రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఒక నక్సల్ మరణించాడు. అతని తలపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉందని దంతేవాడ జిల్లా ఎస్‌పి అభిషేక్ పల్లవ మంగళవారం తెలిపారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల మెరుపుదాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించిన సంఘటన జరిగిన రెండు వారాల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
నీలవాయ అడవుల్లో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జిల్లా రిజర్వ్ పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఒక నక్సల్ మరణించినట్లు ఎస్‌పి తెలిపారు. మరణించిన నక్సల్‌ను కోసాగా పోలీసులు గుర్తించారు. అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీలవాయలోని మల్లపర గ్రామానికి చెందిన కోసా గత 15 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నాడని, మలంగిర్ ఏరియా కమిటీ సభ్యుడైన అతను మిలిటరీ నిఘా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నాడని పల్లవ వివరించారు. నక్సల్ చర్యలకు సంబంధించి 15 నేరాలతో అతనికి సంబంధం ఉందని, ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఒక 9 ఎంఎం పిస్టల్, ఒక నాటు బాంబు, ఒక మజిల్ లోడింగ్ గన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక 3 కిలోల ఐఇడి, వీపునకు తగిలించుకునే సంచి, మందులు, ఇతర నిత్యావసర వస్తువులు కూడా అక్కడ లభ్యమయ్యాయని ఆయన చెప్పారు.