Monday, December 23, 2024

పేదల పెన్నిధి ఎన్‌టిఆర్

- Advertisement -
- Advertisement -

ఆయనకు, పివికి భారతరత్న కోసం పార్లమెంటులో పోరాడుతాం

ఎన్‌టిఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించిన పలువురు టిఆర్‌ఎస్ నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి పురస్కరించుకుని పలువురు టిఆర్‌ఎస్ నాయకులు నివాళులర్పించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌రావు, శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్, పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్‌టిఆర్ అని కొనియాడారు. అలాంటి ఎన్‌టిఆర్‌కు కేంద్రం భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ మేరకు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఎంపి నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని, దివంగత పివి నరసింహారావు, స్వర్గీయ ఎన్‌టిఆర్‌లకు భారతరత్న కోసం పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుతామన్నారు. ఎన్‌టిఆర్‌కు భారత రత్న ఇవ్వాల్సిందేనన్నారు. ఈ విషయంలో ఇప్పటికే కొంత ఆలస్యమైందన్నారు. ఆయనకు భారత రత్న వచ్చేలా కృషి చేస్తామన్నారు.

తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన ఎన్‌టిఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్‌టిఆర్ అని నామా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తారాస్థాయిలో అభిమానులున్నారన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…..ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్‌టిఆర్ అని అన్నారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్‌టిఆర్ అని ఆయన పేర్కొన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. .ఆయన ఆదేశాల మేరకే ఇప్పటికీ అభిమానులు పని చేస్తున్నారన్నారు. ఎన్‌టిఆర్ ప్రధాన మంత్రి అవ్వాల్సింది.. జస్ట్ మిస్ అయిందన్నారు. ఎన్‌టిఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నడుస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్‌టిఆర్ పాలన అంతా పేదల సంక్షేమంపై దృష్టి సారించే కొనసాగిందన్నారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకు అన్ని రకాల సంక్షేమం చేరుకోవాలని ఎన్‌టిఆర్ ఆకాంక్షించారన్నారు. తన వద్ద అర్ధరూపాయి కూడా లేకున్నా.. తనని మంత్రి చేసి.. తనకు పెళ్లి చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఎన్‌టిఆర్ అని మోత్కుపల్లి కొనియాడారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ పాలన కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే
కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో ఎన్‌టిఆర్ నిలిచిపోతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఒక గొప్ప నటుడుగా, ప్రజానాయకుడుగా ఎందరో అభిమానులను తన సొంతం చేసుకొన్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎంతో అభిమానంతో అన్నగారు అని పిలుచుకొనే ఎన్‌టిఆర్ సామాజిక, పౌరాణిక చిత్రాలతో కోట్లాది మంది ప్రజల ఆదరణను సొంతం చేస్తుకున్నారన్నారు.

అనేక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారని తెలిపారు. రాముడు, భీముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి అనేక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయాడని అన్నారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారంటే అది ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణకు నిదర్శనంగా పేర్కొన్నారు. 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనతను కూడా దక్కించుకున్నారని తెలిపారు. భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఎన్‌టిఆర్ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు.

ఎన్‌టిఆర్ అంటే ఓ ప్రభంజనం

ఎన్‌టిఆర్ అంటే ఓ ప్రభంజనమని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రతి తెలుగింటి గడప బతికున్నంత కాలం ఆయన గుర్తుంచారన్నారు. ఎన్‌టిఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన ఆమె తన తండ్రిని స్మరించుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్‌టిఆర్….ఈ మూడు అక్షరాల పేరును తలుచుకుంటేనే తెలుగు ప్రజల్లో ఒక రకమైన వైబ్రేషన్ కలుగుతుందన్నారు. అంతటి శక్తి ఆ పేరుకు ఉందన్నారు. అందుకే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్నారు. సినిమా…రాజకీయ రంగాలకు ఆయనో సంచలనమన్నారు. ఆయన శతజయంతి ఉత్సవాలలో భాగంగా
తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అలాగే రూ.వంద నాణెంపై ఎన్‌టిఆర్ బొమ్మ ముద్రణ గురించి ఆర్‌బిఐతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. కాగా శనివారం నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించామన్నారు. ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అందులో నందమూరి బాలకృష్ణ, కె. రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఉన్నారని ఆమె తెలిపారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించనున్నామని పురందేశ్వరి తెలిపారు.

నివాళులు అర్పించిన ప్రముఖలు

ఎన్‌టిఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖలు ఆయనకు నివాళులర్పించారు. జూనియర్ ఎన్‌టిఆర్, కళ్యాణ్‌రామ్‌తో పాటు ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులంతా తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మాజీ మంత్రి పరిటాల సునీత, టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, పిన్నమనేని సాయిబాబా, బాలరాజ్‌గౌడ్, నల్లెల కిషోర్, సుధాకర్‌గౌడ్‌తో పాటు ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ
తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ సభ్యులే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ, తెలుగుజాతి గర్వపడేలా చేసిన వ్యక్తి ఎన్‌టిఆర్ అని అన్నారు. రాజకీయంగా తనను ఎంతగానో ప్రొత్సహించారన్నారు. ఆయనే వల్లే నేడు ఎంతోమంది నాయకులుగా కొనసాగుతున్నామన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించటంతో తన జన్మ ధన్యమైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News