మనతెలంగాణ, సిటిబ్యూరోః కొత్త ఏడాది పోలీసుల ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కెబిఆర్ పార్క్ వద్ద అర్ధరాత్రి ఏర్పాటు చేసిన కేక్‌ను ఆయన కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర(2024) వేడుకలు నగరంలో ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.
కొత్త సంవత్సరంలో అనేక సవాళ్లు ఉన్నాయని, భూఆక్రమణలు, డ్రగ్స్, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరింత మెరుగ్గా ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రజలకు మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తూ , ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. బేసిక్ పోలీసింగ్‌ను అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్ టెస్ట్ కోసం కొత్త పరికరాలను వినియోగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ విక్రం సింగ్ మాన్, అడిషనర్ సిపి విశ్వప్రసాద్, ఎవి రంగనాథ్, జాయింట్ సిపి సత్యనారాయణ, డిసిపిలు, ఎడిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
సైబరాబాద్ ప్రజలకు థ్యాంక్స్‌ః అవినాష్ మహంతి, పోలీస్ కమిషనర్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని సైబరాబాద్ పోలీస్ కమిషర్ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజలు పోలీసులకు అన్ని విధాలా సహకరించారని తెలిపారు. సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో వీకెండ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు సిపి అవినాష్ మహంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.