న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగీ వ్యాధితో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్) వైద్యులు శనివారం తెలిపారు. 89 సంవత్సరాల మన్మోహన్ సింగ్ జ్వరం కారణంగా నీరసంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. ఆయకు డెంగీ సోకినట్లు నిర్ధారణ అయిందని, ఆయన ప్లేట్‌లెట్ కౌంట్ ప్రస్తుతం పెరుగుతోందని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు చెప్పారు. ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో సెంటర్‌కు చెందిన ప్రైవేట్ వార్డులో ఉన్న మన్మోహన్ సింగ్‌కు డాక్టర్ నితిష్ నాయక్ సారథ్యంలో కార్డియాలజిస్టుల బృందం చికిత్స అందచేస్తోంది.
ఇలా ఉండగా&కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువారం మన్మోహన్ సింగ్‌ను పరామర్శించేందుకు ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వివాదం రాజకుంది. ఆయన తన వెంట ఒక ఫోటోగ్రాఫర్‌ను తీసుకెళ్లడమే ఈ వివాదానికి కారణం. తమ కుటుంబ అభీష్టానికి విరుద్ధంగా మాండవీయ ఫోటోగ్రాఫర్‌ను తీసుకెళ్లారని మన్మోహన్ సింగ్ కుమార్తె దామన్ సింగ్ మండిపడ్డారు. మన్మోహన్ చికిత్స పొందుతున్న రూములోకి వచ్చిన ఫోటోగ్రాఫర్‌ను వెళ్లిపొమ్మని తన తల్లి చెప్పినా అతను పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఇది తన తల్లిని తీవ్రంగా బాధించిందని, వారు వృద్ధులని, జూలో జంతువులు కాదని దామన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manmohan Singh suffering from dengue: AIIMS