పాట్నా: ఎన్‌డిఎ కూటమిలోని చాలా పార్టీలు భయంతో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపితో కలిసి ఉంటున్నాయని, ఎన్నికల సమయంలో ఈ పార్టీలన్నీ ఆ పడవ నుంచి డూకడం ఖాయమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి రూపకల్పనలో ముఖ్యభూమికను పోషించిన వారిలో ఒకరైన జెడియు నాయకుడు నితీశ్ కుమార్ శుక్రవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2024 లోక్‌సబ ఎన్నికల్లో ఎన్‌డిఎ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా గురువారం లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై చేసిన విమర్శలను విలేకరులు ప్రస్తావించగా దేశ పురోభివృద్ధి కోసమే తామంతా చేతులు కలిపామని ఆయన చెప్పారు. ఇప్పుడు భయం కారణంగా ఎన్‌డిఎ వెంట ఉన్న చాలా పార్టీలు ఎన్నికల ప్రకటన వచ్చిన మరుక్షణం అక్కడి నుంచి పారిపోయి ఇండియా కూటమి వైపు రావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.
మణిపూర్ హింసాకాండతోపాటు దేశం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో ప్రతిపక్షాలు విజయవంతమయ్యాయని అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావిస్తూ నితీశ్ చెప్పారు. దురదృష్టవశాత్తు అధికార కూటమి గుప్పిట్లో మీడియా ఉందని, ఈ కారణంగానే ప్రతిపక్షాలకు చాలా తక్కువ స్థానం మీడియాలో దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు.