Saturday, December 28, 2024

గుండె శస్త్రచికిత్స తరువాత మన్మోహన్ తొలి పలుకు ఇదే

- Advertisement -
- Advertisement -

దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కర్త, వరుసగా రెండు పర్యాయాలు దేశానికి ప్రధానిగా సేవలు అందజేసిన కాంగ్రెస్ కురువృద్ధుడు మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్ను మూసిన విషయం విదితమే. దేశం పట్ల ఆయన ఎంత నిబద్ధత, చిత్తశుద్ధితో వ్యవహరించారో తెలియజేసే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మన్మోహన్ సింగ్ గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత ఆయన మాట్లాడిన తొలి మాట ఏమిటో ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా వెల్లడించారు. 2009లో ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని, దాదాపు 11 గంటల సుదీర్ఘ సమయం కరోనరీ బైపాస్ సర్జరీ జరిగిందని రమాకాంత్ పాండా చెప్పారు. శస్త్రచికిత్స ముగిసిన తరువాత రాత్రి సమయంలో మొదటి ‘బ్రీత్ పైప్’ను తొలగించామని, దీనితో తొలి మాటగా ‘దేశం ఎలా ఉంది?’ అని మన్మోహన్ అడిగారని ఆయన తెలిపారు. ఆ వెంటనే ‘కాశ్మీర్ ఎలా ఉంది’ అని అడిగారని డాక్టర్ పాండా వెల్లడించారు.

మొదటి మాట ఆరోగ్యం గురించా కాకుండా దేశం గురించి కావడం ఆశ్చర్య కలిగించిందని ఆయన తెలిపారు. శస్త్రచికిత్స గురించి అడగలేదేమిటని తాను ప్రశ్నించగా, ‘మీరు మంచిగా పని చేస్తారని నాకు తెలుసు. నేను శస్త్రచికిత్స గురించి ఆందోళన చెందడం లేదు. నా దేశం గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నాను’ అని మన్మోహన్ సింగ్ సమాధానం ఇచ్చారని డాక్టర్ గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని గొప్ప మానవతావాది అని, వినమ్రమైన వ్యక్తి అని, గొప్ప దేశభక్తుడు అని డాక్టర్ పాండా కొనియాడారు. ఒక వైద్యుడి కోణంలో నుంచి చూస్తే ఆదర్శవంతమైన పేషెంట్ అని తాను చెబుతానని ఆయన తెలిపారు. ఇటువంటి శస్త్రచికిత్సల అనంతరం రోగులు సాధారణంగా చాతీ నొప్పి గురించి ఫిర్యాదులు చేస్తుంటారని, కానీ మన్మోహన్ సింగ్ దేని గురించీ అడగలేదని డాక్టర్ చెప్పారు. ఆయన ఎటువంటి ఫిర్యాదులూ చేయలేదని డాక్టర్ తెలిపారు. ఒక బలమైన మనిషికి అదే సంకేతమని డాక్టర్ పాండా అభివర్ణించారు.

మన్మోహన్ సింగ్ ఆసుపత్రికి వచ్చిన ప్రతిసారి స్వాగతం పలికేందుకు తాము గేటు వద్దకు వెళ్లేవారమని, కానీ అలా చేయకూడదని తమకు సూచిస్తుండేవారని డాక్టర్ తెలిపారు. ఏదైనా చేస్తానని చెబితే ఆయన తప్పకుండా చేస్తారని, మనసు మార్చుకోరని డాక్టర్ పాండా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News