Wednesday, January 22, 2025

పధాని పదవి పరువు తీసేలా విష విద్వేష ప్రసంగాలు:మన్మోహన్ సింగ్

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ ప్రధాని పదవి పరువు తీశారని, బహిరంగ ప్రసంగాల మర్యాదలను మట్టి కలిపారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ ప్రధాని ఈ స్థాయిలో దిగజారి మాట్లాడటం, వ్యవహరించడం తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. విపక్షాలపై విరుచుకుపడటం, ఓ వర్గాన్ని కించపరిచే విధంగా మతపరమైన విద్వేషకర ప్రసంగాలకు ఆయన దిగాడని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ఏడవ , చివరి విడత పోలింగ్ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ సీనియర్‌నేత పంజాబ్ ఓటర్లకు తమ సందేశం వెలువరించారు. తన స్థిరమౌన వైఖరికి భిన్నంగా ఈసారి ఆయన ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి ఓ స్థాయి ఉంటుంది. ప్రజలలో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సి ఉంటుంది, అయితే ఎన్నికల సభలలో ఆయన విద్వేషకర ప్రసంగాలకు తెరతీశారు. చివరకు విద్వేష ప్రసంగాలే ఆనవాయితీగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రధాని మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.

ఈ ఎన్నికల ప్రచార తంతును తాను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నానని ,వేదికల పై నుంచి నేతలు ఏ విధంగా మాట్లాడుతున్నారనేది గమనిస్తున్నానని , ఈ దశలో విద్వేషకర మాటలే ప్రధాని ప్రసంగాల సారాంశం అయిందన్నారు. విద్వేషకర ప్రసంగాలు స్థాయి మీరి చివరికి విషపూరితం, సంకుచితం, విభజన స్థాయికి దిగజారాయని తెలిపారు. అత్యున్నత పదవుల్లోని వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విదంగా ప్రజా వేదికల మీది నుంచే విభజన పాదులకు దిగుతారా? అని ప్రశ్నించారు. తానైతే తన రాజకీయ అనుభవంలో ఇటువంటి నేతను చూడలేదన్నారు. ఆయన కేవలం సమాజంలోని ఓ వర్గాన్ని లక్షంగా చేసుకుని మాట్లాడటం, లేదా విపక్షాలను తిట్టిపోయడం తన పనిగా పెట్టుకున్నాడని తనకు విదితం అయిందన్నారు. ప్రధాని అయి ఉండి, బహిరంగ సభల స్థాయిని మరీ ఈ విధంగా బజారు కీడుస్తారా? అని ప్రశ్నించారు. తాను తన జీవితంలో ఎప్పుడూ మనుష్యులను వేర్వేరు వారిగా వర్గాలుగా చూడలేదని, అంతా సమానం అనుకున్నానని, వ్యవహరించానని తెలిపారు. అయితే ప్రధాని మోడీ పనిగట్టుకుని తనపై కూడా దుష్ప్రచారానికి దిగారని, తప్పులు ప్రచారం చేశారని విమర్శించారు.

తను చెప్పని మాటలను తాను చెప్పినట్లుగా ప్రచారం చేశారని, ఈ దేశ వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉందని తాను చెప్పినట్లు మోడీ ప్రచారం సాగించడం చిల్లరతనం అయిందన్నారు. ఈ విధంగా వ్యవహరించడం బిజెపికే సొంతమైన నైజం అయిందని , వారి కాపీ రైట్ అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తప్పులతడకల పథకాలు తీసుకువచ్చింది. చివరికి దేశ భద్రత విషయంలోనే ఈ దుర్నితి సాగింందని మండిపడ్డారు. దురుద్ధేశపూరిత అగ్నివీర్ నియామకాల ప్రక్రియను సైన్యంలో తీసుకురావడం సబబేనా అని ప్రశ్నించారు. బిజెపికి దేశ భక్తి , ధైర్యసాహసాలు వారి సేవలు కేవలం తాత్కాలికం , కేవలం నాలుగేళ్లు నిలిచే సంగతి అయిందని , సైన్యంలో సేవలను ఈ విధంగా సంవత్సరాలుగా లెక్కకట్టడం సబబా? అని మాజీ ప్రధాని నిలదీశారు.బిజెపిది కుహనా జాతీయవాదం. బూటకపు వాదం అని మన్మోహన్ తన నిరసనను ప్రజలకు తమ బహిరంగ లేఖలో వెలువరించారు. దేశ ప్రజలు అన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తూనే ఉంటారు.

వారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇందులో మోడీ అతీతుడేమీ కాడు. అమానుష రీతిలో వ్యవహరించే తీరు ఇప్పుడు పరాకాష్టకు చేరింది. ఈ దశలో దేశ ప్రజలు అంతా ఈ దేశానికి ఇటువంటి అరాచకవాదుల నుంచి రక్షించాల్సి ఉందని , మనను మనం మనతో పాటు ఈ దేశాన్ని కాపాడుకోవల్సి ఉందని పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News