Friday, February 21, 2025

ఉపాధికి ఊతమివ్వని ఉత్పాదక రంగం

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో 50% మంది స్వయం ఉపాధి రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఐఎస్‌ఒ నివేదించింది. ఒకరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి చూసుకోవాలని మన నేతలు నిత్యం చేసే ప్రచారాన్ని చూసి ఇది మంచిదే అని అనుకోడానికి లేదు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా స్వయం ఉపాధి రంగం దారుణంగా ఉంది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి సపోర్ట్ ఉండదు. ఉద్యమిమిత్ర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గోపాలమిత్ర, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ప్రధాన మంత్రి సంచాయిని యోజన అన్నీ దండగమారి పథకాలే.

2022 లెక్కల ప్రకారం ఉద్యోగం పొందిన భారతీయుడు సగటున నెలకు 19,000 రూపాయల వేతనం పొందుతుంటే, స్వయం ఉపాధి రంగంలో సగటు భారతీయుడు రూ.11,973 మాత్రమే ఆదాయం పొందుతున్నారు.క్యాజువల్ కార్మికులు సగటున నెలకు కేవలం రూ.8,267 మాత్రమే వేతనం పొందుతున్నాడు. ఇందులో కూడా స్త్రీ పురుషుల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా స్వయం ఉపాధి రంగంలో స్త్రీలు ఆదాయం మరీ తక్కువగా వస్తుంది. వాస్తవానికి వారి కష్టాన్ని లెక్కించడం లేదు. భారతదేశంలో యువత ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే రేటు అంటే శ్రామికశక్తి భాగస్వామ్య రేటు(లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు) కూడా గణనీయంగా తగ్గిపోతుంది.

2000 సంవత్సరంలో ఈ రేటు 54% ఉండగా, 2022 నాటికి 42 శాతానికి పడిపోయింది. శ్రామికశక్తి భాగస్వామ్య రేటు అంటే ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న 16-64 సంవత్సరాల వయస్సు గల శ్రామిక జనాభాలో ఉపాధి కోరుకునే వారి జనాభా శాతం. ఇది ఒక కీలకమైన ఆర్థిక సూచిక. గత రెండు దశాబ్దాలుగా ఇది గణనీయంగా పడిపోయింది. జనాభాలో కార్మికుల సంఖ్య కూడా 2000 సంవత్సరంలో 60.2 శాతం నుంచి 2022 నాటికి 52.9 శాతానికి పడిపోయింది. కార్మిక భాగస్వామ్య రేటు కూడా పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువపడిపోయింది. 2000 – 2022 మధ్య పురుషుల్లో ఇది 8.1% పడిపోగా, మహిళల్లో 14.4 శాతం పడిపోయింది. 20002019 సంవత్సరాల మధ్య మొత్తం ఉద్యోగాల్లో నైపుణ్యాలు గల ఉద్యోగాలు పెరుగుతూ వచ్చాయి.

మరోవైపు చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కరువయ్యింది. బ్యాంకుల నుండి అరువు పుట్టాలంటే డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి, సిబిల్ రేటింగ్ ఉండాలి, బ్యాంక్ అధికారులతో సత్సంబంధాలు ఉండాలి, లిక్విడ్ షూరిటీ ఉండాలి. దాదాపు ఎనభై శాతం దరఖాస్తులు తిరస్కరించపడుతున్నాయి. ప్రజాధనంతో లావాదేవీలు జరిపే ఈ బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో బంధం ఉన్న వారికి లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు. వాటిని వసూళ్లు చేయలేక, కనీసం వారిని ప్రశ్నించడం కూడా చేతకాక ప్రజాధనాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తున్నారు.

సామాన్యుల విషయంలో బ్యాంకులు ప్రవర్తించే తీరు దారుణంగా ఉంటుంది. రైతులు, కిరాణా వ్యాపారస్తులు, చిన్న పారిశ్రామికవేత్తలు తాము చెల్లించాల్సిన వాయిదా సక్రమంగా లేకపోతే విరుచుకుపడే బ్యాంకులు బడాబాబుల పారు బకాయిల విషయంలో ఎందుకు నోరు మెదపలేదు. ప్రతి రోజూ కనీసం పది నుంచి ఇరవై వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మూసివేస్తున్నట్టు లేదా వేలం వేస్తున్న ప్రకటనలు హిందూ పత్రికలో కనిపిస్తాయి.  ఒక్క హిందూ దినపత్రిక దక్షిణ భారత ఎడిషన్‌లో నెలకు వెయ్యికి పైగా పరిశ్రమలకు ఉరితాడు వేస్తున్నట్టు బ్యాంకుల ప్రకటనలు కనిపిస్తాయి.

మొత్తం ఆంగ్ల పత్రికల్లో ప్రకటనలు లెక్కిస్తే ఈ సంఖ్య 2000 కి తక్కువేమీ కాదు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల తాము అందిస్తున్న సహకారం చాలా ఉందని, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ ఫోటోతో పూర్తి పేజీ ప్రకటనలతో అప్పుడప్పుడు దేశంలోని అన్ని భాషలలో గొప్పగా చెబుతుంటుంది. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు గొప్ప అవకాశం అంబుడ్స్‌మెన్ ఈ తరహా విధానమని, తక్షణ పరిష్కారానికి వినియోగించుకోవాలని రిజర్వు బ్యాంకు తరపున ప్రకటనలలో సారాంశంగా ఉంటుంది.

పై ప్రకటనలలో వాగాడంబరం తప్ప చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలు ఏమీ లేవని తేలుతున్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఓ లెక్క ప్రకారం 60 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతకు గురైనట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ కారణంగా ఈ సంఖ్య తీవ్రంగా పెరిగింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వీరికి ఒరిగింది ఏమీ లేదు. స్వయంకృషితో పది మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తున్న వారికి ప్రోత్సాహం కరువవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News