ఇస్లామాబాద్: పాకిస్థాన్ మునుపెన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తుతుండడంతో జన జీవనం చిన్నాభిన్నం అయింది. సుమారు 3.3 కోట్ల మంది ప్రజలపై వర్షాలు, వరదల ప్రభావం పడినట్టు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,456 మంది గాయపడగా, 982 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రధాని షెబాజ్ షరీఫ్ పాక్ సైన్యం సాయాన్ని కోరాల్సి వచ్చింది.
వరదల వల్ల 6.8 లక్షల ఇళ్లు నీళ్లలో మునిగాయి. 3,000 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, 150 వంతెనలు కూలిపోయాయి. దేశంలో సగానికి పైనే ప్రాంతాలు వరద నీటిలో ఉన్నట్టు పాకిస్థాన్ కు చెందిన న్యూస్ వెబ్ సైట్ డాన్ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. లక్షలాది మంది ప్రజలు నీటిలో చిక్కుకున్నట్టు పేర్కొంది. 57 లక్షల మందికి ఆశ్రయం కోల్పోయినట్టు తెలిపింది.
ముఖ్యంగా ఖైబర్ ఫక్తున్ క్వా, బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్సులలో 36 గంటల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాలకు రైలు సేవలు నిలిచిపోయాయి. క్వెట్టా, బలూచిస్థాన్ ప్రావిన్సులకు విమాన సేవలు కూడా రద్దయ్యాయి. ఐక్యరాజ్యసమితి అత్యవసర సాయం కోసం పాక్ అభ్యర్థించింది.
Torrential rain in different parts of KPK, flooding situation at Swat Bypass!#FloodSituation #Sindh #Sindhfloods #SindhNeedsDisasterRelief #balochistanfloods pic.twitter.com/pkjHO1lmjB
— Chaudhary Parvez (@ChaudharyParvez) August 26, 2022