Wednesday, January 22, 2025

ఇడికి జిఎస్‌టి సమాచారంపై పలు రాష్ట్రాల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) నెట్‌వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది టాక్స్ టెర్రరిజం, చిన్న వ్యాపారాలను భయపెట్టే ప్రయత్నమని ఆప్ పాలిత పంజాబ్ ఆర్థికమంత్రి హర్పల్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2002 పిఎంఎల్‌ఎ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం)కు సవరణలు చేస్తూ ఇడికి జిఎస్‌టి సమాచారం పంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

మంగళవారం ఢిల్లీలో జిఎస్‌టి కౌన్సిల్ 50వ సమావేశం జరిగింది. పిఎంఎల్‌ఎ పరిధిలోకి జిఎస్‌టి తెస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఈ భేటీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలిత ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వ ఆర్థికమంత్రులు ధ్వజమెత్తారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, చత్తీస్‌గడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల మంత్రులు కూడా వారితో స్వరం కలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, జిఎస్‌టి కౌన్సిల్ భేటీలోనే ఈ అంశంపైనా చర్చించాలని కోరారు. ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ గేమింగ్, 28% పన్ను
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్, హార్స్ రేసింగ్, క్యాసినోస్‌పై 28 శాతం పన్ను విధిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని ప్యానెల్ ఆన్‌లైన్ గేమింగ్‌పై చర్చించింది. అనంతరం గేమింగ్ ఆదాయం ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ అంగీకరించింది. ఈ నిర్ణయం మంత్రుల బృందం వద్దకు వెళ్లనుంది. ఈ పన్ను మొత్తం విలువపై విధిస్తామని సీతారామన్ తెలిపారు.

క్యాన్సర్ డ్రగ్స్‌కు పన్ను మినహాయింపు
అరుదైన వ్యాధులు, క్యాన్సర్‌పై పోరాటం చేసే డ్రగ్స్, మెడిసిన్లకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు ఆపరేటర్లు అందించే శాటిలైట్ లాంచ్ సేవలపై కూడా జిఎస్‌టిని మినహాయించారు.

సినిమా హాళ్లలో ఫుడ్‌పై పన్ను 5 శాతానికి తగ్గింపు
సినిమా హాళ్లలో లభించే ఆహార పదార్థాలు, పానీయాల ధరలు ఇకపై తగ్గనున్నాయి. థియేటర్లలో ఫుడ్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జిఎస్‌టి 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా పాప్‌కార్న్, డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలను సినిమా టిక్కెట్లతో కలిపి విక్రయిస్తే, అసలు ఉత్పత్తి ఆధారంగా పన్ను విధించాలని కూడా సూచించింది. చాలా కాలంగా థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News