మూర్ఛ (ఎపిలెప్సీ) అనేది కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన అనారోగ్య పరిస్థితి. ప్రతి సంవత్సరం సుమారు 1,80.000 వరకు కొత్త మూర్ఛ కేసులు వస్తున్నాయి. ఇందులో 30 శాతం పిల్లలకు వస్తుంది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వారి మెదడు లోని కార్యకలాపాలు అసాధారణంగా మారతాయి. కొన్నిసార్లు వారి ప్రవర్తనలో కూడా మార్పులు ఉండవచ్చు. ఇది జన్యుపరంగా తలెత్తవచ్చు. లేదా మెదడుకు గాయం , స్ట్రోక్ ఫలితంగా సంభవించవచ్చు. మూర్ఛ వ్యాధి ఉన్నవారికి అకస్మాత్తుగా ఫిట్స్ వస్తే తక్షణం ఏం చేయాలనే గందరగోళం చాలా మందిలో కలుగుతుంది. కొందరు వెంటనే చేతిలో తాళాల గుత్తులు ఉంచుతారు. లేదా ఇనుపరాడ్ పట్టుకునేలా చేస్తారు.
Also Read: వెరికోజ్ వెయిన్స్‌కు కారణాలు తెలుసా?
ఉల్లిపాయల వాసన చూపించినా, సాక్స్ వాసన చూపించినా, ఫిట్స్ తగ్గుతాయని నమ్ముతుంటారు. కానీ వాస్తవంగా చూస్తే ఇవన్నీ అపోహలు మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్‌ల రూపంలో వస్తుంటాయి. ఇవి ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏంచేసినా, చేయకపోయినా వాటంతట అవే ఆగిపోతాయి. ఒకవేళ ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు మూర్ఛ కొనసాగితే వైద్యపరంగా అది అత్యవసర పరిస్థితిగా భావించాలి. వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. మూర్ఛ వ్యాధికి ప్రాథమిక చికిత్స ఏమిటంటే… వ్యక్తిని నేలపైన సౌకర్యంగా పరుండబెట్టాలి. గుంపుగా చుట్టుముట్టకుండా వారికి గాలి తగిలేలా చూడాలి. ఆ సమయంలో రోగికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వారిని మెల్లగా ఒకవైపుకు తిప్పండి. దానివల్ల శ్వాసపీల్చుకోడానికి సహాయపడుతుంది. వ్యక్తి చుట్టూ గరుకుగా, గట్టిగా లేదా పదునైనవి ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేయాలి.
Also Read: రోజూ 30 నిమిషాలు నడిస్తే క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు
దానిద్వారా గాయాలు తగలకుండా కాపాడుకోవచ్చు. వారి తలకింద తలగడ కానీ మృధువైన వస్త్రం కానీ ఉంచాలి. మెడచుట్టూ బిగుతుగా గొలుసులు వంటివి ఉంటే వాటిని వదులు చేయాలి. ఫిట్స్ వస్తున్నప్పుడు గట్టిగా ఆ వ్యక్తిని పట్టుకోవడం, వారి కదలికలను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించడం చేయవద్దు. రోగినోటిలో ఏమీ పెట్టవద్దు. నోటిలో నోరు పెట్టి శ్వాస అందించడం , సిపిఆర్ వంటివి చేయరాదు. వారంతట వారే శ్వాస తీసుకునేలా అవకాశం కల్పించాలి. వారు పూర్తిగా మూర్ఛ నుంచి స్పృహ లోకి వచ్చే వరకు వారికి నీరు లేదా ఆహారం అందించవద్దు. మూర్ఛ వ్యాధి సాధారణంగా ఒక పిరియడ్ నుంచి దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితి. దీన్ని మందుల ద్వారా ఆహార మార్పుల ద్వారా చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది.
Also Read: కృత్రిమ మానవ పిండాల సృష్టి
మూర్ఛకు కొన్ని ప్రధాన కారణాలు
పుట్టినప్పుడు తక్కువ ఆక్సిజన్ అందడం..మెదడులో కణితులు ఏర్పడడం, తలకు గాయాలు తగలడం, మెదడు గాయానికి కారణమయ్యే జన్యు పరిస్థితులు, మెనింజెటిస్, లేదా ఎన్సెఫలిటీస్ వంటి ఇన్‌ఫెక్షన్లు , సోడియం లేదా రక్తంలో చక్కెర వంటి పదార్ధాల అసాధారణ స్థాయిలు కారణాలుగా కనిపిస్తున్నాయి. మూర్ఛ వ్యాధి రాకుండా ఉండాలంటే టాబ్లెట్స్ మధ్యలో మానేయకూడదు. అధికంగా మద్యపానం చేయరాదు. కొకైన్, బ్రౌన్‌సుగర్ లేదా ఇతర డ్రగ్స్ వాడరాదు. నిద్రపోవడం తక్కువ కాకూడదు. మెరుస్తున్న లైట్లు, కొన్ని ఫోటోలు, కొన్ని నమూనాలు, ఫోటో సెన్సిటివ్ మూర్ఛకు కారణం కావచ్చు .
Also Read: ఉత్తాన పాదాసనంతో ఎన్నో ఉపయోగాలు…