న్యూఢిల్లీ: కేరళలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడారు. కేరళలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరించాలని ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి కోరారు. మొత్తం దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో 49.85 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం పట్ల కేంద్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కేరళను సందర్శించి వచ్చిన ఎన్‌సిడిసి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం తన నివేదికను సమర్పించిందని, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల గురించి తాను కూడా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని మాండవీయ బుధవారం ట్వీట్ చేశారు. కేరళలో పరిస్థితిని కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు, ముందు జాగ్రత్తలపై తాను కూడా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశానని ఆయన తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరానని, అలాగే కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చానని ఆయన తెలిపారు.