Monday, December 23, 2024

పోలవరం పరేషాన్!

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ముందుకు సాగుతాయా? అసలు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తవుతాయా? లేదా? అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఏకంగా 120 కిలోమీటర్ల మేరకు ముంపు సమస్యను ఇది సృష్టించబోతున్నది.ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిర్దేశించుకొన్న కాలపరిమితిని 2005 నుంచి ఇప్పటి వర కు ఆరుసార్లు మార్చుకొంటూ పోయారని నీటిపారుదల శా ఖలోని కొందరు సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అంతేగాక ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనాలను కూడా అయిదుసార్లు పెంచుకొంటూ పోయారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయహోదాను కల్పించిన తర్వాత కూడా మూడు సార్లు వ్యయ అంచనాలను సవరించాల్సి వచ్చింది.

దీంతో పోలవరంపై రాజకీయంగా అనేక విమర్శలు, తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎపి ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు ఒక ఎటిఎం మాదిరిగా మారిపోయిందని కూడా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పోలవరం ప్రాజెక్టు అయిదేళ్లయినా పూర్తికాదని చేసిన వ్యా ఖ్యలు కలకలం రేపుతున్నాయి. పైగా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా మంత్రి హరీశ్‌రావుకు ఉండడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గోదావరి నదికి వచ్చిన వరదల్లో ఎ క్కువగా ముంపునకు గురయింది తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలం నుంచి మొదలుకుంటే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్లు, రామగుండం వరకూ ముంపు సమస్య తలెత్తింది.

దీంతో రోజులు, వారాలు, నెలల తరబడి తెలంగాణ ప్రజలు వరద నీటిలోనే గడపాల్సి వచ్చిందని, అందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, ఆ ప్రాజెక్టు వ్యవహారాలన్నింటినీ తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఆ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తవ్వడం అంత ఈజీ కాదని, మరో అయిదేళ్ళయినా ఆ ప్రాజెక్టు పూర్తికాదని మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఏపీ ఇంజనీరింగ్ అధికారులు కూడా వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలన్నీ కేవలం 78.12 శాతం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణాల్లో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం (ఈ.సి.ఆర్.ఎఫ్) నిర్మాణాలు ఎంతో క్లిష్టమైనదని అంటున్నారు. ఈ రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణాలు చేపట్టాలంటే స్పిల్‌వే నిర్మాణాలు, స్పిల్ ఛానెల్, అప్రోచ్‌ఛానల్ నిర్మాణాలన్నీ పూర్తి కావాల్సి ఉంటుందని, ఇంకా మూడు డ్యాం గ్యాప్‌లను కూడా నిర్మించాల్సి ఉందని తెలిపారు.

ఒక్క రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణానికే ఏకంగా ఒక కోటి 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి దాని స్థానంలో డ్యాంను నిర్మించుకొంటూ రావాలని వివరించారు. రాక్‌ఫిల్ డ్యాం పొడవు 2.3 కిలోమీటర్లు ఉంటుందని, నది అడుగు భాగంలో 200 మీటర్ల వెడల్పుతో, 54 మీటర్ల ఎత్తులో, పైభాగంలో 12 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సి ఉంటుందని, అంతేగాక డ్యాంకు గట్టి పునాదిని నిర్మించాలంటే నది అడుగు భాగం నుంచి 125 మీటర్ల భూమి లోతుల్లో నుంచి నిర్మించుకొంటూ రావాలని వివరించారు. ఇంతటి భారీ నిర్మాణాలను చేపట్టాలంటే జీవనది అయిన గోదావరికి వరదలు లేని సమయంలో సాధారణంగా ఉండే కొద్దిపాటి ప్రవాహాన్ని కూడా దారి మళ్ళించి నిర్మాణాలు చేపట్టాలని వివరించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్ నిర్మాణాలకు 9,135 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. అయితే అందులో కేవలం స్పిల్‌వే మాత్రమే పూర్తయ్యింది. మిగతా స్పిల్ ఛానెల్, అప్రోచ్ ఛానెల్, కనెక్టివిటీలు పూర్తికానేలేదు.

పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనా ప్రస్తుతానికి 55,657 కోట్ల రూపాయలకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను ప్రకటించిందేగానీ పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడంలేదని, ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కూడా కేంద్రం రియంబర్స్ చేయడం లేదని, దాంతో ప్రాజెక్టు నిర్మాణాలన్నీ నత్తనడకన సాగుతున్నాయని కొందరు ఇంజనీరింగ్ అధికారులే అంగీకరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ సుమారు 25వేల కోట్ల రూపాయల వరకే ఖర్చు చేశారని, ఇంకనూ 31 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. అయితే 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు కేవలం 4,500 కోట్ల రూపాయలనే కేటాయించిందని, ఈ నిధులను ఖర్చు చేసినా కేంద్రం వెంటనే ఆ నిధులను రియంబర్స్ చేస్తుందనే నమ్మకం లేకనే నిధులను అవసరమైన మేరకు కేటాయించలేదని వివరించారు.

దీనికితోడు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 2,622 కోట్ల రూపాయల నిధులు ఏపీకి రావాల్సి ఉందని, ఆ నిధులను కేంద్రం విడుదల చేయడంలేదని తెలిపారు. ఇలా ఏపీ ప్రభుత్వ కేటాయింపులు తక్కువగా ఉండటం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా రియంబర్స్ చేయాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తుండటంతోనే నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తవుతాయనే నమ్మకం మాకు లేదని ఏపీలోని కొందరు సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే తెలంగాణ ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను తాము కూడా సమర్ధిస్తున్నామని ఏపీ అధికారులు, తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు పరస్పరం చర్చించుకొంటున్నారు.

అంతేగాక భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను పూర్తి చేయడానికి మరో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాల్సి ఉందని, నిధుల కొరత సమస్య తీవ్రంగా ఉండటంతో భూసేకరణ, నిర్వాసితుల కాలనీల నిర్మాణాల జోలికి వెళ్ళడంలేదని వివరించారు. ఇలా సమస్యల సుడిగుండంలో పోలవరం ప్రాజెక్టు ఉందని, నిర్ణీత గడువు అయిన 2023లో పూర్తి చేయడం సాధ్యంకాదని ఏపీ అధికారులే అంటున్నారని వివరించారు.

తాజాగా 2025 జూలై నెలాఖరు నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకొందని తెలిపారు. కానీ నిధుల కొరత సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తవుతాయా? లేవా? అనే అనుమానాలను కూడా వ్యక్తంచేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్టా పోలవరం పరిణామాలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News