బిఆర్‌ఎస్, వామపక్షాలు, మజ్లిస్ గైర్హాజరు
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే హజరు
బిఆర్‌ఎస్, గవర్నర్ మధ్య రాజకీయ విమర్శల దూమారం
ఎమ్మెల్సీ భర్తీ విషయంపై కెటిఆర్, కడియం ఆరోపణలు
విందుకు హాజరైతే వివాదం రేగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ
మన తెలంగాణ/హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇచ్చిన తేనీటి విందు బిఆర్‌ఎస్, వామపక్ష , మజ్లిస్ నేతలు దూరంగా ఉన్నారు. బిజెపి తరఫున ఎన్వీ సుభాష్, ప్రకాశ్‌రెడ్డి మాత్రమే హాజరైయ్యారు. అదే విధంగా టిఎస్‌పిఎస్సీ నూతన చైర్మన్ మహేందర్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నగరంలో అందుబాటులో మంత్రులు కూడా హాజరయ్యారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం గవర్నర్ తేనీటి విందు కార్యక్రమానికి ఆ పార్టీ తరఫున నేతలు హాజరు కాకుండా దూరంగానే ఉన్నారు.
ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య దూరం ఏర్పడిందని విమర్శలతో సంబంధాలు బెడిసికొట్టడంతో రాజ్‌భవన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అది రాజ్‌భవన్ కాదు రాజకీయ భవన్ ఆమె గవర్నర్ కాదు బిజెపి ఏజెంట్ అంటూ అప్పటి మంత్రులు, బిఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల భర్తీ విషయంలో ఎమ్మెల్యేలు కెటిఆర్, కడియం గవర్నర్‌పై శుక్రవారం హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ ఆరోపణలు చేసిన రోజు తేనీటి విందుకు హాజరైతే మరింత వివాదం రేగుతుందనే ఉద్దేశంతోనే దూరంగా ఉండిపోయారని, గత పాలనలోని భేదాభిప్రాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న రాజకీయ సర్కిల్‌లో చర్చ సాగింది. బిఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను పాత్రికేయులు గవర్నర్‌తో ప్రస్తావించగా ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు.