మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్షంతో లక్షన్నర కోట్ల రూపాలయ ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో వైఫల్యాలకు గల కారణాలు ..వాటి వెనుక దాగిన సాంకేతిక లోపాలు.. ఈ పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి నియిమించిన నిఫుణుల కమిటీ తేల్చిన వాస్తవాలు ఏమిటీ అన్నది రాష్ట్ర ఇంజనీరింగ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ప్రభుత్వంతోపాటు ఉత్తర తెలంగాణ రైతాంగం కూడా కమిటీ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేలను తిరిగి పునరుద్దరించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు కమిటి ఇవ్వనున్న నివేదికపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఈనెల 6న తొలివిడతగా రాష్ట్రంలో పర్యటించింది.
నాలుగు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. బ్యారేజీలకు జరిగిన నష్టాలను అంచనా వేసింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారలుతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహించింది. ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. మలిదఫాగా నిపుణుల కమిటీ ఈ నెల 20న రాష్ట్రానికి వచ్చింది. జలసౌధలోని నీటిపారుదల ప్రధాన కార్యాలయం కేంద్రంగా మూడు రోజలు పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించింది. వివిధ కీలక విభాగాల అధిపతులు, ముఖ్య అధికారులతో విడివిడిగా భేటిలు జరిపింది. సాంకేతిక పరమైన అంశాలతో కూడిన ప్రశ్నల వర్షం కురిపించింది. సందేహాల నివృత్తి కోసం గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. వారి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. నిపుణుల కమిటీకి నేత్రుత్వం వహిస్తున్న సిడబ్యుసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తోపాటు ఈ కమిటీలోని వివిధ విభాగాలకు చెందిన నిపుణులు వి.సి విద్యార్ధి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా బ్యారేజీల నిర్మాణంలో వైఫల్యాలను వెలికి తీసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇంతా చేసినా నీటిపారుదల శాఖకు చెందిన అధికారుల నుంచి. బ్యారేజిలు నిర్మించిన కాంట్రాక్టు కంపెనీల నుంచి అసలు నిజాలు మాత్రం బయటపడలేదు.
కాళేశ్వరం ఎతిపోతల పథకంలో డిపిఆర్ రూపకల్పను నుంచి డిజైన్ల రూపకల్పన, బ్యారేజీల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక, భూ భౌగోళిక అధ్యయనాలు, పునాదుల లోతుల్లో నేల స్వభావం వాటి పరిక్షలు, సాంకేతిక పరమైన ఉన్నతా స్థాయి సంస్థల అభిప్రాయాలు, బ్యారేజిల నిర్మాణం, వాటి పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిక్షలు వాటి నిర్ధారణ తదితర అంశాల్లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలో అత్యున్నత స్థానంగా బావించే ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా తొలి నుంచి ఉంటూ వచ్చిన మురళీధర్ రావుతోపాటు మరో ఈఎన్‌సి వెంకటేశ్వరరావుల నుంచి ముఖ్య సమాచారం తెలుసుకునే ప్రయత్నాల్లో కూడా అశించిన రీతిలో కమిటీ అడుగులు ముందుకు పడలేదు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, ప్రాజెక్టు ఆపరేషన్ మెయింటినెన్స్ అధికారుల నుంచి కూడా అవసరమైన సమాచారం వెలికి తీసే ప్రయత్నం చేశారు. నీటి పారుదల రంగానికి చెందిన వివిధ శాఖల ముఖ్య అధికారుల నుంచి రాబట్టుకున్న సమాచారాన్ని విడివిడిగా జరిపిన భేటీల్లో క్రాస్ చెక్ చేసుకున్నారు. వీటిలో కొన్నింటికి మాత్రమే ఖచ్చితమైన నిర్దారణ జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం కూడా ఉదయం రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజినీర్లు, రాష్ట్ర విజిలెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్‌తోపాటు మరికొందరు అధికారులతోనూ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం నిపుణుల కమిటీ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబరేటరీలో ఉన్న మేడిగడ్డ సహా ఇతర ఆనకట్టల నమూనాలను చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ పరిశీలించింది. కమిటీ దాదాపు మూడు గంటల పాటు బ్యారేజి నమూనాలను పరిశీలించింది. అందులోని సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంది. భూసార పరీక్షలు నిర్వహించిన ఇంజినీర్లతోనూ కమిటీ చర్చించి అన్ని అంశాలను ఆరా తీసింది. అనంతరం రాష్ట్ర పర్యటన ముగించుకొని కమిటీ దిల్లీ బయల్దేరి వెళ్లింది.
మరింత లోతుగా అధ్యయనం: అయ్యర్
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనలో నీటిపారుదల శాఖకు చెందిన వివిధ విభాగాల ముఖ్య అధికారులతో సమావేశాలు, సమీక్షలు, వివరాల సేకరణల అనంతరం తమ మూడు రోజుల పర్యటనను ముగించుకున్న నిపుణుల కమిటీ ఢిల్లీకి బయలు దేరేముందు మీడియాతో మక్తసరిగా కొన్ని విషయాలు వెల్లడించింది .నిపుణుల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజీలపై వివిధ అంశాలకు సంబంధించి ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణలో కొన్ని విషయాలు మాత్రమే వెలుగులోకి వచ్చినట్టు తెలిపారు. కీలకమైన వాటిని ,సాంకేతిక పరమైన ముఖ్య అంశాలు ఆధారాలతో బయటకు వెలికి తీయాలంటే మరింత లోతుగా అధ్యయనం అవసరం ఉందన్నారు.