పందించడం గాని, తాను సాధించిన విజయాల గురించి చెప్పుకోవడం గురించి గాని ఎప్పుడూ చేయరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓ ప్రధాన మంత్రి తన పనితీరు కారణంగా ఎన్నికల్లో తన పార్టీకి విజయం చేకూర్చడం 2009లో మాత్రమే సాధ్యమైందని గమనించాలి.

అయితే ఆయన ఏనాడూ ఆ విజయాన్ని తన ఘనతగా చెప్పుకోలేదు. చివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు. ఆయన ఏనాడూ పేరు ప్రతిష్ఠలకు పాకులాడలేదు. తన ప్రభుత్వం విధానాలపై ప్రచారం కోసం ఆరాటపడలేదు. అవమానాలను, అభినందనలను ఒకే విధంగా స్వీకరించగల మహోన్నతమైన వ్యక్తిత్వం ప్రదర్శించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా పారిశ్రామిక రంగం పెరిగేందుకు దోహదపడినా ఏనాడూ వారిని తన ఇంటివరకు రానీయలేదు. రెండోసారి ప్రధానిగా ఆయన ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ఆ మచ్చలు ఆయనను తాకలేదు. అంతేకాకుకండా, చరిత్ర సృష్టించిన కొన్ని చట్టాలు ఆయన ప్రభుత్వం తీసుకు రాగలిగింది. భారత ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఎంతగానో దోహదపడిన సమాచార హక్కు చట్టం ఆయన హయాంలోనే కార్యరూపం దాల్చింది. ఈ చట్టం కారణంగానే 75 ఏళ్లుగా ఏనాడూ పార్లమెంట్ ముందుకు రాని అనేక కీలక ఆంశాలు నేడు ప్రజల ముందుకు వస్తున్నాయి. అట్టడుగున ఉండే గిరిజన ప్రజల సాధికారికతకు ఎంతగానో తోడ్పడిన అటవీ హక్కుల చట్టం కూడా ఆయన ప్రభుత్వమే తీసుకొచ్చింది. రాజ్యసభలో మన్మోహన్‌కు వీడ్కోలు పలుకుతూ ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News