Friday, November 15, 2024

మను బాకర్‌కు తృటిలో చేజారిన పతకం

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో మూడో పతకం సాధించాలనే షూటర్ మను బాకర్ తృటిలో చేజారింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో మను బాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకం సాధించాలనే మను బాకర్ కల చెదిరి పోయింది.

ఈ గేమ్స్‌లో మను ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌తో పాటు మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాలు సాధించింది. ఇక 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కూడా ఫైనల్‌కు చేరడంతో మను పతకం ఆశలు చిగురించాయి. కానీ ఫైనల్‌లో మను చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్టేజ్ వన్‌లో మను కాస్త నెమ్మదిగా ఆడింది. సిరీస్ ఒకటిలో కేవలం రెండు షాట్లను మాత్రమే కొట్టింది.

అయితే ఆ తర్వాత మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగింది. సిరీస్ 2, 3లలో నాలుగేసి షాట్లు కొట్టి సత్తా చాటింది. ఆరో సిరీస్ ముగిసే సమయానికి మను బాకర్ ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లింది. దీంతో మనుకు ఏదో ఒక పతకం ఖాయమని అందరూ భావించారు. కానీ బరిలో ఉన్న ప్రత్యర్థులు పట్టువదలకుండా పోరాడారు. దీంతో మనుబాకర్‌కు షాక్ తప్పలేదు. ప్రత్యర్థి షూటర్లు అసాధారణ ఆటతో ఒక్కసారిగా పుంజుకున్నారు. ఈ క్రమంలో మను కాస్త ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో ఏకాగ్రతను కోల్పోయి షాట్లను కొట్టడంలో విఫలమైంది. కీలక సమయంలో హంగేరి షూటర్ మేజర్ వెరోనికా 3 షాట్లను కొట్టి మను బాకర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. దీంతో వెరోనికాకు కాంస్య దక్కింది. మను బాకర్ మాత్రం నాలుగో స్థానానికే పరిమితమైంది. ఇక ఈ విభాగంలో కొరియా షూటర్ జిన్ యాంగ్ స్వర్ణం గెలుచుకోగా, ఫ్రాన్స్ షూటర్ కామెలీకి రజతం లభించింది.

తల్లికి భావోద్వేగ పోస్ట్
ఫైనల్లో ఓడిన తర్వాత స్టార్ షూటర్ మను బాకర్ తన తల్లికి భావోద్వేగపూరిత సందేశాన్ని పంపింది. తాను ఈ స్థాయికి చేరానంటే తల్లే కారణమని ఆ సందేశంలో పేర్కొంది. నా కోసం అన్నింటిని త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు. మీ సహకారం వల్లే ఎన్నో చీకట్లను చీల్చుకుంటూ బయటకు రాగలిగాను. నా కోసం అన్నింటిని త్యాగం చేసిన మీకు సదా రుణపడి ఉంటాను. అమ్మా.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. వీలైనన్ని సంవత్సరాలు మీరో నాతో ఉండాలి ఉంటు మను బాకర్ తన సందేశంలో పేర్కొంది. ఇక 25 మీటర్ల ఫైనల్లో నాలుగో స్థానంలో నిలువడం ఎంతో నిరాశ పరిచిందని ఆవేదన వ్యక్తం చేసింది. పతకం కోసం సర్వం ఒడ్డినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఫలితం తనను ఎంతో మనో వేదనకు గురి చేసిందని మను వాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News