అమెరికాలో 10 లక్షల డాలర్ల ఆస్తుల వినియోగంపై బైడెన్ ఆంక్షలు
అదే బాటలో న్యూజిలాండ్, మిలిటరీ నేతలపైనా ప్రయాణ ఆంక్షలు
ఈ నెల 22న సమావేశమవుతున్న ఇయు దేశాలు
సియోల్: మయన్మార్‌లో గత వారం తిరుగుబాలు తర్వాత సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుని సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ వేళ్లూనుకునేందుకు అవకాశాలు లేకుండా చేసిన తర్వాత ఆ దేశాలతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అమెరికాలోని 10 లక్షల డాలర్ల ఆస్తులను మయన్మార్ సైనిక అధికారులు ఉపయోగించుకోకుండా అడ్డుకునేందు ఎగ్జిక్యూటివ్ ఆదేశాన్ని జారీ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ప్రకటించారు. అయితే అక్కడ వైద్య సేవా కార్యక్రమాలకు మాత్రం తమ సాయం కొనసాగుతుందని బైడెన్ ప్రకటించారు. అంతేకాకుండా ఆ దేశంపై మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా సైనిక పాలనలో ఉన్న మయన్మార్ క్రమంగా ప్రజాస్వామ్య పాలన దిశగా మరలేందుకు మిలిటరీ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉండడంతో ఆ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తేసిన చాలా పాశ్చాత్య దేశాల్లో అమెరికా కూడా ఉంది.
అయితే ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దింపి, నోబెల్ బహుమతి విజేత, ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ తదితర నేతలను నిర్బంధంలో ఉంచడంతో ఆ ప్రక్రియ తాత్కాలికమేనని రుజువయింది. ఈ పరిణామాలపై న్యూజిలాండ్ చాలా తీవ్రంగా స్పందించింది. మయన్మార్‌తో అన్ని మిలిటరీ, ఉన్నత రాజకీయ సాయి సంబంధాలను నిలిపి వేస్తున్నామని, అక్కడి మిలిటరీ ప్రభుత్వానికి, దాని నేతలకు మేలు చేసి అన్ని రకాల సాయాన్ని నిలిపి వేస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. కొత్త మిలిటరీ ప్రభుత్వ నేతల ప్రయాణాలపైనా నిషేధం విధించింది. కాగా మయన్మార్‌తో ఐరోపా సమాజం సంబంధాలను సమీక్షించుకోవడానికి, ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడిని పెంచే మార్గాలను అన్వేషించడానికి ఈ నెల 22 ఇయు సమావేశం జరుగుతుందని 27 దేశాలకు సభ్యత్వం ఉన్న ఆ కూటమి విదేశీ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ బ్రసెల్స్‌లో చెప్పారు.
మరో వైపు మయన్మార్‌లో సంక్షోభం కారణంగా మానవ హక్కులపై ప్రభావం గురించి చర్చించడం కోసం ఐక్య రాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. అయితే మయన్మార్ పొరుగు దేశాలు ఈ విషయంలో ఎంతమేరకు కలిసి వస్తాయనేది అనుమానమే. ఎందుకంటే ఏసియాన్‌లో సభ్యులుగా ఉన్న ఈ దేశాలు ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతోనే తీసుకోవలసి ఉంటుంది. మయన్మార్ కూడా ఈ కూటమిలో సభ్య దేశం కావడం గమనార్హం.