Saturday, December 21, 2024

రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు…పోలీసుల కూంబింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపాయి. ఒక పక్క శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించిన పోలీసులు, మరొకవైపు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తమ ఉనికిని చాటే విధంగా ఎన్నికల వేళ విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహ రచన చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో అడుగడుగూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చర్యలను మరింత ముమ్మరం చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలలోనూ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి విదితమే. తాజాగా పార్టీ యాక్షన్ టీమ్లను రంగంలోకి దింపినట్లు ములుగు జిల్లాలో కొన్ని పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో పోలీసులు మరింతగా అప్రమత్తమ య్యారు.

ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలకు మూడు రోజుల ముందు కౌసల్వార్ ప్రాంతానికి వచ్చిన బిజెపి నేత రతన్ దూబేను మావో యిస్టులు హతమార్చారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఓ రాజకీయ పార్టీ నేత హత్యకు గురికావడం ఇదే తొలిసారి కాదు. మొహ్లా-మాన్‌పూర్-అంబగఢ్‌చౌకీ జిల్లాలోని ఔంధీ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత గ్రామమైన సర్ఖేడాలో గతంలో బిజెపి నాయకుడు బిర్జురామ్ తారామ్‌ను కాల్చి చంపారు. దుర్గాపూజ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అతడిపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఈ ప్రాంతంలో దుర్గా విగ్రహ ప్రతిష్టాపనను నక్సలైట్లు వ్యతిరేకించారని చెప్పారు. కానీ బిర్జురామ్ అంగీకరించలేదు, అతను దుర్గా పూజ ప్రారంభించాడు, ఆ తర్వాత అతను నక్సలైట్ల లక్ష్యంగా మారాడు.

తెలంగాణలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ పేర్లను సైతం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 614 పోలింగ్ స్టేషన్లను మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్ లుగా గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తూ, డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు బెదిరింపు లేఖలు రాస్తున్న మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్ కదలికలతో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్ చర్యలను తీవ్రతరం చేశారు. ఇటీవల మావోయిస్ట్ పార్టీ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News