Monday, January 20, 2025

ఎదురులేని మను బాకర్.. హ్యాట్రిక్ పతకానికి అడుగు దూరంలో..

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో భారత సంచలన షూటర్ మను బాకర్ మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే రెండు పతకాలు గెలిచి మను బాకర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగే ఫైనల్ పోరు పతకం సాధిస్తే ఒలింపిక్స్‌లో మను నయా చరిత్ర సృష్టిస్తోంది. ఇక శుక్రవారం జరిగిన 25 మీటర్ల క్వాలిఫికేషన్ పోటీల్లో మను అద్భుత ఆటను కనబరిచింది. ఆరంభం నుంచే పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగింది.

తొలుత జరిగిన ప్రిసిషన్ రౌండ్‌లో 294 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ర్యాపిడ్ రౌండ్‌లోనూ సత్తా చాటింది. ఈ రౌండ్‌లో ఏకంగా 100 పాయింట్లను సొంతం చేసుకుంది. క్వాలిఫికేసన్‌లో ఓవరాల్‌గా 590 పాయింట్లు సాధించిన మను బాకర్ రెండో స్థానంలో నిలిచింది. శనివారం జరిగే ఫైనల్లోనూ సత్తా చాటి తన ఖాతాలో మూడో పతకం జత చేసుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది.

కాగా, మను ఇప్పటికే మహిళల 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా 25 మీటర్ల విభాగంలోనూ ఫైనల్‌కు చేరడంతో మరో పతకం సాధించే అవకాశాలు మెరుగయ్యాయి. తుది పోరులో మెరుగ్గా రాణిస్తే మను ఖాతాలో హ్యాట్రిక్ పతకాలు చేరుతాయి. ఇదే జరిగితే భారత ఒలింపిక్స్ చరిత్రలోనే సరికొత్త ఆధ్యాయం ఆవిష్కృమతమవుతుంది. ఒకే ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా మను బాకర్ నయా చరిత్ర లిఖిస్తోంది.

ఇషా ఆశలు గల్లంతు..
మరోవైపు తెలంగాణకు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ క్వాలిఫికేషన్‌లో నిరాశ పరిచింది. ఈ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో పతకం సాధిస్తుందని భావించిన ఇషా అర్హత పోటీల్లో 18వ స్థానానికి పరిమితమైంది. ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన ఇషా 581 పాయింట్లు మాత్రమే సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో అభిమానులు ఇషాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొంతకాలంగా ప్రపంచ షూటింగ్‌లో ఇషా అసాధారణ ఆటతో అలరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఇషా మాత్రం పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇంతకుముందు తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News